సరిహద్దుల్లో దేశం కోసం ప్రాణం అర్పించిన అనంతపురం అమరజవాన్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. అమరవీరుడు మురళీనాయక్ అంత్యక్రియలకు ప్రభుత్వం నుంచి నారా లోకేష్, పవన్ కల్యాణ్ హాజరయ్యారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వం తరపున యాభై లక్షల రూపాయల ఆర్థిక సాయంతో పాటు ఐదు ఎకరాల భూమి, మూడు వందల గజాల ఇంటి స్థలం ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వ్యక్తిగత ఆదాయం నుంచి మరో పాతిక లక్షల రూపాయల సాయం ప్రకటించారు. ఇదంతా సైన్యం తరపున వారి కుటుంబానికి వచ్చేదానికంటే అదనం. అదే సమయంలో మురళీనాయక్ తండ్రికి ప్రభుత్వం తరపున ఉద్యోగం కల్పించేందుకు హామీ ఇచ్చారు.
నిరుపేద కుటుంబానికి చెందిన మురళీనాయక్ ఎంతో కష్టపడి ఇష్టంతో సైన్యంలో చేరాడు. అయితే పాతికేళ్లు నిండకుండానే దేశం కోసం ప్రాణ త్యాగం చేయాల్సి వచ్చింది. ఇది దేశ ప్రజలందర్నీ విషాదానికి గురి చేసింది. ఎంతో భవిష్యత్ ఉన్న యువకుడు ఇలా పాకిస్తాన్ దుశ్చర్యలకు బలి కావడం విషాదాన్ని నింపింది. ఆ కుటుంబానికి అండగా ప్రజలు, ప్రభుత్వం ఉన్నారు.