“దక్షిణాదికి అన్యాయం చేస్తున్నారని రాజకీయం చేశారు సరే.. మరి న్యాయం చేసే ఫార్ములాను ఎందుకు ప్రతిపాదించలేకపోతున్నారు?. ”
దక్షిణాదికి అన్యాయం పేరుతో కాంగ్రెస్ కూటమి పార్టీలు డిలిమిటేషన్ బిల్లును వీగిపోయేలా చేశారు. ఈ ప్రక్రియను అడ్డుకోవడం ద్వారా విజయం సాధించామని సంబరాలు చేసుకుంటున్న పార్టీలు , అసలు సమస్యకు పరిష్కారం చూపే విషయంలో మాత్రం మౌనాన్ని ఆశ్రయించాయి. దక్షిణాదికి అన్యాయం జరిగిందని గొంతు చించుకుంటున్న ఈ పార్టీలు, ఆ అన్యాయాన్ని ఎలా సరిదిద్దాలి? ఉత్తరాదికి, దక్షిణాదికి మధ్య ఉండాల్సిన సీట్ల నిష్పత్తి ఎంత? ఏ ప్రాతిపదికన సీట్లను కేటాయిస్తే సమాఖ్య స్ఫూర్తి వర్ధిల్లుతుంది? అన్న ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం లేదు. దక్షిణాదికి ఎంత ప్రాధాన్యం ఇస్తే న్యాయం చేసినట్లో ఎవరు చెబుతారు?. ఏం చేసినా ప్రజల్ని రెచ్చగొట్టడమే రాజకీయం అయితే దేశానికి ఎలా ప్రయోజనం?
దక్షిణాదికి శిక్ష వాయిదాలు
స్వతంత్ర భారత దేశంలో నియోజకవర్గాల పునర్విభజన కోసం ఇప్పటివరకు నాలుగు సార్లు 1952, 1963, 1973, 2002 డీలిమిటేషన్ కమిషన్లను ఏర్పాటు చేశారు. ప్రతి పదేళ్లకు ఒకసారి జరిగే జనాభా గణన ఆధారంగా లోక్ సభ స్థానాలను పునర్వ్యవస్థీకరించాలని రాజ్యాంగంలోని అధికరణ 82 నిర్దేశిస్తోంది. దీని ప్రకారం, చివరగా 1971 జనాభా గణన ఆధారంగా 1973లో లోక్ సభ సీట్ల సంఖ్యను 543కు పెంచారు. అప్పట్లో ఒక ఓటు – ఒకే విలువ అనే సూత్రంతో, దేశవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో దాదాపు సమాన సంఖ్యలో జనాభా ఉండేలా సీట్లను కేటాయించారు. 1970వ దశకంలో కేంద్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను తీవ్రతరం చేసింది. దక్షిణాది రాష్ట్రాలు ఈ కార్యక్రమాలను క్రమశిక్షణతో అమలు చేసి జనాభాను నియంత్రించగా, ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల కొనసాగింది. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే, కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలు పార్లమెంటులో తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఈ అన్యాయాన్ని నిరోధించడానికి 1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 2001 వరకు సీట్ల పెంపుపై నిషేధం విధించింది. అంటే, జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు రాజకీయ శిక్ష పడకుండా రక్షణ కల్పించారు. 2001లో నిషేధం గడువు ముగిసిన తర్వాత, అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణను తీసుకువచ్చింది. దీని ప్రకారం, నియోజకవర్గాల సరిహద్దులను మార్చడానికి అనుమతించారు కానీ, మొత్తం సీట్ల సంఖ్యను మాత్రం పెంచలేదు. 1971 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా కొనసాగిస్తూ, సీట్ల పెంపుపై నిషేధాన్ని మరో 25 ఏళ్ల పాటు అంటే 2026 వరకు పొడిగించారు. దీనివల్ల 2002-2008 మధ్య జరిగిన పునర్విభజనలో కేవలం రాష్ట్రాల లోపల నియోజకవర్గాల సరిహద్దులు మాత్రమే మారాయి తప్ప, లోక్ సభలో రాష్ట్రాల బలాబలాలు మారలేదు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, 2026 తర్వాత జరిగే మొదటి జనాభా గణన ఆధారంగా కొత్త పునర్విభజన జరగాలి. ఇప్పుడు జనగణన ప్రారంభమయింది. రాజ్యాంగం ప్రకారం జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన జరిగితే ఉత్తరాది రాష్ట్రాల సీట్లు భారీగా పెరిగి, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గుతాయి.
