ఇది ఏఐ కాలం. కానీ కేటీఆర్ ఇంకా పాత కాలం రాజకీయాలు చేస్తున్నారు. గద్వాలలో ఆయన నిర్వహించిన సభ కోసం .. ఏర్పాటు చేసుకున్న పీఆర్ స్టంట్స్ ను చూసిన వారికి.. కేటీఆర్ వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా రాజకీయ వ్యూహాలను ఖరారు చేసుకోలేకపోతున్నారని ఎవరికైనా అనిపిస్తే.. అందులో వింతేం ఉండదు. ఆయన పూర్తిగా కృత్రిమ హైప్ సృష్టించుకునేందుకు ఓ మాయా ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అందులో నుంచి ఆయన బయటకు రావడం లేదు. గద్వాలలో అది మరింత పీక్స్ కు చేరిపోయింది.
పీఆర్ స్టంట్స్‌తో కేటీఆర్ రాజకీయం
హైదరాబాద్ నుంచి గద్వాలకు వెళ్లేలోపు కేటీఆర్ పీఆర్ టీం.. ఎన్ని ఇన్ పుట్స్.. మీడియాకు.. సోషల్ మీడియాకు ఇచ్చిందో లెక్కలేదు. ఒక్కో చోట.. ఒక్కో షో. పోనీ అవన్నీ నిజంగా జరిగాయా అని అనిపించేలా ఉన్నాయంటే.. ప్రతీది స్క్రిప్టెడ్ అని బీఆర్ఎస్ కార్యకర్తలకూ అర్థమైపోతుంది. పార్టీకి ఆర్థికంగా ఇబ్బంది లేదు. కావాల్సినంత డబ్బు ఉంది. దాన్ని ఉపయోగిచుకుని ఇలాంటి వాటి ద్వారా.. హైప్ తెచ్చుకోవాలంటే ఇప్పటి రాజకీయాల్లో ఎలా సాధ్యమవుతుంది ? . ఇప్పుడు అంతా ఆర్గానిక్ దే హవా. పెయిడ్ ప్రమోషన్లతో లాభం సున్నా. ఖర్చు తప్ప వచ్చేదేమీ ఉండదు.
ప్రజల్లో ఆర్గానిక్ ఎమోషన్ ఉంటేనే కిక్
ప్రజల్లో ఆర్గానిక్ గా ఓ ఎమోషన్ సృష్టించగలగాలి. గతంలో తెలంగాణ పేరుతో అది చాలా సహజంగా వచ్చింది. అందుకే కేసీఆర్ ..ఉద్యమం సమయంలో ఒక్క సారి కూడా ఆయన బయటకు వచ్చి ఆందోళనల్లో పాల్గొనకపోయినా ఆయనకు నాయకత్వ స్థానం లభించింది. తెలంగాణ సాధించారన్న పేరు కూడా వచ్చింది. కానీ ఆ ఎమోషన్ అన్ని అంశాల్లో రాదు. ఏదైనా అంశంలో తెచ్చుకోవాలంటే.. ఆర్గానిక్ గా ప్రయత్నించాలి. కృత్రికమంగా ప్రయత్నిస్తే.. తమ మాయా ప్రపంచానికే అది పరిమితమవుతుంది కానీ ప్రజలు పట్టించుకోరు. ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది.
న్యూ ఏజ్ పాలిటిక్స్ అంటే సోషల్ మీడియా కాదు !
బీఆర్ఎస్ పరిస్థితి గడ్డుగా ఉంది. ఈ విషయం అందరికీ తెలుసు. కేటీఆర్‌కూ తెలుసు. కేసీఆర్‌కూ తెలుసు. జనాలకూ తెలుసు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత జరగబోయేది ఏమిటో చాలా మందికి క్లారిటీ వచ్చింది. ఏటికి ఎదురీదాల్సిన పరిస్థితుల్లో బీఆర్ఎస్ పడింది. ఇలాంటి సమయాల్లో ఆ పార్టీ చేయాల్సింది ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు కాదు..నిజాయితీగా.. తాము ప్రజల కోసం నిలబడతామని నమ్మించాల్సి ఉంది. అలాంటిదేమీ చేయకుండా ప్రజల కోసం పోరాడకుండా.. తమ పార్టీ ఓటు బ్యాంక్ ను మింగేస్తున్న బీజేపీ వైపు చూడకుండా.. ఆర్గానిక్ ప్రయత్నాలు ఎలా సాధ్యమవుతాయి. కేటీఆర్ .. న్యూ ఏజ్ పాలిటిక్స్ ను..సోషల్ మీడియా ప్రచారమే అనుకుంటున్నారు. కానీ పాలిటిక్స్ స్వరూపం ఎప్పుడూ మారదు. ప్రజల నమ్మకమే అసలు ఆర్గానిక్ ప్రయత్నం. వారిని సభ్య పెట్టడం సాధ్యం కాదు.
