తెలుగు కళలు, భాష, నుడికారంపై మమకారం వున్న రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. చాలా సందర్భాల్లో ఆయన సమాజం తీరుతెన్నులపై ఎలాంటి దాపరిక లేకుండా మాట్లాడుతుంటారు. తాజాగా ఆయన తెలుగు భాష, చదువులు, మాట్లాడేతీరు, గాయకులపై కొన్ని సెటైర్లు వేశారు.
తెలుగులో ప్రస్తుతం వస్తున్న గాయకులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సరిగ్గా తెలుగు మాట్లాడే గొంతుకలు కరువయ్యాయని, తెలుగు నుడికారం సరిగ్గా పలికే గాయకులని తయారు చెసుకోలేకపోతున్నామని విమర్శించారు.
‘చైనా’ చదువులు( తొలి అక్షరం పేరు గల విద్య సంస్థలు)దేనికో కారణం అని సెటైర్ వేశారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పితే మరొకటి చదువు కాదని, వాటిలో డిగ్రీ లేకపోతే మనిషిగా కూడా గుర్తించని వైనం తెలుగు కళలు, సంస్కృతిని ప్రమాదంలో పడేస్తుందని అభిప్రాయపడ్డారు.
అంతేకాదు.. ఇప్పుడు తెలుగు భాషని మరీ అపహాస్యం చేస్తున్నారని.. చేస్తున్నా, చెయ్, కదా.. కేవలం ఈ మూడు పదాలతో తెలుగుని సరిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘హైదరాబాద్ ఈజ్ బ్యూటీఫుల్ సిటీ అండి’.. ‘డ్రింక్ చెయ్’.. ‘ట్రై చేస్తున్నా’.. ఇదే ఇప్పటి వ్యవహారిక తెలుగులా చలామణీ అవుతుందని ఎద్దేవా చేశారు. తాగు, ప్రయత్నించు… ఇలా క్రియావాచకాలు కనుమరుగౌతున్నాయన్నారు. పిల్లలకు క్రియావచకాలతో సహా తెలుగు నేర్పించకపొతే మరిన్ని తెలుగు పదాలు కాలగర్భంలో కలిసిపోతాయని హెచ్చరించారు.
అనంత శ్రీరామ్ చెప్పిన మాటల్లో కొన్ని వాస్తవాలు లేకపోలేదు. అయితే భాష అనేది ఒక వ్యక్తిగత ఎంపిక. తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రు భాషను తప్పనిసరిగా నేర్పించాలనే కఠినమైన నియమాలు లేవు. కాకపోతే భాష అనేది కేవలం మాట్లాడే సాధనం మాత్రమే కాదు.. ఒక సమాజం ఉనికి. ఆ ఉనికిని కాపాడుకోవడం, భాషలోని అందాన్ని నిలబెట్టడం ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యతగా మారిన రోజున పరిస్థితిలో మార్పు వస్తుంది.