కన్నడ, తమిళ ప్రముఖులపై ఐటీ ఎటాక్స్..! పన్నులు ఎగ్గొట్టేవాళ్లంతా ఏపీ, కర్ణాటక, తమిళనాడుల్లోనే ఉన్నారా..?

దేశంలో పన్నులు ఎగ్గొడుతోంది.. కేవలం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుకు చెందిన సినీతారలు, వ్యాపారులేనన్నట్లుగా ఉంది కేంద్ర ఐటీ శాఖ తీరు. మార్చి మార్చి… ఈ రాష్ట్రాల్లోనే సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ రోజు.. కర్ణాటక, తమిళనాడులో.. సోదాల పేరుతో వందల మంది ఆయా రాష్ట్రాల్లో బిలబిల మంటూ దిగిపోయారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి సహా… కన్నడ నటీనటుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దివంగత సూపర్ స్టార్ రాజ్ కుమార్ కుమారులు, సినీ నటులు పునీత్‌ రాజ్‌కుమార్‌, శివరాజ్‌కుమార్‌ ఇళ్లతో పాటు… నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌, నటుడు సుదీప్‌, కేజీఎఫ్‌ హీరో యశ్‌ ఇళ్లనూ టార్గెట్ చేశారు. మొత్తం 25 మంది సెలబ్రిటీలను టార్గెట్ చేసుకున్నారు. తమిళనాడులోనూ ఐటీ అధికారులు విరుచుకుపడ్డారు. శరవణ భవన్ పేరుతో హోటల్స్ నిర్వహిస్తున్న వ్యాపార సంస్థల్లో సోదాలు ప్రారంభించారు.

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయపు పన్ను శాఖ అధికారులందరూ… దక్షిణాదిలోని.. ఏపీ, కర్ణాటక, తమిళనాడులోనే పని చేస్తున్నారన్న ట్లుగా ఈ సోదాలు జరుగుతున్నాయి. జయలలిత మరణం తర్వాత.. ఈ ఐటీ దాడులతో.. తమిళనాడును హడలెత్తించారు. ఆ ప్రభావంతోనే.. అక్కడి ప్రభుత్వాన్ని తమ చెప్పుచేతుల్లోకి తీసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆ తర్వాత తమకు అవసరమైనప్పుడల్లా అక్కడ ఐటీ.. కావాల్సిన నేతలపై విరుచుకుపడుతోంది. దినకరన్ పై .. అనేక రకాల ఆరోపణలు చేసి.. ఆర్కేనగర్ ఉపఎన్నిక వాయిదా వేసేలా చేశారు. చివరికి అక్కడ ఉపఎన్నికల్లో ఆయనపై సానుభూతి పవనాలు వీచాయి. కర్ణాటకలోనూ.. ఇటీవలి కాలంలో.. ఐటీ దాడులు జరగడం.. పదో సారి కావొచ్చు. ఎన్నికల సమయం ఒక్క కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసుకునే చేసిన దాడులు అన్నీ ఇన్నీ కావు. ఆ తర్వాత కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ గా ఉన్న డీకే శివకుమార్ నూ టార్గెట్ చేసి రెండు మూడు సార్లు సోదాలు చేశారు.

ఇక ఏపీ సంగతి చెప్పనవసరం లేదు. ఇటీవలి కాలంలో.. కేవలం టీడీపీ నేతలను టార్గెట్ చేసుకుని చేసిన సోదాలు అన్నీ ఇన్నీ కావు. కనీసం.. అసెంబ్లీకి పోటీ కూడా చేయని నేతలను కూడా.. ఐటీ దాడులతో భయకంపితులను చేశారు. ఎంపీ సుజనా చౌదరి దగ్గర్నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చోటా నేతగా ఉన్న కోవెలమూడి రవీంద్ర అనే వ్యాపారస్తుని వరకూ.. ఎవర్నీ వదల్లేదు. వందల మంది ఐటీ అధికారులు హడావుడిగా తిరుగుతూ అలజడి రేపారు. ఐటీ దాడులు కేవలం రాజకీయ ప్రేరేపితమని.. ప్రజలు నమ్ముతున్నారు. బీజేపీని వ్యతిరేకిస్తున్నారని పన్నులు ఎగ్గొట్టేవాళ్లనే ముద్ర వేసి దాడులు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ అధికారం వారి చేతిలో ఉంది కాబట్టి.. ఎవరూ ఏమీ చేయలేరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com