నారా లోకేష్ తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన షోలింగర్ శ్రీ యోగ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. దీనికి చోళసింహపురం అనే పేరు ఉంది. మహానాడు దిగ్విజయంగా పూర్తి కావడంతో ఈ రోజు ఉదయం ఆయన ఆలయానికి వెళ్లారు. అర్చకులు , ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. కొండపై వెలసిన ఈ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారిని, అలాగే పక్కనే ఉన్న కొండపై వెలసిన యోగ ఆంజనేయస్వామి వారిని లోకేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనానంతరం ఆలయ వేద పండితులు నారా లోకేష్‌కు వేదాశీర్వచనం అందించి, స్వామి వారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు విజయవంతం కావాలని, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని తాను స్వామి వారిని ప్రార్థించినట్లు లోకేష్ పేర్కొన్నారు. మంత్రి రాకను పురస్కరించుకుని ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
రాయలసీమ ప్రాంతానికి సరిహద్దుగా ఉన్న ఈ క్షేత్రానికి ఏపీ నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ఈ పర్యటనలో మంత్రి లోకేష్‌తో పాటు పలువురు ముఖ్య నేతలు, స్థానిక తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇటీవల వరుసగా భారీ డిఫెన్స్, సోలార్ ప్రాజెక్టుల శంకుస్థాపనలు, గ్లోబల్ లీడర్లతో భేటీలతో పాటు మహానాడు నిర్వహణతో తీరిక లేకుండా ఉన్న మంత్రి లోకేష్ ఇలా ఆధ్యాత్మిక పర్యటనకు రావడం పార్టీ శ్రేణుల్లో ఆసక్తిని నింపింది.


