ఎడిటర్స్ కామెంట్ : రైతుల్ని కార్పొరేట్‌కు కట్టబెట్టేస్తే కష్టాలు తీర్చినట్లా..!?

పాలకుడు పాషాణ హృదయుడైతే ప్రజల కన్నీళ్లు ఆయనను కరిగించలేవు..! పాలకుడు మొండివాడైతే ప్రజల కష్టాలు ఆయనను కదిలించలేవు..! పాలకుడు తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అని అనుకుటే.. ఆయన నిర్ణయాలను ఎవరూ మార్చలేరు..!. ప్రస్తుతం దేశంలో కొన్ని ప్రభుత్వాల తీరు చూస్తే ఇదే అభిప్రాయం కలుగుతోంది. ఢిల్లీని చుట్టుముట్టిన రైతులు… ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతున్నారు. వారి పోరాటంలో నిజాయితీ కనిపిస్తోంది. తమ జీవనాధారాన్ని ఎవరో తీసుకెళ్లిపోతారన్న ఆవేదన కనిపిస్తోంది. అంతకు మించి .. పోరాడి వ్యవసాయాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యం కనిపిస్తోంది. కానీ పాలకుల్లో అంతకు మించిన మొండితనం కనిపిస్తోంది. ప్రజల పట్ల కర్కశత్వం కనిపస్తోంది. రైతులపై తరచూ జరుగుతున్న లాఠీచార్జి … ప్రజల్ని కన్నబిడ్డల్లా చూడాల్సిన పాలకుల పాషాణ హృదయాన్ని సాక్షాత్కరింప చేస్తోంది.

నిజంగానే కేంద్ర వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయా..?

కేంద్ర ప్రభుత్వం గుట్టుగా మూడు వ్యవసాయ బిల్లుల్ని పాస్ చేసేసింది. ఆ మూడు బిల్లుల్లో మొదటిది నిత్యవసర సరకులసవరణ బిల్లు, రెండోది ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్(ప్రమోషన్, ఫెసిలిటేషన్) బిల్, మూడోది ‘ది ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్ . బిల్లుల పేర్లలో చూస్తే ఈ మూడు రైతుల శ్రేయస్సు కోసం ఉద్దేశించినట్లుగా చెబుతున్నారు. మరి రైతులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు..? . రైతులు పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని మూడో చట్టంలో ఉంది. అలా అమ్ముకుంటే.. స్థానిక ప్రభుత్వాలు కూడా ఎలాంటి పన్నులు, ఫీజులు వసూలు చేయకూడదని చట్టంలో నిర్దేశించారు. ప్రధానంగా వీటిని ప్రచారం చేస్తున్నారు. కానీ..ఆ చట్టాల్లో ఈ రెండు మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నింటినీ కాస్త పరిశీలిస్తే.. బహుళ జాతి కంపెనీల కోసమే ఆ చట్టాలున్నాయన్న అభిప్రాయం ఏర్పడింది. కాంట్రాక్ట్ ఫార్మింగ్ దగ్గర నుంచి కనీస మద్దతు ధరకు గ్యారంటీ లేకపోవడం వరకూ చాలా అంశాలు అందులో ఉన్నాయి. రైతులు వర్తకులు, బహుళ జాతి కంపెనీల గుప్పిట్లో చిక్కుకునేలా అనేక అంశాలున్నాయని కొంత మంది నిపుణులు చెబుతున్నారు. అయితే రైతుల ఆందోళన ప్రధానంగా కనీస మద్దతు ధర ఉండదని, ప్రభుత్వం కొనుగోలు నిలిపివేస్తుందని ఆందోళన చెందుతున్నారు.

రైతులు ఎక్కడికైనా తీసుకెళ్లి అమ్ముకోగలరా..!?

