రాజధానికి చట్టబద్ధత కల్పించేందుకు తీర్మానం చేసింది ఏపీ అసంబ్లీ. కేంద్రం కూడా విభజన చట్టంలో పెట్టేస్తుంది. అంత వరకూ బాగానే ఉంది. కానీ జగన్ సీఎం అయితే రాజధానిని మార్చలేరన్న ప్రచారం మాత్రం అవాస్తవం. మన దేశంలో అమలు చేసినవే చట్టాలు. అమలు చేయకూడదనుకుంటే..దాని కోసం పాలకులు ఎన్నో మార్గాలు వెదుకుతారు. రాజధాని విషయంలో చట్టబద్ధత ఉంటే ఇక మార్పు అసాధ్యం అనుకోవడం అమాయకత్వమే అవుతుంది. వ్యవస్థలను ఎలా వాడుకోవాలో, చట్టాల్లోని లొసుగులను ఎలా వెతకాలో తెలిసిన పాలకులకు ఏదీ అసాధ్యం కాదు.
చట్టాన్ని అమలు చేసే చిత్తశుద్ధి ముఖ్యం
విభజన చట్టంలో అమరావతి పేరు చేర్చినంత మాత్రాన అది శాశ్వతం అయిపోదు. చట్టాలు అనేవి పాలనను క్రమబద్ధం చేయడానికి ఉంటాయి కానీ, పాలకుల పట్టుదలను అడ్డుకోలేవు. గతంలో మూడు రాజధానులు అనే ప్రతిపాదన తెచ్చినప్పుడు, అమరావతిని తీసేస్తున్నామని వారు ఎక్కడా చెప్పలేదు. కానీ, అభివృద్ధిని ఆపేయడం ద్వారా, నిధులను మళ్లించడం ద్వారా ఆ ప్రాంతాన్ని ఒక ఎడారిగా మార్చగలిగారు. అంటే, చట్టాన్ని మార్చకపోయినా, దాని ప్రాధాన్యతను తగ్గించే నిర్వీర్య ప్రక్రియ రాజకీయంగా చాలా సులభం.
జగన్ పాలసీ ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని
ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే అధికారం ఉంటుందనేది జగన్ చెప్పేమాట. విశాఖలోని రుషికొండపై నిర్మించిన భవనాలు కేవలం గెస్ట్ హౌస్లు మాత్రమే కావు, అవి ఒక సమాంతర సచివాలయానికి పునాదులు. చట్టం ప్రకారం రాజధాని అమరావతిలోనే ఉన్నా, క్యాంప్ ఆఫీస్ పేరుతో పాలకుడు విశాఖ నుంచే చక్రం తిప్పవచ్చు. జగన్ అమరావతిని రాజధానిగా కొనసాగిస్తానని ప్రకటన చేసి.. సీఎంకాగానే రాజధాని నిర్మాణానికి అవసరమైన రూ. 50 వేల కోట్ల ప్రాజెక్టును అర్ధాంతరంగా ఆపేయడం, అంతర్జాతీయ సంస్థలైన వరల్డ్ బ్యాంక్ వంటి వాటిని వెనక్కి వెళ్లేలా చేశారు. తర్వాత సీఎం అయినా ఇలా చేయరన్న గ్యారంటీలేదు.
యువత భవిష్యత్తు , పెట్టుబడుల పరిస్థితి
రాజధాని అంటే కేవలం భవనాలు కాదు, అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ. ఐటీ కంపెనీలు, మౌలిక సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలు అన్నీ నమ్మకం మీద ఆధారపడి వస్తాయి. పాలకుడు మారినప్పుడల్లా రాజధాని మారుతుందన్న భయం ఉంటే ఏ పెట్టుబడిదారుడూ ఏపీ వైపు చూడడు. యువతకు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే నిలకడైన పాలన, రాజధాని పట్ల స్పష్టమైన విజన్ ఉన్న నాయకత్వం అవసరం. గందరగోళం సృష్టించే ధోరణి ఉన్న నాయకుడు అధికారంలో ఉంటే, చట్టం ఉన్నా లేకపోయినా అభివృద్ధి కుంటుపడుతుంది.
అమరావతి పూర్తయ్యేవరకూ నాయకత్వం మారకూడదు !
అమరావతిని ఎవరూ మార్చలేరు అనే ధీమా మంచిదే. కానీ మార్చబోము .. అమరావతిని అభివృద్ధి చేస్తామని వైసీపీ ఇప్పటికీ ప్రకటించలేదు. ప్రకటించినా నమ్మే పరిస్థితుల్లో జనం లేరు. రాజ్యాంగబద్ధంగా ఉన్న అధికారాలను వాడుకుని, వ్యవస్థలను మేనేజ్ చేసి, ఒక ప్రాంతాన్ని పనికిరాకుండా చేసే శక్తి అధికారంలో ఉన్న వారికి ఉంటుంది. ఆ పని గతంలో జగన్ చేశారు. వస్తే మళ్లీ చేస్తారు. రాజధాని మనుగడ అనేది కేవలం చట్టం మీద కాదు, ఆ చట్టాన్ని అమలు చేసే వ్యక్తి ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుంది. ఏపీ భవిష్యత్తు నిలవాలంటే, రాజధానిని ఒక సెంటిమెంట్ గా కాకుండా ‘కమిట్మెంట్’ గా భావించే నాయకత్వం కొనసాగాల్సిన అవసరం ఉంది.
