సెమీస్ ఫైట్ : టాప్ అర్డర్‌పై అతిగా ఆధారపడితే కష్టమే..!

క్రికెట్టే మతమైన దేశంలో.. ప్రపంచకప్ హడావుడి ఎలా ఉంటుందో… అంచనా వేయకుండా ఉండలేం. అలాంటి సమరంలో… లీగ్ మ్యాచ్‌లో .. టీమిండియా.. మొదటి స్థానంలో నిలిచి అంచనాలకు తగ్గట్లుగా నిలిచింది. ఇప్పుడీ స్థానాన్ని కాపాడుకోవాలంటే.. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై అదే జోరు కొనసాగించాల్సి ఉంటుంది. చూడటానికి… కివీస్‌ను.. టీమిండియా ఆటగాళ్లు.. అలా ఊదేస్తారని.. అనిపిస్తున్నప్పటికీ.. కాస్త తరచి చూస్తే మాత్రం.. టీమిండియాకు.. ఎన్నో మైనస్ పాయింట్లున్నాయి.

లీగ్ మ్యాచ్ గెలుపులన్నీ టాపార్డర్ పుణ్యమే..!

ఒక్క.. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో తప్ప… భారత జట్టు ఆడిన లీగ్ మ్యాచ్‌లన్నింటిలో.. విజయం సాధించింది. విజయాలన్నింటిలో.. బౌలర్ల పాత్ర పరిమితం. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ల పాత్ర పరిమితం. లోయర్ ఆర్డర్ మెరుపులు అసలు కనిపించలేదు. కానీ.. తిరుగులేని ప్రదర్శన చేసింది టాపార్డర్ బ్యాట్స్‌మెన్ మాత్రమే. అదీ కూడా.. రోహిత్ శర్మ పిల్లర్ లా నిలబడబట్టి సాధ్యమయింది. ఐదుసెంచరీతో రోహిత్ శర్మ.. టీమిండియా విజయాలను శాసించాడు. కేఎల్ రాహుల్, కోహ్లీ రాణించారు. కానీ మిడిల్ ఆర్డర్ మాత్రం.. ఇప్పటి వరకూ.. మెగురైన ప్రదర్శన చేయలేకపోయింది.

మిడిల్ ఆర్డర్ వైఫల్యం ఆందోళనకరమే..!

భారత జట్టుకు మిడిల్ ఆర్డర్… బలహీనంగా ఉంది. పలు ప్రయోగాలు చేశారు. కానీ ఎవరూ రాణించలేకపోయారు. విజయ్ శంకర్, దినేష్ కార్తీక్ విఫలమయ్యారు. మిడిల్ ఆర్డర్‌కు.. వెన్నుముకగా ఉంటాడనుకున్న ధోనీ… తనదైన ఆటను చూపించలేకపోతున్నారు. ఇంగ్లాండ్‌తో ఓటమికి కారణం ధోనీనే అనే నిందలు కూడా పడాల్సి వచ్చింది. కారణం ఏదైనా.. ధోనీ ఆటతీరు మందగించింది. ఓ రకంగా.. ఆయన జట్టుకు భారమయ్యాడు. కానీ.. ఆయనపై అభిమానల్లో అపారమైన అభిమానం ఉంది. అందుకే.. ఏమీ అనలేని పరిస్థితి. కానీ.. ధోనీ తాడో పేడో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో.. నింపాదిగా ఆడరని.. ఫైర్ చూపిస్తారని.. మాత్రం.. ఇప్పటికీ అభిమానులకు నమ్మకం ఉంది. కానీ అదే సమయంలో ఎక్కడో అనుమానం కూడా ుంది.

కివీస్‌ను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం..!

న్యూజిలాండ్ చచ్చీచెడి సెమీస్‌కు చేరుకుని ఉండవచ్చు .. లీగ్ దశలో టీమిండియా చేతిలో ఓడిపోయి ఉండవచ్చు కానీ.. తక్కువ అంచనా వేసే జట్టు మాత్రం కాదు. మార్టిన్ గుప్తి, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, ట్రెంట్ బౌల్ట్ లాంటి ఆటగాళ్లు.. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సామర్థ్యం ఉన్న వాళ్లు. వాళ్ల ఆట తీరు ఐపీఎల్‌లో కూడా.. ఇండియన్ ఫ్యాన్స్ చూసే ఉంటారు. అందుకే… ఈ మ్యాచ్ అంత తేలిక కాదన్న అభిప్రాయం అందిలోనూ ఏర్పడింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించవచ్చని కూడా చెబుతున్నారు. అదే జరిగితే.. లీగ్ దశలో న్యూజిలాండ్ పై గెలిచినందున… టీమిండియానే ఫైనల్ చేరుకుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com