‘డెకాయిట్’ సినిమాని అంతా తానై మోశాడు అడవి శేష్. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించింది ఆయనే. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కూడా దగ్గరుండి చూసుకొన్నాడు. దర్శకత్వ బాధ్యత షానియల్ చూసుకొన్నారు. అయితే సెట్లో ఇద్దరు దర్శకులు ఉండేవారని, షానియల్ తో పాటుగా శేష్ కూడా డైరెక్టర్ గా పని చేశాడన్న గుసగుసలు గట్టిగా వినిపించాయి. షాడో డైరెక్టర్ గా శేష్ ఈ సినిమాపై బలమైన ముద్ర వేశాడని, చివరి వరకూ తన మాటే చెల్లుబాటు అయ్యిందని చెప్పుకొన్నారు. ఈ విషయమై తెలుగు360 ఇంటర్వ్యూలో మనసు విప్పాడు శేష్.
ఈ సినిమాకు ఇద్దరు దర్శకులన్నది నిజమేనా అంటే.. దానిపై క్లారిటీ ఇచ్చాడు. ”ఇలాంటి అపార్థాలు రావడానికి కారణం నేనే. ఎందుకంటే షానియల్ కి తెలుగు రాదు. కాబట్టి సెట్లో.. నేను నటీనటులకు తెలుగులో సీన్ వివరించేవాడ్ని. అది చూసి అందరూ నన్ను దర్శకుడు అనుకొన్నారేమో. సినిమా అనేది నా బిడ్డలా భావిస్తా. అందుకే ప్రతీ విషయాన్నీ అపురూపంగా చూస్తుంటా. సినిమా థియేటర్లోంచి వెళ్లిపోయేంత వరకూ ఏదోలా ప్రమోట్ చేసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే ఇంకా ఇంకా కష్టపడుతున్నా” అని చెప్పుకొచ్చారు.
‘డెకాయిట్’ తరవాత ‘గూఢచారి 2’ పై దృష్టి పెట్టారు శేష్. ప్రస్తుతానికి 50 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ‘డెకాయిట్’ తరవాత నెల రోజుల గ్యాప్ తీసుకొని, మళ్లీ ‘గూఢచారి 2’ షూటింగ్ లో పాల్గొంటారు.


