తమిళనాడులో ద్రవిడ రాజకీయాలు ఎప్పుడూ ఉచితాల చుట్టూనే తిరుగుతుంటాయి. విజయ్ కూడా అదే బాటలో ఉన్నారు. తన పార్టీ మేనిఫెస్టోను ఆయన ప్రకటించారు. ్ందులో రైతు రుణమాఫీ, మహిళలకు నెలవారీ ఆర్థిక సాయం వంటి పథకాలు ప్రకటించారు. అయితే ఈ మేనిఫెస్టోను ప్రజలు ఎంత సీరియస్ గా తీసుకుంటారన్నదానిపైనే ఆయన పార్టీ రాత ఉంటుందని అనుకోవచ్చు.
సిద్ధాంతాలే కాదు ప్రజాకర్షణ ముఖ్యమని విజయ్ భావన
విజయ్ తనను తాను ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా ప్రజల్లో గుర్తింపు పొందాలని అనుకుంటున్నారు. గతంలో కమల్ హాసన్ వంటి వారు కేవలం సిద్ధాంతాలకే పరిమితమై గ్రామీణ ఓటర్లను చేరుకోలేకపోయారు. ఆ తప్పు జరగకూడదనే విజయ్, అన్నాడీఎంకే, డీఎంకేలు అనుసరించే ప్రజాకర్షక పథకాలనే తన ఆయుధంగా మార్చుకున్నారు. అయితే, ఈ హామీలు ప్రజల్లోకి వెళ్లాలంటే ఆయనను ఓటర్లు ఒక నమ్మదగ్గ ప్రత్యామ్నాయం గా గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు విజయ్‌కు కేవలం పట్టణ ప్రాంతాల్లో, యువతలో మాత్రమే క్రేజ్ ఉందనే వాదన ఉండేది. తు రుణమాఫీ ప్రకటించడం ద్వారా ఆయన తానొక మాస్ లీడర్ అని, సామాన్యుల కష్టాలు తెలిసిన వాడినని నిరూపించుకోవాలని చూస్తున్నారు.
విజయ్ చేయగలరని నమ్మితేనే ఫలితం
రైతు రుణమాఫీ వంటి భారీ హామీలను అమలు చేయాలంటే రాష్ట్ర ఖజానాపై పడే భారం ఎంత? అన్నది ఇప్పుడు చర్చనీయాంశం. తమిళనాడు ఇప్పటికే అప్పుల ఊబిలో ఉంది. ఇలాంటి స్థితిలో విజయ్ ఈ నిధులను ఎక్కడి నుంచి తెస్తారనే ప్రశ్నలను ప్రత్యర్థి పార్టీలు లేవనెత్తుతున్నాయి. విజయ్ మేనిఫెస్టో బాగున్నప్పటికీ, ప్రజలకు ఆయనపై కమాండ్ ఉందనే నమ్మకం కలగాలి. అంటే, ఆయన కేవలం సినిమా డైలాగులు చెప్పే వ్యక్తి కాదని, పరిపాలనా దక్షత ఉన్న నాయకుడని నిరూపించుకుంటేనే ఈ మేనిఫెస్టో ఓట్లుగా మారుతుంది.
మహిళకూ భారీ వరాలు
మహిళా ఓటర్లు తమిళనాడు రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తి. గతంలో జయలలితకు ఉన్న మహిళా ఆదరణను ఇప్పుడు విజయ్ తనవైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ వంటి హామీలు గృహిణులను ఆకట్టుకునేలా ఉన్నాయి. యువత ఇప్పటికే ఆయన వెంటే ఉన్నందున, ఇప్పుడు గ్రామీణ రైతులు , మహిళల మద్దతు కూడా తోడైతే, అది ద్రవిడ పార్టీల కోటను బద్దలు కొట్టే అవకాశం ఉంటుంది. కానీ, తమిళ ఓటర్లు చాలా తెలివైన వారు; సినిమా గ్లామర్‌ను, రాజకీయాన్ని వారు వేర్వేరుగా చూస్తారు. ప్రధాన విషయం ఏమిటంటే విజయ్ ప్రకటించినవన్నీ ఇప్పటికే డీఎంకే, అన్నాడీఎంకేలు ఏదో ఒక రూపంలో అమలు చేస్తున్నవే. కొత్తదనం కంటే కాపీ ఎక్కువగా ఉందనే అభిప్రాయం కూడా ఉంది. దీన్ని కూడా ఆయన అధిగమించాల్సి ఉంది.