అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తీరు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి పెను సమస్యగా మారింది. ఎన్నికల్లో గెలిచిన నాటి నుండి ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన వైద్యురాలి కుటుంబాన్ని బెదిరించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన సమయంలో అనుచిత ప్రవర్తనతో నిరంతరం వివాదాలకు కేంద్రబిందువుగా మారడం స్థానిక కేడర్‌ను కూడా అయోమయంలో పడేస్తోంది.
ఎమ్మెల్యే వ్యవహారశైలిపై ఇప్పటికే జిల్లా స్థాయి నుండి అధిష్టానానికి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు టీడీపీ హైకమాండ్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న తరుణంలో, ఎమ్మెల్యేలు ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడటం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పార్టీ నాయకత్వం, ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్‌ను అమరావతికి పిలిపించి వివరణ కోరాలని లేదా తీవ్రమైన హెచ్చరికలు జారీ చేయాలని యోచిస్తోంది.
ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతుంటే, అనంతపురంలో ఎమ్మెల్యే వల్ల జరుగుతున్న నష్టం పార్టీకి దీర్ఘకాలికంగా ఇబ్బంది కలిగించేలా ఉంది. డాక్టర్‌ను బెదిరించిన వ్యవహారంపై రాజకీయంగా దుమారం రేగుతోంది. గీత దాటితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని గతంలోనే చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్టీ కూడా ఆయన వల్ల రెండుగా చీలిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదో ఓ కటి చేయాలని టీడీపీ హైకమాండ్ భావిస్తోంది.


