హైదరాబాద్ మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సంస్థకు ఉన్న అప్పులు మొత్తం తీసుకోవడంతో పాటు కంపెనీకి ఈక్విటీగా రెండు వేల కోట్ల వరకూ చెల్లిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఎలా చూసినా మొత్తగా ప్రభుత్వంపై రూ. 16వేల కోట్ల భారం పడుతుంది. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిన్న విషయం కాదు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆర్థికంగా మరింత ఒత్తిడికి గురి చేస్తుంది. అయినా రేవంత్ మొదటి నుంచి ఎల్ అండ్ టీ విషయంలో ఆసక్తిగా లేరు. వారు కేసీఆర్ గుప్పిట్లో ఉన్నారని అనుకుంటున్నారు. అందుకే వారు రాసిన లేఖ ఆధారంగానే వారి నుంచి మెట్రో స్వాధీనానికి నిర్ణయం తీసుకున్నారు.
రోజుకు ఐదు లక్షల మంది ప్రయాణికులు – అయినా నష్టాల్లోనే !
మెట్రోలో రోజుకు ఐదు లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఏ సమయంలో అయినా మెట్రోలు ఖాళీ ఉండవు. బిజీగా ఉండే మెట్రోల్లో హైదరాబాద్ ఒకటి. మరి ఎందుకు నష్టాలు వస్తున్నాయన్నది మిస్టరీ. ఏటా ఆరు వందల కోట్ల నష్టాలు వస్తున్నాయని ఎల్ అండ్ టీ చెబుతోంది. అయితే దీనికి ప్రధాన కారణం .. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రాజెక్టు ఆలస్యం కావడం, అలైన్ మార్చాలని కేసీఆర్ ఒత్తిడితో పనులు ఆగిపోవడం, కోవిడ్ కారణంగా ఐదు నెలల పాటు ఆపరేషన్స్ లేకపోవడం వల్ల భారం పెరిగింది. అప్పులు పెరిగాయి. వాటిపై వడ్డీలు కట్టుకోవడం వల్లనే ఎక్కువగా నష్టాలు వస్తున్నాయని అంచనా. ప్రభుత్వాల కారణంగా నష్టం వస్తున్నా అవి భర్తీ చేయలేదని ఎల్ అండ్ టీ అంటోంది. అందుకే ప్రభుత్వానికే అప్పగించింది.
మెట్రోకు భారీగా ఆస్తులు
మెట్రోను కేవలం టిక్కెట్లు, ప్రకటనల ఆదాయం ద్వారా లాభాల్లో నడిపించడం సాధ్యం కాదని అంచనా వేసి ..మొదట్లో ఎల్ అండ్ టీకి పెద్ద ఎత్తున భూములు ఇచ్చారు. మెట్రో పక్కన మాల్స్ కట్టుకునలా ఆభూములు ఇచ్చారు. దాదాపుగా 260 ఎకరాల ఆస్తులు ఉన్నాయి. వాటి ద్వారా ఆదాయం వస్తోంది. కానీ ఎల్ అండ్ టీ అ భూముల్ని సద్వినియోగం చేసుకోలేకపోయిందన్న ఆరోపణలు వస్తున్నాయి. సరిగ్గా ఉపయోగించుకుంటే.. పెద్ద ఎత్తున ఆదాయం వచ్చి ఉండేదని.. నిర్వహణ లోపాల వల్లనే మెట్రోకి నష్టాలు వచ్చాయని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది.
ప్రభుత్వం నడుపుతుందా.. ? మరో పార్టనర్‌ను వెదుక్కుంటుందా ?
హైదరాబాద్ మెట్రో అతి పెద్ద పీపీపీ ప్రాజెక్ట్. ఇందులో తెలంగాణ ప్రభుత్వానికి పది శాతం మైనర్ వాటా మాత్రమే ఉంది. ఇప్పుడు అప్పులు సహా మొత్తం తీసుకోవడంతో నిర్వహణ ప్రభుత్వంపై పడనుంది. ఇక తెలంగాణ మెట్రోగా నడుపుతారా లేకపోతే వేరే భాగస్వామ్యసంస్థను వెదుక్కుంటారా అన్నది తేలాల్సి ఉంది. మెట్రోకు భారీగా ఆస్తులున్నందున ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. పరిస్థితిని చక్కదిద్దుకోవచ్చన్న ఆలోచన కూడా ఉంది. అదే సమయంలో మెట్రో విస్తరణ హైదరాబాద్‌కు అత్యంత కీలకం. రేవంత్ ఓ రకంగా సాహసం చేశారు.. అది హైదరాబాద్‌కు మేలు చేస్తుందని ఎక్కువ మంది భావిస్తున్నారు.