తమిళనాడులో నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నిర్వహించిన సేలం బహిరంగ సభలో ఒక కార్యకర్త గుండెపోటుతో మరణించడం జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది. గతంలో ఆయన రోడ్ షోల వల్ల సుమారు 40 మంది ప్రాణాలు కోల్పోయారనే అంశాన్ని మీడియా పదేపదే హైలైట్ చేస్తోంది. ప్రజల ప్రాణాల కంటే బలప్రదర్శనే ముఖ్యమా అన్నట్లుగా విజయ్ సభలపై ఆంక్షలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, సరిగ్గా ఇదే తరహాలో ఏపీలో జగన్ రెడ్డి నిర్వహిస్తున్న రోడ్ షోలలో కార్యకర్తల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా, అటు జాతీయ మీడియా కానీ, ఇటు వైసీపీ శ్రేణులు కానీ పట్టించుకోకపోవడం లేదు.
ఎన్నికలు లేకున్నా మాయా ఊరేగింపులు ఎందుకు?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి ఎన్నికలు లేవు, కనీసం ఉప ఎన్నికల సందడి కూడా లేదు. మరి ఈ సమయంలో జగన్ రెడ్డి ఊరేగింపులు నిర్వహించాల్సిన అమరం ఏమిటి? . పరామర్శకు వెళ్లడానికి అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలను తరలించడం ఎందుకు? కేవలం తన చుట్టూ తాను సృష్టించుకున్న మాయా ప్రపంచాన్ని ఇంకా బతికే ఉందని నమ్మించడానికి, తన పతన గ్రాఫ్‌ను కప్పిపుచ్చుకోవడానికే ఈ డ్రామాలు ఆడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ కృత్రిమ హైప్ కోసం సామాన్య కార్యకర్తలను ఎండలో గంటల తరబడి నిలబెట్టడం, తోపులాటల్లో వారి ప్రాణాలను పణంగా పెట్టడం రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ట.
స్క్రిప్టెడ్ షోల వెనుక ప్రాణాల బలి
జగన్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమం ఒక పక్కా స్క్రిప్ట్ ప్రకారం జరుగుతోంది. జనాన్ని తరలించడం నుండి, వారు ఎలా స్పందించాలో నిర్దేశించడం వరకు అంతా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లా సాగుతోంది. ఈ క్రమంలో భద్రతా లోపాలు ఏర్పడి కార్యకర్తలు ప్రాణాలు కోల్పోతున్నా, వైసీపీ అగ్రనాయకత్వం కనీసం పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదు. పోయేది మన కార్యకర్తలే కదా అన్నట్లుగా వారి ప్రాణాలను లెక్క చేయకుండా, కేవలం కెమెరా యాంగిల్స్, డ్రోన్ షాట్ల మీద ఉన్న శ్రద్ధ మనుషుల ప్రాణాల మీద పెట్టడంలేదు.
విజయ్‌పై ఆంక్షలు – జగన్‌కు స్వేచ్ఛ
తమిళనాడులో విజయ్ సభలపై ఆంక్షలు విధించే యంత్రాంగం, ఏపీలో జగన్ విషయంలో మాత్రం ఎందుకు మౌనంగా ఉంటోంది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత వ్యవస్థలపై ఉంటుంది. కానీ, రాజకీయ ప్రయోజనాల కోసం జనాలను గొర్రెల మందలా తరలిస్తూ, వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నా ఎవరూ ప్రశ్నించకపోవడం జగన్‌కు మరింత ఊతమిస్తోంది. విజయ్‌పై చూపిస్తున్న అదే కఠినత్వాన్ని, జగన్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రాణాంతక రోడ్ షోలపై కూడా చూపాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు తమ అస్తిత్వాన్ని చాటుకోవడానికి కార్యకర్తలను బలిపశువులను చేయడం ఆగిపోవాలి. విజయ్ సభల్లో జరిగిన ఘటనలపై స్పందించినట్లే, జగన్ రెడ్డి తన స్వలాభం కోసం తీస్తున్న ప్రాణాల గురించి కూడా గళమెత్తాలి. సోషల్ మీడియాలో సృష్టించే హైప్ కోసం సామాన్యుల ప్రాణాలను పణంగా పెట్టే ఏ నాయకుడైనా ప్రజల ముందు దోషిగానే నిలబడతారు.
