తిరుమల కొండపై కాటేజీ నిర్మాణానికి స్థలం కేటాయింపు వ్యవహారంలో టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తిపై జరిగిన ప్రచారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జంగా కృష్ణమూర్తికి కొత్తగా భూమి కేటాయించారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, ఇది రెండు దశాబ్దాల క్రితం నాటి వ్యవహారమని తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈ కాటేజీ స్థల కేటాయింపు ఇప్పటిది కాదు. 2005లోనే కాటేజీ డొనేషన్ స్కీమ్ కింద జంగా కృష్ణమూర్తికి స్థలం కేటాయించారు. తిరుమల బాలాజీ నగర్లో ఇప్పటికీ ఆ స్థలం అలాగే ఖాళీగా ఉంది. అది కాటేజీ నిర్మాణం కోసం ఉద్దేశించినదే. ఆ తర్వాత డొనేషన్ మొత్తం పది లక్షల నుండి యాభై లక్షలకు పెరగడం, ఆర్థిక వెసులుబాటు లేకపోవడం వల్ల ఆయన వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించలేకపోయారు. అప్పటి నుండి ఈ వ్యవహారం నలుగుతూనే ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ దీనిపై బోర్డు సానుకూల నిర్ణయం తీసుకున్నా ధర్మారెడ్డి నిలిపివేశారు.
ఇప్పుడు బోర్డు దాన్ని తిరిగి కేటాయిస్తే.. దాన్ని ట్రస్ట్ పేరుతో మార్చారని.. ఆంధ్రజ్యోతి ప్రచారం చేయడం.. పవన్ కల్యాణ్ వంటి వారు స్థలం అడిగినా టీటీడీ లేదని చెప్పడం వంటి వివరాలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లేలా చేశారు. తాను ఏ వ్యక్తిగత లాభం ఆశించి ఈ స్థలం కోరలేదని తిరుమల కొండపై ఏ నిర్మాణం చేసినా అది చివరికి స్వామివారికే చెందుతుందని కృష్ణమర్తి చెబుతున్నారు. . భక్తుల సౌకర్యార్థం ఒక ట్రస్ట్ ద్వారా సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేశానన్నారు. “ తన వివరణ తీసుకోకుండానే, కొన్ని పత్రికలు ఏకపక్షంగా కథనాలు రాసి తన ఇమేజ్ను డ్యామేజ్ చేయడం వెనుక కుట్ర దాగి ఉందని ఆయన మండిపడ్డారు.
తప్పుడు కథనాల వల్ల ప్రభుత్వంపై కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కానీ అపవాదు రాకూడదనే ఉద్దేశంతో జంగా కృష్ణమూర్తి తన బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు. దైవ సేవ చేసే క్రమంలో ఇలా అడ్డుకోవడం దారుణమని ఆయన ఆవేదన చెందుతున్నారు.
