ఆర్థిక సంక్షోభంలో మోజో టీవీ..!?

తెలుగు మీడియా రంగంలో… సంచలనాలతో ఆరంగేట్రం చేసిన మరో టీవీ చానల్ అంతర్థానమయ్యే సూచనలు కనిపిస్తున్నారు. వరుస వివాదాలతో ఇటీవల వార్తల్లోకి వచ్చిన “మోజోటీవీ”.. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఆ చానల్‌కు చెందిన కార్యాలయాలకు కరెంట్ బిల్లులు కూడా చెల్లించడం లేదు. జీతాలు మినహా.. వివిధ చెల్లింపులన్నీ.. దాదాపుగా రెండు నెలల నుంచి నిలిపివేశారని మీడియా వర్గాలు చెబుతున్నాయి. విజయవాడలో ఈ చానల్‌కు ఓ స్టూడియో కమ్ ఆఫీస్ ఉంది. ఆ ఆఫీసుకు కరెంట్ బిల్లులు చెల్లించకపోవడంతో అధికారులు కనెక్షన్ కట్ చేశారు. ఇప్పడా చానల్ ఆఫీస్ అంధకారంలో ఉందని.. ఆ టీవీ చానల్ ఉద్యోగులు చెబుతున్నారు.

మోజోని భారంగా భావిస్తున్న కొత్త యాజమాన్యం..!

ఒక్క విజయవాడ ఆఫీస్ మాత్రమే కాకుండా.. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయం లో కూడా.. ఈ చెల్లింపుల సంక్షోభం ఉందంటున్నారు. మోజో టీవీ చానల్ ను నిర్వహిస్తున్న కంపెనీ మీడియా నెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. ఇటీవల.. మైహోం రామేశ్వరరావుకు చెందిన వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిందని తెలుస్తోంది. ఒక్క మే నెలలో ఆ సంస్థలోకి.. కొత్తగా ముగ్గురు డైరక్టర్లు వచ్చారు. చానల్ సీఈవో రేవతి సహా.. మిగిలిన వాళ్లందర్నీ తీసేశారు. అయితే..హోల్ టైం డైరక్టర్ గా… హరికిరణ్ చేరెడ్డి కొనసాగుతున్నారు. కానీ ఆయన ఏమీ పట్టించుకోవడం లేదని.. మోజో టీవీకి సంబంధించి.. ఏమైనా ఆర్థిక వ్యవహారాల విషయంలోనూ… అసలు కల్పించుకోవడంలేదని చెబుతున్నారు. ఏమైనా బిల్లుల విషయం ప్రస్తావనకు వచ్చినా తనకు సంబంధం లేదంటున్నారన్న ప్రచారం జరుగుతోంది.

చానల్ నిర్వహణ ఆర్థిక భారంగా భావిస్తున్నారా..?

టీవీ9 అమ్మకం వివాదంలో మోజో టీవీ పేరు కూడా బయటకు వచ్చింది. టీవీ9 నిధులు.. మోజోటీవీకి తరలించారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత.. ఓ రోజు.. ఆ టీవీ చానల్‌లోనే.. తమ చానల్‌ను.. రామేశ్వరరావు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని బ్రేకింగ్ న్యూస్‌లు వేశారు. తర్వాత రోజు ఈ వివాదం సద్దుమణిగిపోయిందనుకున్నారు కానీ.. అప్పటికే.. చానల్ చేతులు మారిపోయిందని… తర్వాత తేలింది. ఇప్పుడీ చానల్‌ను.. కొత్త యాజమాన్యం భారంగా భావిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. వీలైనంత త్వరగా వదిలించుకుంటే… మంచిదన్న భావనలో కొత్త యాజమాన్యం ఉందని చెబుతున్నారు. అందుకే.. ఇప్పటికైతే ఉద్యోగుల జీతాలకు ఇబ్బంది రానీయడం లేదు కానీ.. మిగతా ఖర్చులు పూర్తిగా నిలిపేశారు.

టీవీ1 బాటలోనే మోజీ టీవీ కూడా..!?

టీవీ9 గ్రూప్‌ చానళ్లలో… పనికి రాని వాటిని వదిలించుకోవడమో… లేకపోతే.. ఖర్చులేని చానళ్లుగా మార్చడమో చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. టీవీ1 పేరు.. గతంలో జై తెలంగాణ టీవీగా మార్చారు. ఇప్పుడా జై తెలంగాణ టీవీని.. డివోషనల్ చానల్ గా మార్చి.. గతంలో.. టీవీ9కు ఉన్న సంస్కృతి అనే చానల్‌కు సంబంధించిన ఫుటేజీని బయటకు తీసి ప్రసారం చేస్తున్నారు. త్వరలో దీన్ని కూడా మూసేస్తారని చెబుతున్నారు. ఆ కోవలోనే మోజో చేరినా ఆశ్చర్యం లేదన్న భావన వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com