వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న 24.84 ఎకరాల అసైన్డ్ భూములపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పల్నాడు జిల్లా కలెక్టర్ నివేదిక ఆధారంగా స్థానిక తహసీల్దార్ రద్దు ఉత్తర్వులు జారీ చేశారు. మాచవరం మండలం వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 4.84 ఎకరాలకు సంబంధించిన దస్తావేజులను అధికారులు తక్షణమే రద్దు చేశారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పల్నాడు ప్రాంతంలో ఈ పరిశ్రమ స్థాపన కోసం భారీగా భూములను సేకరించి కేటాయించారు. అయితే, పరిశ్రమ ఏర్పాటు కాకపోయినప్పటికీ.. 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూముల లీజు కాలపరిమితిని ఏకంగా 50 ఏళ్లకు పొడిగిస్తూ వివాదాస్పద జీఓ విడుదల చేశారు. పరిశ్రమ నిర్మించకుండా, స్థానిక యువతకు ఉపాధి కల్పించకుండా కేవలం విలువైన సున్నపురాయి నిల్వలున్న భూములను లీజుల పేరుతో తమ ఆధీనంలో ఉంచుకున్నారు.
రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా పల్నాడు జిల్లాలోని సరస్వతి పవర్ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమగ్ర విచారణకు ఆదేశించారు. దళిత రైతులకు చెందిన అసైన్డ్ భూములను బెదిరించి, బలవంతంగా లాక్కున్నారనే ఫిర్యాదులపై స్పందించిన ఆయన, రీ-సర్వే నిర్వహించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ దర్యాప్తులో 24.84 ఎకరాల భూమి నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ అయినట్లు తేలడంతో ప్రభుత్వం ఈ కఠిన చర్యలు తీసుకుంది. డి
ఈ పరిశ్రమ కోసం దాదాపు 400 ఎకరాల అటవీ భూమిని కూడా నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ భూమిగా మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అటవీ , పర్యావరణ శాఖల ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ విచారణ నివేదిక కూడా వస్తే సరస్వతి పవర్ సంస్థకు మరిన్ని షాక్‌లు తప్పవని తెలుస్తోంది. ఫ్యాక్టరీ లేకపోయినా కృష్ణా నది నుంచి 196 కోట్ల లీటర్ల నీటిని కేటాయించడంపై కూడా కూటమి ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోంది.
