2026 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలవబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు మెగా ప్రాజెక్టులు ఈ ఏడాదిలో పూర్తికావడమో లేదా కీలక దశకు చేరుకోవడమో జరగనుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల ముఖచిత్రాన్ని మార్చే ప్రధాన మార్పులు ఈ ఏడాదే చోటు చేసుకోనున్నాయి.
రాజధాని అమరావతి పునర్నిర్మాణం
2026లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ,పరిపాలనా పరంగా ఒక పెద్ద మార్పును చూడబోతోంది. అమరావతి రాజధాని పనులు శరవేగంగా పుంజుకోనున్నాయి. వరల్డ్ బ్యాంక్ , ఏడీబీ నుండి అందుతున్న నిధులతో పనులు జోరుగా సాగనున్నాయి. ఐకానిక్ భవనాలు అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్, మౌలిక సదుపాయాల కల్పన ఈ ఏడాదిలో వేగవంతం కానుంది. ఐటీ కంపెనీల రాక , స్టార్టప్ ఏరియా అభివృద్ధి ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. 2026 ఏడాది చివరికి అమరావతికి ఓ రూపం వస్తుంది.
బోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం – ఉత్తరాంధ్ర ముఖద్వారం
విశాఖపట్నం సమీపంలోని బోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రథమార్థంలోనే కమర్షియల్ విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. దాదాపు రూ. 4,500 కోట్ల వ్యయంతో జిఎంఆర్ గ్రూప్ నిర్మిస్త్ున్న ఈ ప్రాజెక్టు, ఉత్తరాంధ్రలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలకనుంది. కేవలం ప్రయాణికులకే కాకుండా, భారీ కార్గో సేవలకు కూడా ఇది కేంద్రంగా మారుతుంది. దీనికి అనుబంధంగా విశాఖ – భోగాపురం మధ్య నిర్మిస్తున్న 6 లేన్ల బీచ్ కారిడార్ రహదారి కూడా పూర్తయితే, ఈ ప్రాంతం అంతర్జాతీయ పర్యాటక హబ్‌గా రూపాంతరం చెందుతుంది.
వెలుగొండ ప్రాజెక్టు
దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు 2026లో తన పూర్తి సామర్థ్యంతో ఫలితాలను ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ప్రకాశం, నెల్లూరు , కడప జిల్లాల్లోని కరువు ప్రాంతాలకు కృష్ణా జలాలను తరలించే ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెండో సొరంగం పనులు, అనుబంధ కాల్వల పనులు ఈ ఏడాదిలో తుది దశకు చేరుకోనున్నాయి. ఇది పూర్తయితే దాదాపు 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు శాశ్వతంగా తాగునీటి కష్టాలు తీరుతాయి.
పోర్టులు..రోడ్లు.. ఎకనమిక్ కారిడార్లు !
రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న నాలుగు కొత్త పోర్టుల్లో ముఖ్యంగా రామాయపట్నం, మచిలీపట్నం పోర్టులు 2026లో తమ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించే దిశగా సిద్ధమవుతున్నాయి. ఇవి కాకుండా, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రాయ్‌పూర్ – విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ పూర్తికావడం వల్ల సరుకు రవాణా వేగవంతం అవుతుంది. అలాగే, విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ,తొలిదశ పనులు ఒక రూపు సంతరించుకోనున్నాయి. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు భారీగా అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా కర్నూలు ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటెగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టులు పూర్తికానున్నాయి.
పెట్టుబడుల పరంగా చరిత్రలో నిలిచిపోనున్న ఏడాది
ఇక ఈ ఏడాది ఏపీ పెట్టుబడుల పరంగా చరిత్రలో నిలిచిపోనుంది.గూగుల్ ఏఐ హబ్ పనులు జోరుగా సాగనున్నాయి. టీసీఎస్, కాగ్నిజెంట్,ఇన్ఫోసిస్ సహా పదుల సంఖ్యలో కంపెనీలు తమ కార్యాలయాలను నిర్మిస్తాయి. ఇతర తయారీ రంగ పెట్టుబడులు కూడా భారీగా రానున్నాయి. ఈ ఏడాది మొత్తం ఏపీలో పండుగ వాతావరణం కనిపించడం ఖాయమని అనుకోవచ్చు.
