వైసీపీ నేతలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా, చివరకు తమకు అడ్డువస్తున్న సొంత మనుషులను కూడా భూమిపై లేకుండా చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అనకాపల్లిలో రెన్యూపవర్ సంస్థకు శంకుస్థాపన చేసిన తర్వాత బహిరంగసభలో మాట్లాడారు. గతంలో సొంత బాబాయ్‌నే చంపిన వ్యక్తులు, ఇప్పుడు తమ స్వప్రయోజనాల కోసం సొంత పార్టీ నేతలను సైతం వదలడం లేదని విమర్శించారు.
ఇటీవల కడపలో జరిగిన పెద్ద దస్తగిరి హత్యను ప్రస్తావిస్తూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు ముందుగా హత్యలు చేసి, ఆ తర్వాత తామే బాధితులను పరామర్శించి, ఆ నేరాలను ఇతరులపై నెట్టేయడంలో ఆరితేరిపోయారని ధ్వజమెత్తారు. ఇలాంటి నేరపూరిత మనస్తత్వం ఉన్న వ్యక్తులతో రాజకీయాలు చేయాల్సి రావడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరు నిందితులు హత్యలు చేయడమే కాకుండా, మృతదేహాలను డోర్ డెలివరీ చేసే స్థాయికి దిగజారారని, సాక్షులను కూడా బెదిరిస్తూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే, ఇప్పుడు కాలం మారిందని, కూటమి ప్రభుత్వంలో నేరస్తులను ఉపేక్షించే ప్రసక్తే లేదని చంద్రబాబు హెచ్చరించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని, కచ్చితంగా వారిని చట్టం ముందు దోషులుగా నిలబెడతామని వార్నింగ్ ఇచ్చారు. అరాచక రాజకీయాలకు స్వస్తి పలికి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు పారిశ్రామికీకరణ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే, మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో రాజీ పడబోమని ముఖ్యమంత్రి ప్రజలకు హామీ ఇచ్చారు.
