తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు అద్భుతమైన చైతన్యాన్ని ప్రదర్శించారు. గురువారం జరిగిన పోలింగ్లో ఓటర్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పోలింగ్ సమయం ముగిసేటప్పటికి ఇది 83 శాతానికి చేరుకుంది. క్యూలైన్లలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి తుది పోలింగ్ శాతం 85 శాతాన్ని దాటే అవకాశం ఉంది. తమిళనాడు ఎన్నికల చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డుగా నిలవనుంది.
ఈ భారీ పోలింగ్ శాతానికి ప్రధాన కారణం ఓటర్ల జాబితా ప్రక్షాళన అనుకోవచ్చు. ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అనవసరమైన, బోగస్ ఓట్లను తొలగించారు. జాబితాలో చనిపోయిన వారు, ఇల్లు మారిన వారి ఓట్లను తొలగించి ఓటర్ల జాబితాను క్లీన్ చేయడం వల్ల, ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగిందని భావిస్తున్నారు. ఈ సారి మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 5.73 కోట్లుగా ఉంది.
అదే సమయంలో ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొనడం కూడా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించింది. అధికార డీఎంకే కూటమి, ప్రతిపక్ష అన్నాడీఎంకే-బీజేపీ కూటమితో పాటు, తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం యువతలో భారీ ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా యువ ఓటర్లు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నమక్కల్, కరూర్ వంటి జిల్లాల్లో అత్యధికంగా 76 శాతానికి పైగా పోలింగ్ మధ్యాహ్నానికే నమోదు అయింది.
రికార్డు స్థాయి పోలింగ్ నమోదు కావడం ఏ పార్టీకి లాభిస్తుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. సాధారణంగా భారీ పోలింగ్ ప్రభుత్వంపై వ్యతిరేకతను సూచిస్తుందని కొందరు అంటుండగా, ఓటర్ల జాబితా ప్రక్షాళన వల్లే ఈ మార్పు కనిపిస్తోందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు మే 4, 2026 న వెలువడనున్నాయి.
