తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో లోతైన విచారణ జరిపి, బాధ్యులను గుర్తించేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది.
కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి గతంలో సిట్ కరించిన ప్రాథమిక ఆధారాలను, నివేదికలను దినేష్ కుమార్ కమిషన్ నిశితంగా పరిశీలించనుంది. నెయ్యి కొనుగోలు టెండర్లలో నిబంధనల ఉల్లంఘనలు, నాణ్యతా పరీక్షల్లో వైఫల్యాలు మరియు ఈ మొత్తం ప్రక్రియ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనే కోణంలో కమిషన్ దర్యాప్తు సాగనుంది.
45 రోజుల్లోగా పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని గడువు విధించడంతో, దోషులెవరో తేలిపోయే అవకాశం ఉంది. అధికార యంత్రాంగంలో అపార అనుభవం ఉన్న దినేష్ కుమార్ ఈ బాధ్యతలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను ప్రకటించగానే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ కమిషన్ నియామకం రాజ్యాంగ విరుద్ధమని, ఇది కేవలం రాజకీయ కక్షసాధింపు చర్య అని ఆయన గగ్గోలు పెడుతున్నారు.
దర్యాప్తు ప్రారంభం కాకముందే ఆయన ఈ స్థాయిలో విమర్శలు చేయడం వెనుక దొరికిపోతామనే భయం కనిపిస్తోందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. కమిషన్ వేగంగా విచారణ జరిపితే గత పాలకమండలి హయాంలో జరిగిన అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనన్న ఆందోళన వైసీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ఏకసభ్య కమిషన్ను వైసీపీ నేతలు టార్గెట్ చేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కమిషన్ ఇచ్చే నివేదికను అడ్డుకోవడానికి లేదా దాని విశ్వసనీయతను దెబ్బతీయడానికి చట్టపరమైన సవాళ్లు విసిరేందుకు వైసీపీ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.
