మండే స్పెషల్..! రాజధానులపై ఆంధ్రజ్యోతి బ్యానర్ స్టోరీలు..!

ఆంధ్రజ్యోతి పత్రిక రెండు తెలుగు రాష్ట్రాల ఎడిషన్లలో స్పష్టమైన తేడా చూపించేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవలి కాలంలో.. ఏపీ వార్తలకు తెలంగాణ ఎడిషన్‌లో పూర్తిగా ప్రాధాన్యత తగ్గించారు. అదే సమయంలో.. హైదరాబాద్‌ ఎడిషన్‌లో కూడా.. సీమాంధ్ర వార్తలకు.. ఇవ్వాల్సినంత ప్రాధాన్యమే ఇస్తున్నారు. ఈ క్రమంలో.. ఈ రోజు.. అటు ఏపీ.. ఇటు తెలంగాణలో.. కామన్‌గా… ఆయా రాష్ట్రాల రాజధానులపై బ్యానర్ కథనాలు ప్రచురించారు. అందులో.. హైదరాబాద్.. మహా భాగ్య నగరంగా మారబోతోందని… కీర్తించగా.. ఏపీ ఎడిషన్‌లో… వెలవెలబోతున్న అమరావతిని సాక్షాత్కరింపచేశారు.

హైదరాబాద్‌లో … మరో పదేళ్లలో జనాభా రెండు కోట్లకు చేరుతుందని.. అంతకు మించి.. అభివృద్ధి సాధిస్తుందని.. ఆంధ్రజ్యోతి పత్రిక విశ్లేషించింది. దీనికి మద్దతుగా గణంకాలు.. పెరుగుతున్న రియల్ ఎస్టేట్ రంగం.. ఐటీ రంగం అభివృద్ధి.. పరిశ్రమ స్థాపనకు ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ.. లాంటి వన్నింటినీ.. ప్రత్యేకంగా.. ప్రస్తావించారు. కానీ.. అమరావతి విషయంలో.. దీనికి రివర్స్‌గా జరుగుతోందని.. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌లో… “అయ్యో.. అమరావతి” పేరుతో ప్రచురించిన బ్యానర్ కథనంలో.. రాశారు. అక్కడా గణాంకాల మద్దతు తీసుకున్నారు. రెండు నెలల కిందటి వరకూ.. అక్కడ జరిగిన పనులు. ప్రస్తుతం జరుగుతున్న పనులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం.. లాంటి అంశాలన్నింటినీ పొందు పరిచారు.

రెండు ఎడిషన్లలో.. ఒకదానికి..మరో దానికి సంబంధం ఉండదు. హైదరాబాద్ వార్త.. ఏపీలో రాదు. ఏపీ రాజధాని వార్త తెలంగాణ ఎడిషన్‌లో ఇవ్వరు. సాంకేతికంగా చూస్తే… బ్యూరో ఇలా.. రాజధానుల పరిస్థితిపై.. కథనం రాద్దామని ఐడియాకు వచ్చి.. రాసేసింది. కానీ.. ఇందులో.. పొలిటికల్ యాంగిల్ కూడా.. స్పష్టంగానే కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత రాజధానిని అభివృద్ధి చేయడం కన్నా పొరుగు రాష్ట్రాలకు… ముఖ్యంగా తెలంగాణకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న అభిప్రాయం.. ప్రజల్లో ప్రారంభమైందని… టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో… ఆ అభిప్రాయం బలపడేలా.. ఈ కథనాలు ప్రచురించారన్న…అభిప్రాయానికి ఇతర పార్టీల నేతలు రావొచ్చు. ఎవరు ఎలాంటి అభిప్రాయానికి వచ్చినా… తెలుగు రాష్ట్రాల రాజధానుల్లో పరిస్థితిని మాత్రం.. ఆంధ్రజ్యోతి వాస్తవికంగా కళ్లకు కట్టిందని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com