2016 అక్టోబరు మూదవ తేదీ నుంచి ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం అంటే పరిపాలన అన్నప్పటికీ దసరా సెలవుల కారణంగా మరో పదిరోజుల తర్వాత మొదలవుతున్నది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయంలో ప్రవేశించడం ఇందుకు సంకేతమవుతుంది. . 60ఏళ్ల పాటు హైదరాబాదులో హుస్సేన్ సాగర తీరం నుంచి సాగిన రాజకీయ చరిత్ర శతాబ్దాల కిందటి రాజధాని అమరావతికి మరలిపోవడం మరో చారిత్రిక ఘట్టమే. నిజానికి ఇప్పటికి హైదరాబాదే చట్టబద్దమైన రాజధానిగా (డీజ్యూరీ) వుంటుంది. అమరావతి వాస్తవిక రాజధాని(డీ ఫ్యాక్టో) మాత్రమే. . రాజ్యాంగ రీత్యా 2024 వరకూ ఉమ్మడి రాజధాని గనక ఎపికి కేటాయించిన భవనాలను అప్పుడే తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించడం లేదు. నామకార్థపు సిబ్బందితో భారీ ఫైళ్ల కట్టలతో ఈ భవనాలు ఎపి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగుతాయన్నది అవగాహన.కనుక ఎపిలోని సచివాలయంలో ఈ పేపర్ల ద్వారా పనిజరిగితే హైదరాబాదులో ఒరిజినల్స్ వుంటాయన్నమాట. మొత్తం 22వేలమందికి పైగా ఎపి సచివాలయ సిబ్బంది అధికారులు వుంటే వీరిలో దాదాపు సగభాగం పదవీ విరమణ చేశారు. ఇంచుమించు 12 వేలమంది దశలవారిగా తరలిపోయిన పోతున్నట్టు చెప్పాలి.వీరికి తగిన ఇంటి వసతి వంటివి లేని మాట నిజం. ఇందుకోసం భారీ వ్యయంతో ప్రైవేటు భవనాలను తీసుకున్నా అద్దెలు భరించలేని స్థాయిలో వున్నాయి.
ఉమ్మడిగా వుంటే వేరు గాని విభజన జరిగిపోయిన తర్వాత భౌగోళికంగా ఆనుకుని వుండని హైదరాబాదు నుంచి పరిపాలన నడపడం అవసరం లేని పనే. ఎపిలో ఎటు వైపు నుంచి చూసినా 200 కిలోమీటర్లపైమాటే. అధికారులు ఒకచోట అధినేతలు ఒకచోట వుండటం వల్ల అనుదిన సమస్యలు ఎదురవుతాయి. కనుక రాజధానిని త్వరితంగా తరలించడంలో తప్పులేదు. అయితే అక్కడి నుంచి రాయలసీమ జిల్లాలకు మరీ ముఖ్యంగా కడప అనంతపురంలకు బాగాదూరం పెరుగుతుంది. ఏవేవో ప్రత్యేక దారులు వేస్తామన్నప్పటికి బాగానే ఇప్పుడప్పుడే జరిగేది కాదు.
కాంగ్రెస్ నేతలు ఉండవల్లి అరుణ్‌కుమార్, జైరాం రమేష్ వంటి వారువిభజనపై రాసిన పుస్తకాలు చూస్తే ఈ తతంగం ఎంత ఏకపక్షంగా అయోమయంగా జరిగించో అర్థమవుతుంది. తెలంగాణ అంటూ ఏర్పడిన తర్వాత హైదరాబాదు దాంట్లో భాగం కావడం అనివార్యమని తెలిసినా ద్రానిపై ఏదో పెద్ద పోరాటం చేస్తున్నట్టు ఈ నాయకులంతా మాట్లాడారు. చివరకు విభజన చట్టంలో పదేళ్లు ఉమ్మడిగా వుండాలని, అక్కడ శాంతి భద్రతలకు సంబంధించి 8వ షెడ్యూలు అమలు కావాలని నిర్దేశించారు. ఇప్పటికీ కొనసాగుతున్న ఇఎల్ నరసింహన్ స్పష్టత కోరినందునే ఆ షెడ్యూలు పొందుపర్చామని జైరాం రమేష్రాశారు. తమాషా ఏమంటే ఈ 8వ షెడ్యూలు అమలైందనీ కాలేదని చెప్పడం కష్టం. ఏది ఏమైనా . నరసింహన్ అసలే పట్టించుకోలేదు. నగరం కూడా ప్రశాంతంగానే వుండిపోయింది. పదేళ్లు ఇక్కడ వుండి తెలుగుదేశంను అధికారంలోకి తెచ్చాకే వెళతానన్న చంద్రబాబు తన క్యాంపు కార్యాలయానికి, సచివాలయం బ్లాకుకూ భారీ మరమ్మతులు చేయించారు. కాని ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టు,, తను మాట్లాడిన క్యాసెట్టు విడుదల తర్వాత ఇదంతా మారింది. ఉమ్మడి రాజధాని అంటే అనుభవజ్ఞుడైన తనకూ పట్టు వుంటుందనే ఆయన అంచనా వమ్మయిపోయింది. రాజకీయ వ్యూహాలకూ లోపాయికారి ఎత్తుగడలకు కూడా భద్రత వుండదని ే ఆఘమేఘాల మీద హైదరాబాదునుంచి మకాం మార్చేశారు.
