వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం హిందూ సంప్రదాయాలను, ఆలయ మర్యాదలను పావుగా వాడుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆయన అర్చకులకు గండం తెచ్చి పెడుతున్నారు. పులివెందుల పర్యటనలో ఉన్న జగన్ను ఆశీర్వదించేందుకు ఒంటిమిట్ట కోదండరామాలయ అర్చకులు ఆయన నివాసానికి వెళ్లడం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. జగన్ అనుచరుల ఒత్తిడి మేరకు అర్చకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు.
ఒంటి మిట్ట ఎంతో దూరం ఉండదు. పది నిమిషాల్లో వెళ్లవచ్చు. అయినా జగన్ పూజారుల్ని పిలిపించుకున్నారు. ఆలయానికి సంబంధించిన అత్యంత పవిత్రమైన శేష వస్త్రాలు, రాములోరి తోమాల సేవ వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను కూడా తీసుకురావాలని ఒత్తిడి తెచ్చారు.
ప్రభుత్వం తరపున అధికారికంగా వెళ్లే వారికి లేదా అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులకు మాత్రమే ప్రోటోకాల్ ప్రకారం అందజేస్తారు. కానీ, ఎలాంటి పదవిలో లేని జగన్ కోసం అర్చకులు వీటిని నేరుగా ఆయన ఇంటికే తీసుకువెళ్లి అందజేశారు.
దీనికి సంబంధించిన వీడియోలను వైసీపీ సోషల్ మీడియా విభాగం వైరల్ చేస్తూ, జగన్ హిందూ ధర్మ పరిరక్షకుడన్నట్లుగా చిత్రించే ప్రయత్నం చేసింది. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో టీటీడీ రంగంలోకి దిగింది. నిబంధనలను అతిక్రమించి పవిత్ర వస్తువులను బయటకు తీసుకువెళ్లి, ఒక వ్యక్తి నివాసంలో ఆశీర్వచనాలు అందజేసినందుకు గాను సంబంధిత అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఆలయ గౌరవానికి భంగం కలిగించారనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.
జగన్ స్వార్థ రాజకీయాల కోసం అమాయక అర్చకులు ఇప్పుడు క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. నిజంగా భక్తి ఉంటే జగన్ నేరుగా ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవాల్సిందని, అలా కాకుండా అర్చకులను తన ఇంటికి పిలిపించుకోవడం ఆయన అహంకారానికి నిదర్శనమన్న విమర్శలు వస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడిని, అర్చకులను వాడుకోవడం మానుకోవాలని హిందూ సంఘాలు హితవు పలుకుతున్నాయి.
