కాళేశ్వరం రిపోర్టుపై చర్చించిన అసెంబ్లీ చర్యలు సీబీఐ తీసుకోవాలని సిఫారసు చేసింది. రాష్ట్రాలు సిఫారసు చేసే కేసుల్ని సీబీఐ తీసుకోవచ్చు. ఖచ్చితంగా తీసుకోవాలా లేదా అన్నది సీబీఐ ఇష్టం. సీబీఐకి ఆసక్తి లేకపోతే బలవంతంగా తీసుకున్నా.. ముందుకు సాగేదేమీ ఉండదు ఇప్పుడు సీబీఐకి అన్ని ఆధారాలతో సహా తెలంగాణ ప్రభుత్వం సిఫారసు పంపాల్సి ఉంటుంది. సీబీఐ తీసుకుంటుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే ఈ నిర్ణయం మాత్రం రాజకీయవర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
కేసీఆర్ జుట్టు బీజేపీ చేతుల్లోకి !
సీబీఐ చేతుల్లోకి కాళేశ్వరం వెళ్లిందంటే.. బీజేపీ ఎంత సీరియస్ గా తీసుకుంటే కేసు విచారణ అంత సీరియస్ గా సాగుతుంది. అందులో సందేహమే లేదు. అందుకే రేవంత్ రెడ్డి ఈ కేసును సీబీఐకి సిఫారసు చేయాలని నిర్ణయించుకోవడంతో బీజేపీ నేతల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమయింది. ఇలాంటి నిర్ణయం ఉంటుందని వారు కూడా అనుకోలేదు. అందుకే బీఆర్ఎస్ తో పాటు వారు కూడా చర్చ నుంచి బాయ్ కాట్ చేశారు. సీబీఐకి ఇస్తారని తెలిస్తే.. బీజేపీ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి.. కేసును సీబీఐకి ఇవ్వాలని గట్టిగా వాదించి ఉండేవారు.
ఇక కేసీఆర్కు బీజేపీ విషయంలో మరిన్ని కష్టాలు
ఇప్పటికే బీజేపీని పల్లెత్తు మాట అనలేకపోతున్న కేసీఆర్, బీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు కాళేశ్వరం సమస్యలు చుట్టు ముట్టనున్నాయి. సీబీఐ ..కాళేశ్వరం అవకతవకలపై కేసు నమోదు చేస్తే.. ఇక పూర్తి స్థాయిలో సరెండర్ కావాల్సిందే. వారు ఏం చెబితే అది చేయాల్సిందే. కేసీఆర్ కు ఓ రకంగా సీబీఐకి ఇవ్వడం రిలీఫే. సీఐడీ విచారణ అయితే ఏ క్షణమైనా అరెస్టు చేస్తారని టెన్షన్స్ పడాల్సి వచ్చేది. కానీ ఇపుడు మాత్రం .. అరెస్టు విషయంలో నిర్ణయం కేంద్ర ఏజెన్సీది కావడంతో కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ బీజేపీకి అణిగిమణిగి ఉండాల్సిందే.
ఆయుధాన్ని రేవంత్ ఎందుకు వదిలేశారు?
సాధారణంగా ఇలాంటి రాజకీయంగా ఉపయోగపడే ఆయుధాల్ని అధికార పార్టీలు దగ్గరే ఉంచుకుంటాయి. ఇతరులకు ఇవ్వవు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడి సిద్ధం చేసుకున్న ఆయుధాన్ని బీజేపీకి ఇచ్చేశారు. ఆయన నిర్ణయం వెనుక కాంగ్రెస్ పార్టీలోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో రాజకీయం చేశారన్నది ఎక్కువమంది అభిప్రాయం. తాము కాళేశ్వరంపై చర్యలు తీసుకుంటే అది కక్ష సాధింపుగా ప్రజలు భావిస్తారని అది తమకు రాజకీయంగా నష్టమని..కేసీఆర్ కు సానుభూతి వస్తుందని అనుకున్నారు. అదే సమయంలో సీబీఐకి సిఫారసు చేస్తే.. చర్యలు తీసుకుంటే.. అంత కంటే కావాల్సిందేమీ లేదు..తీసుకోకపోతే.. ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ప్రచారం చేయవచ్చని ప్లాన్ చేసుకున్నట్లుగా భావిస్తున్నారు.
కారణం ఏదైనా ఇక నుంచి కాళేశ్వరం వివాదం బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మాత్రమే ఉండేలా సీఎం రేవంత్ నిర్ణయం చేసింది. ఇది కాంగ్రెస్ కు రాజకీయంగా లాభమా.. నష్టమా అన్నది జరగబోయే పరిణామాలే నిర్ణయించాల్సి ఉంది.