కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026 బడ్జెట్, తాయిలాల కంటే దేశ ఆర్థిక పునాదులను పటిష్టం చేయడానికే పెద్దపీట వేసింది. రాజకీయ ఆకర్షణలు, ఎన్నికల తాయిలాల జోలికి వెళ్లకుండా వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ ఉంది. బడ్జెట్ అంటే సామాన్యుడికి ఆదాయపు పన్ను రాయితీలు, కొన్ని వస్తువుల ధరల తగ్గింపు.. అంతకు మించి ఏమీ ఉండదనే సగటు అంచనాలను ఈసారి కేంద్రం పటాపంచలు చేసింది.
మౌలిక సదుపాయాలదే అగ్రతాంబూలం
మెరుపులు లేకపోయినా, దేశ ఆర్థిక గమనాన్ని సరైన దిశలో పెట్టేలా ఈ పద్దు సాగింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నప్పటికీ, ఓట్ల వేట కోసం ఉచిత పథకాల జోలికి వెళ్లకుండా ప్రభుత్వం ప్రదర్శించిన ఆర్థిక క్రమశిక్షణ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దేశం ప్రపంచ దేశాలతో పోటీపడాలంటే కావాల్సింది కేవలం రాయితీలు కాదు, పటిష్టమైన మౌలిక సదుపాయాలని ప్రభుత్వం బలంగా నమ్మింది. అందుకే రికార్డు స్థాయిలో రూ. 12.22 లక్షల కోట్ల మూలధన వ్యయం కేటాయించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 11.5 శాతం పెరుగుదల. ముఖ్యంగా రైల్వేలకు రూ. 2.8 లక్షల కోట్లు కేటాయించి, ఏడు కొత్త హై-స్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించడం రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది కానుంది.
రాజకీయాల కంటే దేశ ప్రయోజనాలే మిన్న
రాజకీయ కోణంలో చూస్తే ఈ బడ్జెట్ కొంత నీరసంగా అనిపించవచ్చు. పన్ను స్లాబుల్లో మార్పులు లేకపోవడం, కొత్త రాయితీలు ప్రకటించకపోవడం మధ్యతరగతిని కొంత నిరాశకు గురిచేసినా, ఆర్థిక వేత్తలు మాత్రం దీన్ని స్వాగతిస్తున్నారు. బడ్జెట్ అనేది ఓట్ల కోసం ఇచ్చే తాయిలం కాదని, అది దేశ ఆర్థిక భవిష్యత్తుకు వేసే రహదారి అని ప్రభుత్వం నిరూపించింది. ద్రవ్యలోటును పరిమితం చేయడం ద్వారా, భారత్ క్రమశిక్షణ కలిగిన ఆర్థిక వ్యవస్థ అని ప్రపంచ దేశాలకు సందేశమిచ్చింది. కేవలం రోడ్లు, భవనాలే కాకుండా.. సెమీకండక్టర్ మిషన్ 2.0, ఏఐ , రోబోటిక్ టెక్నాలజీ వంటి భవిష్యత్ అవసరాల కోసం భారీగా నిధులను మళ్లించింది. సెమీకండక్టర్ రంగానికి రూ. 40,000 కోట్లు కేటాయించడం ద్వారా చిప్ తయారీలో భారత్ స్వయం సమృద్ధి సాధించాలనే సంకల్పాన్ని చాటింది. అలాగే తయారీ రంగం , MSMEలకు లిక్విడిటీ సపోర్ట్ ఇవ్వడం ద్వారా ఉపాధి కల్పనపై దృష్టి పెట్టింది.
భవిష్యత్‌కు బలమైన పునాది
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ బడ్జెట్ భారత్‌ను 2027-28 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు అవసరమైన స్ట్రక్చరల్ రీఫార్మ్స్ వైపు మొగ్గు చూపింది. స్వల్పకాలిక ప్రయోజనాల కంటే దీర్ఘకాలిక స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం ఈ బడ్జెట్ సారాంశం అని నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఈ బడ్జెట్ లో తక్షణ ఆకర్షణలు లేవు కానీ, నిరంతర వృద్ధి కి మార్గం ఉంది. ఎన్నికల ప్రభావాన్ని తలకెక్కించుకోకుండా, ఆర్థిక వ్యవస్థను దారి తప్పకుండా చూసుకోవడంలో కేంద్రం నూటికి నూరు శాతం విజయం సాధించిందని చెప్పవచ్చు.
