ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకు కీలకం కాబోతోంది. అందుకే, ప్రధాన పార్టీలన్నీ కాపులవైపే చూస్తున్నాయి. వారిని ఆకర్షించడం కోసమే ప్రయత్నిస్తున్నాయి. వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు చాటిచెప్పుకుంటున్నాయి. పార్టీలో, పార్టీల విధానాల్లో, అవకాశం ఉన్న పదవుల్లో వారికి ప్రాధాన్యత కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, జనసేన అధ్యక్షుడు, ఇప్పుడు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు… వీరంతా ఆ సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం. ఏపీలో సొంతంగా ఎదగాలనుకుంటున్న భాజపా కూడా ఇప్పుడు కాపులనే లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు మొదలుపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తోంది. కాపు ఓటు బ్యాంకునే బేస్ చేసుకోవాలనే ప్రయత్నం ప్రారంభించిందని చెప్పాలి.
ఇక, కాపుల విషయంలో టీడీపీ ఇప్పటికే కొంత జాగ్రత్త పడిందనే చెప్పొచ్చు. తెలుగుదేశంలో ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత అనే విమర్శ గతంలో వినిపించేది. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిమిడి కళావెంకట్రావుకి అవకాశం ఇచ్చారు. హోం మంత్రిగా నిమ్మకాయల చినరాజప్ప, కీలకమైన సీఆర్డీయే ప్రాంత బాధ్యతలను నారాయణకు అప్పగించారు. ఉత్తరాంధ్ర నుంచి గంటా శ్రీనివాసరావుకి కూడా పార్టీలో కీలకమైన స్థానమే ఉంది. కీలకమైన పదవుల్లో ఆ సామాజిక వర్గ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం మాత్రమే కాదు… కాపులను ఆకర్షించేందుకు కార్పొరేషన్ కూడా పెట్టింది. కాపుల రిజర్వేషన్లకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. ఇక, జనసేన విషయానికి వస్తే… పవన్ కల్యాణ్ తాను అందరివాడని అని చెబుతున్నా, పవన్ ని తమ ప్రతినిధిగానే ఆ సామాజిక వర్గంలో చాలామంది చూస్తున్నారు. కాపుల రిజర్వేషన్లంటూ ఉద్యమించిన ముద్రగడ కూడా పవన్ కి మద్దతుగా ఉండే క్రమంలోనే వివిధ సందర్భాల్లో స్పందిస్తున్నారు. కాపు ఓటు బ్యాంకు విషయంలో జనసేన కూడా వ్యూహాత్మకంగానే ఉంది.
ప్రతిపక్ష పార్టీ వైకాపా విషయానికొస్తే… ఆ పార్టీ అధ్యక్షుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ పార్టీ నాయకుడు, అసెంబ్లీ పీయేసీ ఛైర్మన్.. ఇలా పార్టీలో కీలకమైన స్థానాల్లో కాపులకు ప్రాధాన్యత కల్పించలేకపోయారు. కానీ, ఇప్పుడు కీలకమైన కాపు నేతల్ని పార్టీలోకి ఆకర్షించే పనిలో వైకాపా ఉంది. అదే క్రమంలో కన్నా లక్ష్మీనారాయణను రప్పించేందుకు శతవిధాల ప్రయత్నించారు. కానీ, కుదర్లేదు. రిజర్వేషన్లు, కాపులకు సంబంధించిన ఇతర అంశాలపట్ల అవకాశమున్నప్పుడు వారి పక్షాన బలంగానే గళం వినిపిస్తోంది. ఇలా ఏపీలో అన్ని పార్టీలూ కాపు ఓటు బ్యాంకుపైనే కన్నేశాయి. ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వారు ఎవరివైపు మొగ్గుతారనేది రానురానూ ఆసక్తికరంగా మారుతోంది.