ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు ఇప్పుడు అత్యంత కీలకమైన మలుపు తిరిగింది. సిట్ అధికారులు ఈ కేసులో ఒక్కో చిక్కుముడిని విప్పుతూ, అక్రమంగా జరిగిన వేల కోట్ల రూపాయల లావాదేవీల వెనుక ఉన్న అసలు కింగ్ పిన్ లను లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా ఈ కేసులో A7 గా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి , A1 కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన సంస్థల నుంచి నిధులు ఎలా మళ్లాయనే అంశంపై సిట్ పక్కా ఆధారాలు సేకరించింది.
మనీ లాండరింగ్ చేసిన వ్యక్తి ఇప్పటికే అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవినీతిపై దర్యాప్తు వేగవంతం చేసిన అధికారులకు ముంబైకి చెందిన వ్యాపారి అనిల్ చోఖారా అరెస్ట్‌తో భారీ బ్రేక్ త్రూ లభించింది. సుమారు 35 షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి, కేవలం కాగితాల మీద మాత్రమే లావాదేవీలు జరుపుతూ రూ. 77.55 కోట్ల ముడుపులను మళ్లించడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు తేలింది. అదాన్, లీలా డిస్టిలరీస్ వంటి సంస్థల నుంచి ఈ నిధులు షెల్ కంపెనీల ద్వారా తిరిగి లిక్కర్ సిండికేట్ లోని కీలక వ్యక్తులకు చేరాయని దర్యాప్తు సంస్థలు కోర్టుకు వెల్లడించాయి.
అంతిమ లబ్ధిదారు ఎవరో తేలే సమయం
ఈ కేసులో ఇప్పటికే APSBCL మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి అరెస్ట్ కావడం, ఆయన రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు వెలుగు చూడటం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని సంస్థలకే టెండర్లు కట్టబెట్టడం, కొత్త బ్రాండ్లకు అడ్డగోలుగా అనుమతులు ఇవ్వడం వెనుక ఉన్న పెద్దల ఆదేశాలను అధికారులు గుర్తించారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన నగదును వైట్ మనీగా మార్చి, చివరకు అది ఏ ఏ రాజకీయ నేతల ఖాతాల్లోకి వెళ్లిందనే అంశంపై ఈడీ , సీఐడీ పక్కా నెట్వర్క్ చార్ట్‌ను సిద్ధం చేశాయి.
డాట్స్ అన్నీ కలిపేసిన దర్యాప్తు సంస్థలు
సిట్ సేకరించిన సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా రికార్డులు, నిందితుల వాంగ్మూలాల ద్వారా అక్రమ నిధుల ప్రయాణాన్ని అధికారులు స్పష్టంగా గుర్తించారు. మాజీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక అధికారిగా ఉన్న ధనుంజయ్ రెడ్డి, ఇతర సన్నిహితులైన కృష్ణ మోహన్ రెడ్డి వంటి వారిపై సుప్రీంకోర్టు సైతం కఠిన వైఖరి అవలంబించడం గమనార్హం. విచారణ ప్రక్రియలో ఉన్న డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ ఆధారంగా ఈ స్కామ్ ద్వారా పొందిన అంతిమ లాభం ఎవరికి చేరిందనే దానిపై ఇప్పుడు స్పష్టత వచ్చింది.
శ్రీకృష్ణ జన్మస్థానానికేనా?
ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 3,200 కోట్ల నుంచి రూ. 3,500 కోట్ల మేర గండి కొట్టిన ఈ కుంభకోణంలో లబ్ధి పొందిన అంతిమ లబ్ధిదారు ను చట్టం ముందు నిలబెట్టడమే తదుపరి అడుగు. రాజకీయ పలుకుబడితో తప్పించుకోవాలని చూస్తున్న వారికి, సిట్ సేకరించిన నిధుల మళ్లింపు ఆధారాలు సంకెళ్లుగా మారబోతున్నాయని చెబుతున్నారు.