ట్రంప్ ప్రపంచదేశాలపై విధించిన టారిఫ్లు చెల్లవని అమెరికా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో చెల్లవని తీర్పు చెప్పింది. తొమ్మిది మంది న్యాయమూర్తుల్లో ఆరుగురు చెల్లవని.. ముగ్గురు చెల్లుతాయని తీర్పు చెప్పారు. మెజార్టీ ప్రకారం ట్రంప్ టారిఫ్లు చట్ట విరుద్ధమని తేలిపోయాయి. ఇప్పటి వరకూ వసూలు చేసిన అదనపు టారిఫ్లను ప్రజలకు ట్రంప్ సర్కార్ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
టారిఫ్లు వేసేందుకు తొందరపడిన ట్రంప్.. 1977 నాటి అత్యవసర చట్టాన్ని వాడారు. ఇది ఆంక్షలు , విదేశీ ఆస్తుల స్తంభన వంటి చర్యలకే పరిమితమని దీనిని అడ్డుపెట్టుకుని అన్ని దేశాల వస్తువులపై పన్నులు వేయడం చెల్లదని న్యాయమూర్తులు తెలిపారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం టారిఫ్స్ విధించే అధికారం పార్లమెంటు మాత్రమే ఉంటుంది. ఆ అధికారాన్ని అధ్యక్షుడు తన చేతుల్లోకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది.
ట్రంప్ విధించిన ఈ పన్నుల వల్ల అమెరికాలోని వ్యాపార సంస్థలు, వినియోగదారులపై దాదాపు 200 బిలియన్ డాలర్ల అదనపు భారం పడింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పటివరకు వసూలు చేసిన పన్నులను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ట్రంప్ విధించిన టారిఫ్లు దేశాల మీద కాదు. ఆయా దేశాల నుంచి వచ్చే దిగుమతుల మీదనే. అంటే.. ఆ వస్తువులు కొనుగోలు చేసే అమెరికన్లే వాటిని కట్టారు.
