కొత్తపలుకు : కేసీఆర్‌కు కౌంట్ డౌన్ స్టార్టయిందని తేల్చిన ఆర్కే..!

ఆంధ్రజ్యోతి ఆర్కే తన వారాంతపు ఆర్టికల్ “కొత్తపలుకు”లో ఈ సారి పూర్తిగా ఆర్టీసీ సమ్మె… తదనంతర పరిణామాలపై దృష్టి పెట్టి విశ్లేషించారు. ఇందులో ప్రధానంగా.. కేసీఆర్ వ్యవహారశైలినే ప్రస్తావించారు. ఇష్టం వచ్చినప్పుడు… అకాల వర్షంలా హామీలు కురిపించేసి.. ఆ తర్వాత అమలు చేయలేక… బెదిరింపులకు దిగుతున్న వైనాన్ని… సూటిగా పాఠకుల్లోకి వెళ్లేలా చేయలగలిగారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే… తెలంగాణలో అంతా కేసీఆర్‌కు వ్యతిరేకంగా జరుగుతోందని.. ఆర్కే చెబుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులందర్నీ ఆయన ఏకం చేశారని.. తేల్చేశారు. హుజూర్‌నగర్‌లో జరుగుతున్న ఉపఎన్నికలో ఫలితం వ్యతిరేకంగా వస్తే సొంత పార్టీలో సైతం తిరుగుబాటు వస్తుందని…ఓ బాంబు లాంటి విశేషాన్ని కూడా ఆర్కే తన కొత్తపలుకులో జోడించారు. మొత్తంగా కేసీఆర్ పరిస్థితి ఆగమాగంగా ఉందంటున్నారు.

ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిని కూడా.. ఆర్కే సునిశితంగా విమర్శించారు. ఆర్టీసీ సమ్మె విషయంలో రోజూ గంటల తరబడి సమీక్షలు చేస్తున్న కేసీఆర్… ఆ కార్మిక సంఘాలను పిలిచి.. అరగంట మాట్లాడి ఉన్నట్లయితే.. సమస్య పరిష్కారమయ్యేది కాదా.. అని ప్రశ్నించారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. విలీనం విషయంపై… ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగోలేదని… చెప్పి కేసీఆర్ కు ఒప్పించగలిగే సామర్థ్యం ఉంది. కానీ… టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘ నాయకుడిగా.. ఎదిగిన అశ్వాత్థామరెడ్డితో తాను చర్చలు జరపడాన్ని కేసీఆర్ నామోషీగా ఫీలయ్యారు. అందుకే ఈ పరిస్థితి వచ్చిందని ఆర్కే అంటున్నారు. ఆర్టీసీకి ఇతర ఉద్యోగసంఘాల నేతలు మద్దతివ్వకుండా .. ఆయా సంఘాల నేతల వ్యక్తిగత అవసరాలు చూపి.. ఎలా నోరు మూస్తున్నారో కూడా.. ఆర్కే వివరించడం ఆసక్తికరంగా ఉంది.

రాజకీయాలలో హత్యలు ఉండవు- ఆత్మహత్యలే ఉంటాయని … కేసీఆర్ కూడా గోటితో పోయేవాటిని గొడ్డలిదాకా తెచ్చుకుంటూ తనకు తానే నష్టం చేసుకుంటున్నారని కొత్తపలుకులో ఆర్కే తేల్చారు. కేసీఆర్ ఇప్పుడు బీజేపీతో సాన్నిహిత్యం కోసం ప్రయత్నిస్తున్నారని… కానీ బీజేపీ హైకమాండ్ పడనీయడం లేదని చెబుతున్నారు. బీజేపీతో సన్నిహిత సంబంధాలను ఏర్పరిచే దూత కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. వచ్చే డిసెంబరు నుంచి రెండు తెలుగు రాష్ట్రాలపై పూర్తిస్థాయిలో దృష్టిని కేంద్రీకరించాలని అమిత్‌షా నిర్ణయించుకున్నట్లు ఆర్కే చెబుతున్నారు. వచ్చే సారి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యమని షా లక్ష్యమని.. ఆయన దాన్ని నెరవేర్చి తీరుతారని అంటున్నారు. మొత్తానికి కేసీఆర్‌కు… ఉక్కపోత ప్రారంభమయిదని.. మాత్రం.. ఆర్కే… తేల్చారు. కేసీఆర్ జాగ్రత్తపడాలనే సందేశాన్ని కూడా కొత్తపలుకు ద్వారా పంపించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com