నితిన్ వరుస ఫ్లాపులతో అల్లాడిపోతున్నాడు. తనకో హిట్టు చాలా అవసరం. ఈసారి ఫ్లాప్ కొడితే… తన కెరీర్ మరింత రిస్కులో పడిపోతుంది. అందుకే ఆచి తూచి అడుగులేస్తున్నాడు. చాలా కథల్ని పక్కన పెట్టాడు. ఆఖరికి ‘ఎల్లమ్మ’ కూడా చేజారిపోయింది. ఈ తరుణంలో ఓ కొత్త దర్శకుడి కథకు ఓకే చెప్పాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో నితిన్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈనెలాఖరున ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.
ఈ చిత్రంలో కథానాయికగా రితికా నాయక్ ని ఎంచుకొన్నట్టు సమాచారం. ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాతో ఆకట్టుకొంది రితిక. ‘మిరాయ్’ లాంటి మంచి హిట్ తన చేతిలో ఉంది. ఇటీవల పట్టాలెక్కిన ‘పవర్ పేట’ లో హీరోయిన్ గా నటిస్తోంది. సందీప్ కిషన్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రమిది. ఇప్పుడు నితిన్ సినిమాలో ఆఫర్ అందుకొంది. కుటుంబ నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఫ్యామిలీ డ్రామాని సూచించేలా ఓ పేరు కూడా ఖరారు చేశారని తెలుస్తోంది. టైటిల్ తో పాటుగా మిగిలిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.