దేశంలో ఎక్కడి వ్యవసాయ ఉత్పత్తిని ఎక్కడైనా అమ్ముకోవచ్చని చట్టం అవకాశం ఇస్తోంది. ఎంత మంది రైతులు ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి విక్రయించగలరు. దళారులు మాత్రమే ఆ పని చేయగలరు. కేవలం కార్పొరేట్, బహుళ జాతి కంపెనీలు.. వాటి ఏజెంట్లు రైతుల నుంచి కొనుగోలు చేసి ఆ తరువాత రాష్ట్రాలు దాటిస్తూ వ్యాపారం చేసుకుంటాయనేది ప్రధానమైన విశ్లేషణ. ఇప్పటికే నూనెగింజలు, నూనెలు, పప్పుధాన్యాలు వంటి ఉత్పత్తులు కార్పొరేట్ల చేతుల్లో ఉన్నాయి. నిజంగా రైతులకు లాభం చేకూర్చాలనే ఉద్దేశమే ఉంటే మార్కెటింగ్ సదుపాయాలు పెంచి, ప్రభుత్వమే అన్ని పంటలను సరైన మద్దతు ధరకు కొనుగోలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది చాలా మంది సూచిస్తున్న అంశం.

అసలు ప్రమాదకరం కాంట్రాక్ట్ ఫార్మింగ్..!

కేంద్ర ప్రభుత్వ బిల్లుల్లో కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది అది పెద్ద ప్రమాదకరమైన విషయంగా కనిపిస్తోంది. పైకి చూస్తే.. రైతులకు ఎంతో లాభం అన్నట్లుగా కనిపిస్తుంది. కార్పొరేట్ కంపెనీలు ఇబ్బందులేమీ లేకుండా రైతు నేరుగా ఒప్పందం చేసుకోవచ్చు. పొలం దగ్గరికే వచ్చి నేరుగా ఆయా కంపెనీలు రైతు దగ్గరకు వచ్చి కొనుక్కుంటారు. రైతు కార్పొరేట్‌ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాక మధ్యలో ధర పెరిగితే ఇంకోచోట అమ్ముకోవచ్చు. లేదా అదే సంస్థ పెరిగిన ధర ఇవ్వొచ్చు. రైతుకు ఎలాంటి శ్రమా ఉండదు. రైతు ఆ ఒప్పందం రద్దు చేసుకోవాలనుకుంటే వడ్డీ లేకుండా అడ్వాన్సుగా ఇచ్చిన డబ్బు రైతు తిరిగిస్తే చాలు. ఆ తర్వాత తన ఇష్టం వచ్చినచోట స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు. ఇక్కడ రైతే నిర్ణయాధికారి. ఈ క్రమంలో రైతుకు నష్టం జరిగితే ఆ కార్పొరేట్‌ కంపెనీయే ఒకటిన్నర శాతం నష్టం భరించాలి. రైతు మాత్రం సులభంగా పక్కకు జరిగిపోవచ్చు. ఒకవేళ వీళ్లిద్దరి మధ్య ఏదైనా వివాదం వస్తే జిల్లా కలెక్టర్‌ 15 రోజుల్లో తేల్చేయాలి. కోర్టులకు వెళ్లాల్సిన అవసరం లేదు. రైతుదే తప్పయినప్పటికీ ఎలాంటి జరిమానా కట్టకుండా ఒప్పందం రద్దు చేసుకోవచ్చు. ఒప్పందం చేసుకున్న కంపెనీలు రైతులకు కావల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలి. ఇవన్నీ రైతులకు మేలు చేసేవిలానే కనిపిస్తాయి. కానీ.. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే.. అవన్నీ మాటలేక ఉపయోగపడతాయని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. తమకు పేటెంట్ ఉన్న బంగాళ దుంప రకాలను ఇతర రైతులు పండిస్తున్నారంటూ గత ఏడాది పెప్పికో గుజరాత్‌లో రైతులపై కేసులు పెట్టింది. ఇది ఆ కాంట్రాక్ట్ ఫార్మింగ్ దుష్ఫలితమే. సంస్థలతో చేసుకునే ఒప్పందాల్లో ఏముందో రైతులందరూ పూర్తిగా అవగాహన చేసుకోలేరు. ఈ ఒప్పందాలు నేరుగా రైతు, సంస్థ మధ్య జరుగుతాయి. మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, మార్కెట్ కమిటీలు కానీ ఏమీ ఉండవు. ఇక రైతులకు రక్షణ ఎక్కడ ఉంటుంది.

