ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇప్పుడే కాదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మార్చి లోపు ఎన్నికలు పూర్తి చేస్తామని ప్రభుత్వం గతంలో హడావుడి చేసినప్పటికీ, క్షేత్రస్థాయి పరిస్థితులు, పరిపాలనాపరమైన కారణాల దృష్ట్యా వెనుకడుగు వేసినట్లు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలల కాల పరిమితితో లేదా కొత్త ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యే వరకు ఈ స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగనుంది.
ఈ ఏడాదే..కానీ ఎప్పుడు ?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల అనంతపురం నేతలతో ఈ ఏడాదే స్థానిక ఎన్నికలు ఉంటాయని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. దీనిని బట్టి చూస్తే ప్రభుత్వం ఎన్నికలకు దూరం జరగడం లేదని, కేవలం వ్యూహాత్మక సమయం కోసం వేచి చూస్తోందని అర్థమవుతోంది. ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే వేగవంతం చేసింది. మార్చి నెలాఖరుకు తుది జాబితా సిద్ధం కానున్నాయి. ఏప్రిల్ లేదా మే నెలల్లో వచ్చే వేసవి సెలవులను ఎన్నికల నిర్వహణకు అనువైన సమయంగా ప్రభుత్వం భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ముగియనున్న నీలం సాహ్ని పదవీ కాలం
వైసీపీ హయాంలో ఎస్ఈసీగా నియమితులైన నీలం సాహ్ని పదవీ కాలం ముగియనుంది. దీంతో ప్రభుత్వం కొత్త ఎస్ఈసీని నియమించనున్నారు. ఇప్పటికే ముగ్గురు పేర్లతో గవర్నర్ కు పంపారని చెబుతున్నాయి. నీలం సహాని పదవిలో ఉన్నా స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం దొరకలేదు. నిమ్మగడ్డ ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహించారు. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత నీలం సహాని బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు గడువులోగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో.. ఆమె పదవి కాలం పూర్తయ్య.. కొత్త కమిషనర్ నేతృత్వంలో ఎన్నికలు జరగనున్నాయి.
మున్సిపల్, పంచాయతీ, పరిషత్ ఎన్నికలన్నీ వరుసగా !
పంచాయతీలు, పరిషత్‌ల కాలపరిమితీ కూడా త్వరలో ముగియనుంది. అన్నింటికీ ఒకే సారి వరుసగా ఎన్నికలు నిర్వహించే అవకాశంఉంది. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేసుకోవడానికి, ముఖ్యంగా కొత్తగా చేరిన నేతలకు ప్రాధాన్యత కల్పించడానికి తెలుగుదేశం, జనసేన పార్టీలకు ఈ ఆరు నెలల సమయం కీలకంగా మారనుంది. వేసవిలోపు ఎన్నికలు ముగిస్తే, రాబోయే ఖరీఫ్ సీజన్ నాటికి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కొత్త పాలకవర్గాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