దక్షిణాదిలో తగ్గిన జనాభా – పెరిగిన జీడీపీ
1971లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు దేశ జనాభాలో దక్షిణాది వాటా దాదాపు 25 శాతంగా ఉండేది. అప్పట్లో ఉత్తరాది రాష్ట్రాల జనాభా వృద్ధి రేటు కూడా నియంత్రణలోనే ఉండేది. కానీ, గడిచిన ఐదు దశాబ్దాల్లో పరిస్థితి తలకిందులైంది. నేడు 2025 నాటికి దక్షిణాది జనాభా వాటా 18 శాతానికి పడిపోగా, ఉత్తరాది రాష్ట్రాల వాటా గణనీయంగా పెరిగింది. ఈ జనాభా అసమతుల్యతనే ప్రాతిపదికగా తీసుకుంటే, రాబోయే పునర్విభజనలో దక్షిణాది సుమారు 100 సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ఆర్థిక కోణంలో విశ్లేషిస్తే దక్షిణాది రాష్ట్రాల ప్రగతి అబ్బురపరుస్తుంది. 1971 నాటి దేశ స్థూల జాతీయోత్పత్తి లో దక్షిణాది రాష్ట్రాల వాటా సుమారు 24 శాతంగా ఉండేది. కానీ నేడు 2025-26 ఆర్థిక సంవత్సర అంచనాల ప్రకారం, దక్షిణాది రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు 31 శాతం పైగా జీఎస్డీపీని అందిస్తున్నాయి. అంటే, దేశానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న రాష్ట్రాలు ఇవే. పశ్చిమ భారత రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్ కూడా తన జీఎస్డీపీ వాటాను 15 శాతం నుండి 21 శాతానికి పెంచుకుంటూ వస్తోంది. కానీ, ఉత్తరాదిలోని ప్రధాన రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి చోట్ల జనాభా విస్ఫోటనం జరిగినా, దేశ ఆర్థిక వ్యవస్థకు అవి ఇచ్చే వాటా జనాభా నిష్పత్తిలో పెరగలేదు. 2025 నాటి డేటా ప్రకారం, దక్షిణాదిలోని ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహించే జనాభాకు, ఉత్తరాదిలోని ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహించే జనాభాకు మధ్య దాదాపు 6 నుండి 10 లక్షల తేడా ఉంది. కేవలం జనాభా ను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవడం అన్నది 1950వ దశకానికి సరిపోవచ్చు, కానీ 2026 నాటి ఆధునిక భారతానికి అది సరిపోదు. అప్పుల పాలై జనాభా పెంచిన వారికి అధికారం, కష్టపడి సంపాదించి దేశాన్ని కాపాడే వారికి అశక్తత ఎదురు కాకూడదు. ఇది దేశ సమాఖ్య స్ఫూర్తికే కాక, ఏకత్వానికి కూడా చేటు తెచ్చే ప్రమాదం ఉంది.
దక్షిణాదికి మేలు చేసే ఫార్ములా ఏది?
