ఎమ్మెల్సీ పదవికి జయమంగళ వెంకటరమణ చేసిన రాజీనామాను శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు. జయమంగళ స్వయంగా మండలి చైర్మన్‌ను కలిసి తన రాజీనామాను ఆమోదించాలని కోరినప్పటికీ, ఆయన ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని చైర్మన్ మోషెన్ రాజు తిరస్కరించారు. జయమంగళ ఇప్పటికే జనసేన పార్టీలో చేరిపోయి, విచారణకు కూడా ఆ పార్టీ కండువాతోనే హాజరైనప్పటికీ చైర్మన్ ఈ నిర్ణయం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
సాధారణంగా ఎవరైనా సభ్యులు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే వాటిని వెంటనే ఆమోదించాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత చైర్మన్‌పై ఉంటుంది. కానీ, జయమంగళ విషయంలో గత ఏడాది కాలంగా నిర్ణయాన్ని వాయిదా వేస్తూ రావడం, చివరకు హైకోర్టు జోక్యం చేసుకుని నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన తర్వాత కూడా ఇలా తిరస్కరించడం విస్మయానికి గురి చేస్తోంది. పదవికి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరిపోయిన వ్యక్తిని కూడా సాంకేతికంగా తమ పార్టీలోనే ఉన్నట్లు చూపించుకోవాలని చూడటానికే వైసీపీ ఇలా చేస్తోందని అంటున్నారు.
గతంలో ఇదే మండలి చైర్మన్ వ్యవహరించిన తీరు భిన్నంగా ఉంది. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి వెళ్ళిపోతారని అనుకున్న కొందరు ఎమ్మెల్సీలపై ఎటువంటి లోతైన విచారణ లేకుండానే, అత్యంత వేగంగా అనర్హత వేటు వేశారు. అప్పట్లో వారు పార్టీ మారకపోయినా కేవలం ఆరోపణల ఆధారంగా చర్యలు తీసుకున్న చైర్మన్, ఇప్పుడు ఏకంగా మరో పార్టీ కండువా కప్పుకుని వచ్చి రాజీనామా అడుగుతున్నా ఆమోదించకపోవడం విమర్శలకుతావిస్తోంది. వైసీపీకి మండలిలో సంఖ్యాబలాన్ని కాపాడుకోవడం కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


