ఏపీ ప్రభుత్వం మరో సంచలనాత్మక పథకాన్ని ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స అందించేలా యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్సలు అందేలా ఈ కొత్త విధానం పని చేస్తుంది. 2,493 నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు అందుతాయి . 3,257 చికిత్సలను ఉచితంగా అందిస్తారు . ఆదాయంతో పని లేకుండా రాష్ట్రంలో ఉన్న పౌరులు అందరూ దీనికి అర్హులేనని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రాష్ట్ర ప్రజలు ఆరోగ్య సమస్యలతో బాధపడకుండా, ఆర్థిక భారం లేకుండా చికిత్స పొందగలరని ప్రభుత్వం భావిస్తోంది. ఆయుష్మాన్ భారత్ – ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద అమలవుతుంది. ఇందులో ఎన్టీఆర్ వైద్య సేవలతో పాటు అన్ని రకాల వైద్య చికిత్సలు కవర్ అవుతాయి. ప్రస్తుత ఎన్టీఆర్ వైద్య సేవల కవరేజ్‌ను రూ.5 లక్షలు మాత్రమే ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందవచ్చు.
ఈ పాలసీ త్వరలోనే అమలులోకి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆయుష్మాన్ భారత్ పథకంతో సమన్వయం చేసి, డిజిటల్ కార్డులు జారీ చేస్తుంది. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో హెల్త్‌కేర్ వ్యవస్థను గ్లోబల్ స్టాండర్డ్‌లకు చేర్చడానికి ఒక అడుగుగా భావిస్తున్నారు. గతంలో చంద్రన్న బీమా పథకం కూడా అద్భుతంగా ప్రజలకు ఉపయోగపడింది. ఇప్పుడు ఆరోగ్య రంగంలో అదే స్థాయిలో అందరికీ వర్తించే పథకం కావడంతో సమన్వయంతో విజయవంతం చేస్తే.. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది.

