ఆంధ్రప్రదేశ్ సుగంధ ద్రవ్యాల రాజధాని గుంటూరు జిల్లా. ఇప్పుడు దేశమంతా హాట్ టాపిక్ అయింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా హోలీ పండుగను పురస్కరించుకుని గుంటూరు మిర్చి పొలాలకు సంబంధించిన ఒక అద్భుతమైన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆకాశం నుండి చూస్తే ఎర్రటి తివాచీ పరిచినట్లుగా కనిపించే ఈ మిర్చి ఆరబోసిన దృశ్యాలు నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. దేశం మొత్తం మిర్చి ఉత్పత్తిలో సుమారు 15 శాతం వాటా కలిగి ఉన్న గుంటూరు జిల్లా ప్రాముఖ్యతను ఈ వీడియో ప్రతిబింబిస్తోంది.
ఆనంద్ మహింద్రా తన ట్వీట్లో.. ఈ అద్భుతమైన రంగుల విందును పర్యాటక ఆకర్షణగా ఎందుకు మార్చకూడదని ప్రశ్నించారు. శీతాకాలం చివరలో వచ్చే ఈ పంట కోత సమయాన్ని పర్యాటక సీజన్‌గా మలిచి, రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా అడుగులు వేయవచ్చని ఆయన సూచించారు. భూమి నుంచి చూస్తే ఈ సౌందర్యం కనిపించకపోవచ్చు కాబట్టి, పర్యాటకుల కోసం హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ వంటివి ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన వినూత్న ఆలోచనను పంచుకున్నారు. నారా లోకేష్‌ను ట్యాగ్ చేశారు.
ఈ ట్వీట్‌పై రాష్ట్ర ఐటీ , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించారు. రాష్ట్ర అభివృద్ధిలో పర్యాటక రంగం ఎంత కీలకమో వివరిస్తూ, మహింద్రా గ్రూప్‌ను ఆంధ్రప్రదేశ్‌లో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. కేవలం పారిశ్రామికంగానే కాకుండా, పర్యాటక రంగంలో కూడా మహింద్రా వారి అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రైతులకు వారి ఆదాయ మార్గాలను పెంచేలా ఈ అగ్రి-టూరిజం ప్రాజెక్టును ఎలా రూపొందించవచ్చనే దానిపై ఇప్పుడు కసరత్తు జరిగే అవకాశం అవకాశం ఉంది. స్థానిక సంస్కృతిని, కళలను జోడిస్తే, గుంటూరు మిర్చి కేవలం కారానికే కాకుండా పర్యాటకానికి కూడా ఒక అంతర్జాతీయ బ్రాండ్‌గా మారుతుందనడంలో సందేహం లేదని అంటున్నారు. సాధ్యమవుతుందా లేదా అన్న విషయం పక్కన పెడితే ఓ కొత్త ఆలోచన మాత్రం వచ్చేసింది.