పునర్విభజన అనేది కేవలం అంకెల గణితం కాదు, అది రాష్ట్రాల ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న అంశం. అభివృద్ధికి బహుమతి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ, అభివృద్ధి చెందినందుకు శిక్ష వేయడం మాత్రం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ఢిల్లీ పీఠం ఈ గణాంకాలను గమనించి, దక్షిణాది గొంతుక నొక్కేయకుండా భారతీయత ను ప్రతిబింబించే కొత్త సూత్రాన్ని ఆవిష్కరించాలి. అందుకే కేంద్రం 50 శాతం అదనపు సీట్ల పెంపు అనే ప్రతిపాదన చేసింది. రాజ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్ల విభజన జరగాల్సి ఉండగా, అది అక్షరాలా అమలైతే దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాబల్యం నామమాత్రంగా మారిపోతుందన్నది చేదు నిజం. ఎవరికీ అన్యాయం జరగకుండా జనాభా ప్రాతిపదికన కొత్తగా సీట్లను లెక్కించే పద్ధతికి భిన్నంగా.. ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యను దామాషా పద్ధతిలో 50 శాతం పెంచడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల ఓటింగ్ పవర్ తగ్గకుండా చూడాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 543 స్థానాలను జనాభా లెక్కల ఆధారంగా పెంచితే, ఉత్తరాది రాష్ట్రాల సీట్లు దాదాపు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. కానీ, ప్రస్తుతమున్న సీట్ల నిష్పత్తిని చెరిపివేయకుండా 50 శాతం సీట్లను పెంచితే, రాష్ట్రాల మధ్య బలాబలాల్లో పెద్దగా మార్పు ఉండదు. అంటే, 1971 నాటి జనాభా ప్రాతిపదికన ఏర్పడిన సమతుల్యతనే 2026 తర్వాత కూడా కొనసాగించేందుకు ఇదొక మధ్యేమార్గం. దీనివల్ల ఉత్తరాదితో పాటు దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య పెరుగుతుందే తప్ప, పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం శాతం మాత్రం పడిపోదు. ఇది ఒక రకంగా దక్షిణాది రాష్ట్రాలకు దక్కే రాజకీయ రక్షణ కవచం.
50 శాతం ఫార్ములాపై విస్తృత చర్చ జరగాలి!
మహిళా రిజర్వేషన్ల బిల్లు సందర్భంగా ఈ పెంపునకు సంబంధించిన రాజ్యాంగ సవరణను విపక్షాలు అడ్డుకోవడం ఒక చారిత్రక తప్పిదమా లేక దక్షిణాది హక్కుల రక్షణనా అన్న ప్రశ్నపై చర్చ జరుగుతోంది. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న ఆందోళనతో బిల్లును వ్యతిరేకించడం ద్వారా వారు భావోద్వేగాలను రగిలించగలిగారు కానీ, ఆచరణాత్మకంగా దక్షిణాదికి మేలు చేసే 50 శాతం పెంపు ప్రతిపాదనను చేజేతులా వీగిపోయేలా చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ పెంపు గనుక అమలై ఉంటే, భవిష్యత్తులో జనాభా ఆధారిత విప్లవాత్మక మార్పుల నుండి దక్షిణాది రాష్ట్రాలకు ఒక పటిష్టమైన భరోసా దక్కేది. పునర్విభజన అనేది కేవలం అంకెల గణితం మాత్రమే కాకూడదు, అది దేశ ప్రగతిలో భాగస్వాములైన ప్రతి ప్రాంతానికి ఇచ్చే గౌరవం కావాలి. 50 శాతం పెంపు లాంటి ప్రతిపాదనలు సమాఖ్య వ్యవస్థలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ఊరటనిచ్చేవి. రాజకీయ పంతాల కోసం ఇలాంటి కీలకమైన సంస్కరణలను అడ్డుకోవడం వల్ల దీర్ఘకాలంలో దక్షిణాది రాష్ట్రాలకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఢిల్లీ పీఠం ఈ చిక్కుముడిని విప్పే క్రమంలో కేవలం జనాభాను కాకుండా, చంద్రబాబు సూచించినట్లుగా ఈ సమతుల్యత సూత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటేనే దేశ ఏకత్వానికి భరోసా లభిస్తుంది.
ఏకాభిప్రాయం కోసం చర్చించాలి!
