కొన్నిసార్లు గత వైభవాన్ని గుర్తు చేసుకోవడం ఒక కొత్త ఎనర్జీని నింపుతుంది. సాధించిన విజయాలను తలుచుకుంటే ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించే ధైర్యం వస్తుంది. అలాంటి ఎనర్జీని దర్శకుడు పూరి జగన్నాథ్, ఆయన అభిమానుల్లో మళ్లీ నింపారు ప్రభాస్. సంతోష్ శోభన్ నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు వింటేజ్ పూరిని గుర్తు తెస్తున్నాయి.
ప్రభాస్ సినిమాల్లో తన ఫేవరేట్ మూవీ ‘ఎక్ నిరంజన్’ అని చెప్పాడు సంతోష్ శోభన్. అక్కడి నుంచి మొదలైన సంభాషణలో ప్రభాస్, పూరి స్టైల్‌ను మరోసారి గుర్తుచేసుకుంటూ.. “పూరి గారిలా హీరో క్యారెక్టర్ రాయగల డైరెక్టర్ ఇండియాలోనే లేడు. నా కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్ ‘బుజ్జిగాడు’. ఆ పాత్ర గురించి మొదట వినగానే ఎలా చేయాలా అని భయపడ్డాను. ‘ఎక్ నిరంజన్’ కూడా అంతే వెరైటీగా ఉంటుంది. ఒక హీరో క్యారెక్టర్ ని పూరి గారిలా రాసే డైరెక్టర్ మరొకరు లేరు” అని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పాడు.
నిజమే… ‘మన్మధుడు’ సినిమాలో తనికెళ్ళ భరణి స్టైల్లో చెప్పాలంటే — ఇప్పుడు చూస్తున్న పూరి.. పూరి కాదు. ఆ పూరి వేరు. ఆయన హీరో డైనమైట్లా పేలిపోతాడు, డైలాగ్‌లు బాక్సాఫీసును బద్దలుకొడతాయి. సింగిల్ సిట్టింగ్‌లో వంద కోట్ల సినిమా రాసేయగల డాషింగ్ డైరెక్టర్ పూరి. అయితే ఇటీవల కాలంలో ఆయన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోతున్నాయి. ఆడియన్స్‌తో వేవ్‌లెంగ్త్ ఎక్కడో మిస్ అవుతుంది. కానీ దాన్ని తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడం కూడా ఆయనకి పెన్నుతో పెట్టిన విధ్యే.
ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం పూరికి లేదు. వంద కోట్లు కలగానే ఉన్న రోజుల్లోనే టాలీవుడ్ బాక్సాఫీసును ఆ దిశగా పరుగులు పెట్టించిన బిజినెస్ మ్యాన్ పూరి. ప్రస్తుతం వరుస పరాజయాలు ఎదురైనా, ఆయనలోని మాస్ ఎక్కడికీ పోలేదు. ప్రతి శుక్రవారం జాతకాలు మారిపోయే ఈ పరిశ్రమలో పూరికి ఓ ‘శుక్రవారం’ రావడం పెద్ద కష్టం కాదు. ఆ రోజు వచ్చిన వెంటనే ఆయన లైనప్ మళ్లీ మారిపోవడం ఖాయం.
సక్సెస్ మార్కెట్ మళ్లీ సెట్ అయితే ప్రభాస్‌తో పూరి మరోసారి చేతులు కలపడం కూడా ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ప్రభాస్‌కు లెక్కలు కంటే కృతజ్ఞత భావం ఎక్కువ. తనకు ‘వర్షం’ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు శోభన్ కుటుంబానికి ఎప్పుడూ అండగా నిలుస్తూ సంతోష్ శోభన్‌కు ఎప్పుడూ అండగా ఉంటాడు ప్రభాస్. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ను కూడా వారికి ఎప్పుడూ ఓపెన్‌గా ఉంచాడు. అలాగే పూరి కుటుంబంతో కూడా ప్రభాస్ ప్రత్యేకమైన అనుబంధం వుంది. ఆకాష్ పూరి సినిమాకు స్వయంగా వచ్చి ప్రమోషన్ చేయడం అందుకు ఉదాహరణ.
పూరి ఏ సినిమా చేస్తున్నా… ‘నేను ఏమైనా చేయాలా డార్లింగ్?” అని అడిగే నైజం ప్రభాస్ది. తనను అభిమానులకు ‘డార్లింగ్’గా చేసిన దర్శకుడిపై ఆయనకు ఉన్న కృతజ్ఞత మరోసారి ఈ ఇంటర్వ్యూలో స్పష్టమైంది. తాజాగా చేసిన వ్యాఖ్యలతో పూరి ప్రతిభను గుర్తు చేస్తూ, ఆయన ఫ్యాన్స్‌కు కొత్త కిక్ ఇచ్చాడు ప్రభాస్.
ప్రస్తుతం విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ చేస్తున్నాడు పూరి. ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి. ఇది కనుక ఆశించిన విజయం సాధిస్తే పూరికి పునర్వైభవం రావడం పెద్ద సవాల్ ఏమీ కాదు. ఒక్క హిట్ తో లెక్కలు మారిపోతాయి. బుజ్జిగాడు, ఎక్ నిరంజన్ లాంటి క్యారెక్టర్స్ రాసి పూరి నుంచి ప్రభాస్ కోసం ఆయన స్టయిల్ ఇంకో క్యారెక్టర్ పడితే చూడాలని ఫ్యాన్స్ కూడా వెయిటింగ్.