శాసనసభ ఎన్నికల్లో హైదరాబాదులో తెలుగుదేశం-బిజెపి కూటమి అత్యధిక స్థానాలు తెచ్చుకున్నది. నగరంకోసం అక్కడున్న వివిధ ప్రాంతాల రాష్ట్రాల ప్రజలకోసం చేయవలసింది చాలా వుండింది. కాని తెలంగాణ తెలుగుదేశం ఒక్కసారి పేకమేడలా కూలిపోయి ముగ్గురు తప్ప అందరూ పాలకపక్షంలో కలసి పోయారు! విభజన ఉద్యమ సమయంలో ఈ నగరం గురించిన చర్చకూ అనంతరం ఏడాదిలో తలకిందులైన పరిస్థితికీ కూడా పాలకవర్గాలే కారణమైనాయి.జిహెచ్ఎంసి ఎన్నికల్లో 98 శాంతి టిఆర్ఎస్ విజయం సాధించడంతో ఈ పరిణామ క్రమం పరాకాష్టకు చేరింది.
కార్యాలయ ప్రవేశం సందర్భంగా చంద్రబాబు నాయుడు ఒకప్పుడు మద్రాసు(ఇప్పుడు చెన్నై) నుంచి ఆంధ్ర రాజధాని తరలించుకువచ్చిన పరిస్థితులు గుర్తు చేశారు గాని అవి పూర్తిగా భిన్నమైనవి. 1953 జనవరి 15న రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అక్టోబరు1న రాష్ట్రం ఏర్పడింది. ఈ మధ్యలో మద్రాసులో తాత్కాలికంగా ఈ కార్యాలయాలు కొనసాగడానికి అనుమతించాలని ముఖ్యమంత్రి రాజాజీకి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్, ప్రధాని నెహ్రూ ఎంతగా చెప్పినా వినిపించుకోలేదు. పైగా ఆంధ్రలో తనపై విషప్రచారాలు చేస్తున్నారని రాజాజీ జవాబు రాశారు. పార్లమెంటు తీర్మానంలో ఆంధ్రకు చెందిన పలుకార్యాలయాలు కొనసాగుతాయి అన్న వున్న భాగాన్ని కొన్ని కార్యాలయాలు అని మార్పు చేసినా రాజాజీ సంతృప్తి చెందలేదు. అప్పుడు ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి విజయవాడను రాజధానిని చేయాలనే బలమైన ఉద్యమం వున్నా ఆనాడు అక్కడ కమ్యూనిస్టుల ఙలం గురించిన భయం కారణంగా కర్నూలును నిర్ణయించారు. హైకోర్టు గుంటూరులో ఏర్పాటు చేశారు.కర్నూలులో మొదట గుడారాల్లో కార్యాలయాలు నడిపించారు. 1953 నవంబరు 28న ప్రకాశం పంతులు శాసనసభలో మాట్లాడుతూ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తర్వాత హైదరాబాదు తరలిపోవలసి వుంటుందని స్పష్టంగా ప్రకటించారు. తర్వాతది తెలిసిన చరిత్ర…
కేంద్రం ఏకపక్షంగా విభజన నిర్ణయం తీసుకుందనేది ఒకటైతే ఇప్పుడు రాజధాని నిర్ణయంలో చంద్రబాబు ప్రభుత్వమూ అలాగే వ్యవహరించిందని చెప్పాలి. ఒక్క అఖిలపక్షసమావేశమైనా జరిపింది లేదు. అయినా అందరూ బలపర్చారు. ఇప్పుడు వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం కూడా సమగ్రమైంది కాదు. శాసనసభ, రాజ్‌భవన్, హైకోర్టు వంటి కీలక నిర్మాణాలు జరగవలసి వుంది. కోర్ కాపిటల్, సీడ్ కాపిటల్, స్టార్టప్ క్యాపిటల్ అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అనేక ముక్కలుగా విభజించారు. ఇవన్నీ తేలకపోవడం వల్లనే కేంద్రం నిధులు ఇచ్చిన మేరకైనా అధికారిక నిర్మాణాలు రహదారులు పూర్తి చేయలేదు. అసలు మొత్తం రాజధాని నిర్మాణ క్రమం చాలా విమర్శలతో వివాదాలతో నడుస్తున్నది. కర్నూలు హైదరాబాదుల వలె గాక ఇప్పుడు సింగపూర్ కంపెనీలు, వారితో చేతులు కలిపే ప్రైవేటు కార్పొరేట్లు, పెద్ద పాత్ర వహించబోతున్నారు. కాని వారి పెట్టుబడులు తీసుకురారు. ఇక్కడ వారి తరపు ఏజంట్లే చేస్తారు. స్విస్ చాలెంజి విధానాన్ని అనుసరించడంపై కేసు ఇంకా నడుస్తున్నది. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చినా అది ప్రభుత్వం చెప్పిన ప్రజా రాజధానిగా వుండబోదని స్పష్టమై పోయింది.్ట రాజధాని అంటే జీవితానికి కేంద్రంగా వుండాలని చంద్రబాబు ఒకప్పుడు చెప్పడం అందరికీ గుర్తుంటుంది.కాని ఆయనే ఇప్పుడు వాణిజ్య కార్యకలాపాలు ఆదాయం ప్రధానంగా తీసుకున్నారు. ఇందులో చాలా చిక్కులున్నాయి. ఆలస్యమూ అవుతుంది.
విమర్శలూ వివాదాలు ఎలా వున్నా చంద్రబాబు నాయుడు రెండేళ్లకే రాజధానిని తరలించడంపై సానుకూల భావనే ఎక్కువగా వుంది.కాకపోతే ఈ పని మరింత సమగ్రంగా చేసి వుంటే బావుండనే మాట కూడా వినిపిస్తుంది. వాటికన్నా ఇప్పుడు అమరావతి నుంచి ప్రజాపాలన సాగించడంపై దృష్టి ప్రధానం.