తమిళనాడులో భారీ ఓటింగ్ రాజకీయవర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళి ప్రస్తుతం దేశవ్యాప్త చర్చకు దారితీసింది. 85 శాతానికి పైగా నమోదైన రికార్డు స్థాయి ఓటింగ్, దశాబ్దాల ద్రవిడ రాజకీయాల్లో పెను మార్పును సూచిస్తోంది. ఈ భారీ ఓటింగ్ అధికార డీఎంకే పట్ల వ్యతిరేకతనా లేక కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ పట్ల ఆకర్షణనా అన్నది అంచనా వేయడం కష్టంగా మారింది.
విజయ్ మేజిక్ పనిచేసిందా?
మీడియా , సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా విజయ్ ఫ్యాక్టర్ గురించే చర్చ జరుగుతోంది. మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ పాత నేతలకు భిన్నంగా యువతను, మహిళలను పెద్ద ఎత్తున ప్రభావితం చేశారని స్పష్టమవుతోంది. ముఖ్యంగా 18 నుంచి 30 ఏళ్ల లోపు యువత ఓటింగ్ కేంద్రాలకు పోటెత్తడం విజయ్ వైపు ఉన్న సానుకూలతకు నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. TVK సోషల్ మీడియా విభాగం ప్రచారం చేస్తున్నట్లుగా, యువత ఏకపక్షంగా విజయ్ వైపు మొగ్గు చూపి ఉంటే, అది సంప్రదాయ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేల పునాదులను కదిలించడం ఖాయం.
యువత, మహిళలే కీలకం
తమిళనాడు ఎన్నికల చరిత్రలో మహిళా ఓటర్లు ఎప్పుడూ ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. గతంలో ఎంజీఆర్, జయలలితలను ఆదరించిన మహిళా లోకం, ఈసారి మార్పును కోరుకుంటోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు విజయ్‌కు ఉన్న భారీ ఫ్యాన్ బేస్ ఓట్లుగా మారిందని, మొదట అంచనా వేసిన 15 శాతం ఓట్ల వాటా కంటే ఇది ఎక్కువే ఉండవచ్చని రాజకీయ పండితులు లెక్కిస్తున్నారు. గ్రామాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో విజయ్ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోందని గ్రౌండ్ రిపోర్టులు చెబుతున్నాయి.
మార్పు కోసమే ఈ భారీ ఓటింగ్?
సాధారణంగా ఓటింగ్ శాతం భారీగా పెరిగినప్పుడు అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని భావిస్తారు. ధరల పెరుగుదల, స్థానిక సమస్యలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి వారిని పోలింగ్ కేంద్రాల వైపు నడిపించి ఉండవచ్చని ఒక వాదన. అయితే, డీఎంకే మాత్రం ఇది తమ సంక్షేమ పథకాలకు లభించిన అనుకూల ఓటు అని ధీమా వ్యక్తం చేస్తోంది. కానీ, ఈసారి ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొనడం వల్ల, గతంలో చీలిపోయిన ఓట్లు ఇప్పుడు ఒక నిర్దిష్టమైన దిశలో పడ్డాయా అన్నది ఆసక్తికరంగా మారింది. కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన ద్రవిడ పార్టీల అభ్యర్థుల కంటే విజయ్ పార్టీ అభ్యర్థులకే ఎక్కువ ఆదరణ లభించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కావేరీ డెల్టా , దక్షిణ జిల్లాల్లో ఓటర్ల ఉత్సాహం చూస్తుంటే, పాత నేతలకు పట్టం కట్టే సంప్రదాయానికి కాలం చెల్లిందన్న సంకేతాలు అందుతున్నాయి.
మొత్తానికి, తమిళనాడులో నమోదైన ఈ చారిత్రాత్మక పోలింగ్ శాతం అటు డీఎంకే-అన్నాడీఎంకే కూటములను ఆందోళనలో పడేయగా, టీవీకే శ్రేణుల్లో మాత్రం ఆశలు రేకెత్తిస్తోంది. యువత, మహిళల మద్దతు ఎవరికి ఉందో తెలిసేందుకు మే 4 వరకు నిరీక్షించక తప్పదు.


