పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ రణరంగాన్ని తలపించింది. గురువారం 152 నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్లో ఓటర్లు అసాధారణ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. పోలింగ్ ముగిసే సమయానికి 89.93 శాతం పోలింగ్ నమోదు అయింది. క్యూలైన్లలో ఉన్న వారందరికీ అవకాశం కల్పిస్తే తుది శాతం 92-93 శాతానికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
బెంగాల్ ఎన్నికల సంప్రదాయం ప్రకారం ఈసారి కూడా హింసాత్మక ఘటనలు నీడలా వెన్నాడాయి. దక్షిణ దినాజ్పూర్ జిల్లా కుమార్గంజ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువేందు సర్కార్ పై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఆయన్ను పొలాల వెంట తరిమి కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే, పలుచోట్ల అభ్యర్థుల కార్లను ధ్వంసం చేయడం, పోలింగ్ ఏజెంట్లను బయటకు పంపడం, రాళ్లు రువ్వుకోవడం వంటి ఘటనలతో బెంగాల్ వీధులు యుద్ధభూమిని తలపించాయి.
గత ఎన్నికల గణాంకాలతో పోలిస్తే ఈ సారి పోలింగ్ సరళి భిన్నంగా కనిపిస్తోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల తొలి విడతలో దాదాపు 80 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈసారి అది 90 శాతం మార్కును దాటింది. ఓటర్ల జాబితా నుండి బోగస్ , అనవసరమైన ఓట్లను తొలగించడం వల్ల, వాస్తవ ఓటర్ల భాగస్వామ్యం పెరిగి పర్సంటేజీ గణనీయంగా పెరిగిందని భావిస్తున్నారు. ఈ పెరిగిన ఓటింగ్ శాతం అధికార టీఎంసీకి అనుకూలమా , బీజేపీ మార్పుకు సంకేతమా అన్నది మే 4న వెలువడే ఫలితాల్లో తేలనుంది.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాలుగోసారి అధికారాన్ని ఆశించగా, బీజేపీ ఈసారి ఎలాగైనా బెంగాల్ పీఠాన్ని దక్కించుకోవాలని సర్వశక్తులూ ఒడ్డుతోంది. మరోవైపు లెఫ్ట్ ఫ్రంట్ కూడా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలోని మొత్తం 294 స్థానాలకు గాను మిగిలిన 142 స్థానాలకు ఏప్రిల్ 29న రెండో విడతలో పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 4వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది.
