ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో ఒక ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా అవతరిస్తోంది. మంత్రి నారా లోకేష్ తాజాగా సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశారు. సాయంత్రం ఆరు గంటలకు అత్యంత కీలకమైన ప్రకటన చేయబోతున్నట్లుగా తెలిపారు. అది భారీ పెట్టుబడికి సంబంధించినది అని ట్వీట్ లో క్లారిటీ ఇచ్చారు. లోకేష్ చేయబోయే ప్రకటనలో మరిన్ని దేశీ-విదేశీ కంపెనీల భాగస్వామ్యం, కొత్త ఎంఓయూలు, బోయే ఐదేళ్లలో ఏపీని ఇంధన ఎగుమతిదారుగా ఎలా మార్చబోతున్నారనే దానిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గ్రీన్ ఎనర్జీకి సౌదీ అరేబియాగా మారేలా అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రధాన కేంద్రం కాకినాడ. ఇక్కడి నుంచి గ్రీన్ అమ్మోనియా , గ్రీన్ హైడ్రోజన్‌ను జర్మనీ, సింగపూర్, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతి చేయడమే లక్ష్యంగా పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. AM గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ గతంలో నాగార్జున ఫర్టిలైజర్స్ ఉన్న ప్లాంట్‌ను AM గ్రీన్ గ్రూప్ కొనుగోలు చేసి, దానిని ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా తయారీ యూనిట్లలో ఒకటిగా తీర్చిదిద్దింది.
జనవరి 17 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ భారీ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించనున్నారు. నారా లోకేష్ ట్వీట్ చేసిన దాని ప్రకారం, ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు ద్వారా దాదాపు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ఈ పెట్టుబడి ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 8,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 030 నాటికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు, ఇది భారతదేశ జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో 20 శాతం వాటాను కలిగి ఉంటుంది.
గత ప్రభుత్వ హయాంలో గ్రీన్ ఎనర్జీ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగించి, పారిశ్రామిక వేత్తల్లో నమ్మకాన్ని కలిగించడంలో లోకేష్ సఫలమయ్యారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ద్వారా టాటా పవర్, ఎన్టీపీసీ, రెన్యూ పవర్ వంటి దిగ్గజ కంపెనీలను ఏపీకి రప్పించారు. గ్రీన్ అమ్మోనియా రవాణా కోసం జర్మనీకి చెందిన యునిపర్ వంటి అంతర్జాతీయ సంస్థలతో ఇప్పటికే ఒప్పందాలు పూర్తయ్యాయి.


