పెట్రోల్, డిజిల్‌పై వ్యాట్ తగ్గించాలని ప్రతిపక్షాలు, ప్రజలు డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం అనూహ్యంగా మద్యంపై వ్యాట్‌ను భారీగా తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మందు బాబులు పండగ చేసుకుంటారని అనుకున్నారు. కానీ వ్యాట్ తగ్గింది కానీ రేట్లు తగ్గే ప్రశ్నే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో అసలు మతలబేమిటబ్బా అని ఆశ్చర్యపోయిన జనానికి తీరిగ్గా అసలు విషయం తెలిసేలా చేసింది. ఎందుకంటే వ్యాట్ తగ్గించి.. మార్జిన్ పెంచింది. ఫలితంగా రేటు అలాగే ఉంటుంది. కానీ ఆదాయం మాత్రం ప్రభుత్వం నుంచి కార్పొరేషన్‌కు వెళ్తుంది.
ఇప్పుడు ప్రస్తుతం ఒక్కో రకం మద్యం పై వ్యాట్ 80 నుంచి 150 శాతంవ్యాట్ అమలు చేస్తున్నారు. అంటే పది రూపాయల మద్యం అనుకుంటే దానికి పాతిక రూపాయల ట్యాక్స్ అన్నమాట. ఒక్క వ్యాట్ మాత్రమే కాదు అనేక రకాల పన్నులతో రూ. 20 మద్యాన్ని రూ. 200కు అమ్ముతున్నారు.. అది వేరే విషయం. ఇప్పుడు ఈ వ్యాట్‌ను తగ్గించి.. మార్జిన్ అనే మరో పద్దతికి ఆదాయాన్ని మళ్లించింది. ప్రభుత్వ మద్యం వ్యాపారం అంతా .. బేవరేజెస్ కార్పొరేషన్ చేస్తుంది. ఈ బేవరేజెస్ కార్పొరేషన్‌కు మార్జిన్ కింద రూ. ఆరు వేల కోట్లు మళ్లిస్తోంది. ఎందుకంటే.. అప్పులకు తనఖా పెట్టడానికి. ఇప్పటికే తీసుకున్న అప్పు.. తీసుకోవాలనుకుంటున్న మరో రూ. పాతిక వేల కోట్ల అప్పునకు తనఖా పెట్టడానికి.
అప్పుల కింద ఏపీ ప్రభుత్వం చేస్తున్న తిప్పలు.. పడుతున్న కష్టాలు.. లెక్కల్లో గందరగోళం చేసి ఎలాగోలా బండి నపిడించాలన్న ప్రయత్నం..ప్రతీ చోటా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్న వైనం చూసి ఉన్నతాధికారులే ఆశ్చర్యపోతున్నారు. రేపు తమ నెత్తిపై ఎక్కడ పడుతుందోనని ఆందోలన చెందుతున్నారు. కానీ ప్రభుత్వం దివాలా తీయకుండా ఉండాలంటే ఏదో ఒకటిచేయక తప్పని పరిస్థితి. అందుకే అటూ ఇటూ మారుస్తూ ఏదో ఒకటి చేస్తున్నారు. అయితే ఒక్కొక్క శాఖ డిఫాల్ట్ అయిపోతున్న సమయంలో ఇప్పుడు ఇలా ఎన్ని మాయలు చేసినా ప్రభుత్వానికి బ్యాంకులు అప్పులు ఇస్తాయా అన్నది ఓ సందేహంగా ఉంది.
అయితే ప్రభుత్వం అప్పులు తీసుకునేందుకు కమిషన్లు ఇచ్చి మరీ కన్సల్టెన్సీని పెట్టుకుంది. వారే అప్పులు తెచ్చి ఇస్తారని వారి సలహాలతోనే ఇదంతా చేస్తున్నారన్న అనుమానం కూడా ఉంది. అంటే అప్పులు ఇస్తారన్న నమ్మకంతోనే ఇలా చేస్తున్నారని .. ఈ సలహాలకు మళ్లీ వేరే బిల్లు ఉంటుందనేది ఎక్కువ మందికి తెలియని నిజం.