పాకిస్తాన్, భారత్ మధ్య ఆదివారం ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే భారత్ చేతిలో ఓ సారి పరువు పోగొట్టున్న పాకిస్తాన్ కు ఈ నాలుగు రోజుల్లో జరిగిన పరిణామాలు మరింత ఇబ్బందికరంగా మారాయి. టోర్నీని బాయ్ కాట్ చేస్తామని బెదిరించి..బెట్టు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో తప్పనిసరిగా ఆడుతున్నారు. టోర్నీ నుంచి వైదొలిగితే భారీగా జరిమానా కట్టాల్సి ఉంటుంది.
గతంలో పాకిస్తాన్, ఇండియా మ్యాచ్ సందర్భంగా షేక్ హ్యాండ్స్ లేకుండా చేసింది రిఫరీ ఆండి పైక్రాఫ్ట్ అని ఆయనను తప్పించాలని పాక్ డిమాండ్ చేసింది. అంత సీన్ లేదని ఐసీసీ స్పష్టం చేసింది. కనీసం తాము ఆడే మ్యాచ్లకు ఆయన వద్దని కోరినాపట్టించుకోలేదు. చివరికి క్షమాపణలు చెప్పించాలని విజ్ఞప్తి చేసింది. రిఫరీ.. చెప్పీ చెప్పనట్లుగా క్షమాపణలు చెప్పారు కానీ.. పాక్ టీం దాన్ని రికార్డు చేసి.. విడుదల చేసింది. దానిపై వివాదం జరుగుతోంది.
ఈ క్రమంలో భారత్, పాక్ మధ్య సూపర్ ఫోర్ మ్యాచ్ కు కూడా పైక్రాఫ్ట్నే రిఫరీగా ఖరారు చేశారు. ఈ మ్యాచ్ లో కూడా షేక్ హ్యాండ్స్ ఉండవని చెప్పాల్సిన పని లేదు. అదే సమయంలో పాకిస్తాన్ పైక్రాఫ్ట్ విషయంలో రాజీ పడాల్సిందే్. టోర్నీ ముగిసిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై .. ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టోర్నీలో పాక్ ప్రవర్తన ప్రొఫెషనల్ గా లేదని ఐసీసీ ఇప్పటికే నిర్ణయించింది.