ప్రజాస్వామ్యంలో అధికారం సంఖ్యాబలంపై ఆధారపడి ఉండవచ్చు, కానీ దేశం మాత్రం ఏకాభిప్రాయం పైనే నడుస్తుంది. 50 శాతం పెంపు ఫార్ములాను కూడా రాజకీయ విబేధాల వల్ల విపక్షాలు తిరస్కరిస్తే, అది కేవలం ప్రాంతీయ సెంటిమెంట్‌ను రగిలించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప, క్షేత్రస్థాయిలో దక్షిణాదికి ఎటువంటి న్యాయాన్ని చేకూర్చదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్లుగా జనాభాతోపాటు జీఎస్డీపీ లెక్కలనే ప్రాతిపదికగా తీసుకున్నా దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. 50 శాతం ఫార్ములా కంటే తక్కువ సీట్లు వస్తాయి. ఒకే ఇంట్లో అన్నదమ్ములు ఆస్తుల కోసం శత్రువులుగా మారినట్లు, రాష్ట్రాల మధ్య శత్రుత్వం ఈ డిలిమిటేషన్ వల్ల ప్రారంభం కాకూడదు. దేశం ఒక ఉమ్మడి కుటుంబం లాంటిది. ఇక్కడ కేవలం డబ్బు, జనాభా మాత్రమే నిర్ణయాత్మక శక్తులు కాకూడదు. ఆర్థికంగా చేయూతనిచ్చే దక్షిణాది రాష్ట్రాలు తమ ప్రాధాన్యత తగ్గకూడదని కోరుకుంటున్నాయే తప్ప, ఆధిపత్యం చలాయించాలని ఆశించడం లేదు. హిందీ బెల్ట్ లేదా ఉత్తరాది రాష్ట్రాలకు కేవలం జనాభా ప్రాతిపదికన మెజారిటీ స్థానాలను కట్టబెట్టి, దక్షిణాదిని శాశ్వతంగా వారి పెత్తనం కింద ఉంచాలని భావిస్తే, అది దేశ సమైక్యతకే గొడ్డలిపెట్టు అవుతుంది. ప్రజాస్వామ్యంలో తలల లెక్కింపు ప్రధానమే అయినా, అది అభివృద్ధి చెందిన రాష్ట్రాల ఆత్మాభిమానాన్ని గాయపరిచేలా ఉండకూడదు. సమాఖ్య వ్యవస్థలో ఏ ఒక్క ప్రాంతం కూడా తాము అన్యాయానికి గురవుతున్నామన్న భావనతో ఉండటం దేశ భవిష్యత్తుకు శుభసూచకం కాదు. అందుకే, ఈ పునర్విభజన ప్రక్రియలో రాజకీయ లబ్ధిని వెతుక్కోవడం మానేసి, రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించే ఏకాభిప్రాయ సాధన దిశగా అడుగులు వేయడం అన్ని పార్టీల తక్షణ కర్తవ్యం.
రాజకీయ పార్టీలు విభజన రాజకీయాల కోసం వాడుకోవడం ప్రమాదం!
కేంద్ర ప్రభుత్వం కూడా కేవలం సంఖ్యాబలంతో పనులను కానివ్వకుండా, దక్షిణాది రాష్ట్రాల గొంతుకను గౌరవించేలా ఒక న్యాయబద్ధమైన ఫార్ములా ముందుకు తీసుకురావాలి. రాజకీయ పంతాల కోసం దక్షిణాది-ఉత్తరాది మధ్య విద్వేష బీజాలు నాటడం వల్ల కలిగే నష్టం ఎవరూ పూడ్చలేనిది. విభిన్న భాషలు, సంస్కృతులు ఉన్న ఈ దేశంలో ఏకత్వమే మన బలం. ఆ ఏకత్వాన్ని పునర్విభజన రూపంలో విచ్ఛిన్నం చేయకూడదన్న స్పృహతో పాలకులు వ్యవహరించాల్సి ఉంది. 2026 తర్వాత జరిగే ఈ ప్రక్రియ దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చడమే కాకుండా, భారత సమగ్రతకు ఒక పరీక్షగా నిలవబోతోంది. ఈ పరీక్షలో నెగ్గాలంటే రాజకీయ పార్టీలు ప్రాంతీయ సంకుచిత భావాలను విడనాడి, దేశాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారానికి రావాలి. అధికారం ఎవరిదైనా కావచ్చు, కానీ భారతదేశం అందరిది అన్న భావన ప్రతి రాష్ట్రానికి కలగాలి. అప్పుడే ఈ డీలిమిటేషన్ దేశాన్ని విభజించే అంశంగా కాకుండా, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే సాధనంగా నిలుస్తుంది.
