ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైంది. రాష్ట్రం నుంచి ఖాళీ కాబోతున్న నాలుగు స్థానాల కోసం అధికార కూటమి మధ్య ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అసెంబ్లీలో కూటమికి ఉన్న తిరుగులేని బలాన్ని బట్టి, ఈ నాలుగు స్థానాలు ఏకగ్రీవంగా కూటమి ఖాతాలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఈ సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీల మధ్య కనిపించని పోటీ ప్రారంభమయింది.
టీడీపీలో బోలెడంత మంది సీనియర్ల ప్రయత్నాలు
తెలుగుదేశం పార్టీలో ఆశావహుల జాబితా చాంతాడంత ఉంది. సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, పార్టీ విధేయుడు వర్ల రామయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న గల్లా జయదేవ్, దేవినేని ఉమ, పార్టీ కోసం పనిచేస్తున్న చింతకాయల విజయ్ కుమార్ వంటి నాయకులు కూడా ఈ రేసులో ఉన్నారు. సామాజిక సమీకరణలు, పార్టీ పట్ల విధేయతను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
రాజ్యసభలో చోటు కోసం జనసేన ఒత్తిడి
మరోవైపు, జనసేన పార్టీ తన తొలి రాజ్యసభ బెర్త్ కోసం పట్టుబడుతోంది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్, ఈ సారి ఖచ్చితంగా ఒక స్థానాన్ని తన పార్టీకి కేటాయించాలని కోరుతున్నారు. జనసేన తరపున ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆయనకు పవన్‌తో ఉన్న సాన్నిహిత్యం, పార్టీకి ఆయన చేసిన సేవలు ఈ పదవికి ఆయన్ను రేసులో ముందుంచాయి. చంద్రబాబు కూడా ఆయన పేరు విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం లేదు. కానీ ఒక స్థానం జనసేనకు కేటాయిస్తారా లేకపోతే బీజేపీకా అన్నది తేలాల్సి ఉంది.
బీజేపీ పట్టుబట్టడం ఖాయం !
బీజేపీ కూడా జాతీయ స్థాయిలో తన బలాన్ని పెంచుకోవడానికి ఏపీ నుంచి ఒక స్థానాన్ని ఆశిస్తోంది. కేంద్ర పెద్దల నిర్ణయం మేరకు బీజేపీకి ఒక సీటు కేటాయిస్తే, ఆ స్థానానికి ఎవరిని పంపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పరిమళ్ నత్వానీ పదవీ కాలం పూర్తవుతోంది. ఆయన పేరును బీజేపీ ఖరారు చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. కూటమిలోని మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ, ఢిల్లీ స్థాయిలో జరిగే సంప్రదింపులే ఈ సమీకరణాలను ఖరారు చేయనున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో సరైన బలం లేకపోవడంతో ఏకగ్రీవం అవుతాయి..కానీ అంతకు ముందుగానే కూటమి పార్టీల మధ్య పోటీ జరుగుతోంది.