కనీస మద్దతు ధరపై ఎందుకు గ్యారంటీ ఇవ్వరు…!

2011 జనాభా లెక్కల ప్రకారం మనదేశ ప్రజల్లో 52 శాతం ప్రజలు ఏదోరకంగా వ్యవసాయంతో సంబంధం కలిగి ఉన్నారు. 365 రోజులూ సెలవు లేకుండా పని చేసే రైతుల జీడీపీ భాగస్వామ్యం 17-18 శాతం మాత్రమే. రైతుల సంపాదన సంవత్సరానికి 64 వేలు మాత్రమే. జస్టిస్‌ స్వామినాథన్‌ కమిషన్‌ ఉత్పత్తి ఖర్చుకు 50 శాతం ఎక్కువగా మద్దతు ధర లభించాలని సిఫార్సు చేశారు. అలాంటి మద్దతు ధర కోసమే రైతులు పోరాడుతున్నారు. ఈ మద్దతు ధరకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడంలేదు. కనీస మద్దతు ధర పేరుతో రైతు మోసానికి గురవుతున్నాడని చెబుతున్నారు. రైతు తెలంగాణ నుంచి వెళ్లి తనకు తగిన లభిస్తే మధ్యప్రదేశ్‌లో అమ్ముకోవచ్చని చెబుతున్నారు. కానీ అక్కడికి తీసుకెళ్లడానికి రవాణా ఖర్చు ఎంతవుతుంది..? రైతులకు ఎంత లాభం వస్తుంది..? పన్నులేమీ లేకపోవచ్చు కానీ.. మన దేశంలో ఉండే.. స్థానికనేతల దందాను ఎవరు అడ్డుకుంటారు..? రాజకీయ నేతల దోపిడీ నుంచి ఎవరు కాపాడతారు..?

మోడీ కార్పొరేట్ ఫ్రెండ్లీ సర్కార్ వల్లే రైతుల్లో అత్యధిక భయం..!

ప్రధాని మోడీ కార్పొరేట్ ఫ్రెండీ పాలన వల్లనే రైతుల్లో ఆందోళన రెట్టింపవుతోంది. జియో కోసం ఆయన బీఎస్‌ఎన్‌ఎల్‌ని.. అదానీ కోసం పోర్టుల్ని.. రైల్వేల్ని.. ఇలా ప్రతీ వ్యవస్థను.. ప్రైవేటీకరిస్తున్నారనిప్రజలు నమ్ముతున్నారు. ఇప్పుడు జియో మార్ట్ కోసమే… ఈ కొత్త బిల్లులన్న చర్చ కూడా జోరుగా ఉంది. రైతుల్ని కూడా.. కార్పొరేట్ పాలబడేలా చేస్తే.. దేశం మొత్తం వారి గుప్పిట్లోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత పోరాడటానికి కూడా ఏమీ ఉండదు. ఇప్పటికే రిలయన్స్ వంటి కంపెనీలు.. మీడియా నుంచి డేటా వరకూ మొత్తం కమ్మేశారు. ఇక రైతుల్ని కూడా ఆక్రమిస్తే దేశం మొత్తం … కార్పొరేట్ గుప్పిట్లోకి వెళ్లిపోతోంది. రైతులు వంచనకు గురవుతారు. ఆ ఆందోళనే ఇప్పుడు ఢిల్లీలో కనిపిస్తోంది. కానీ ప్రభుత్వం చేయాలనుకున్నది చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close