రివ్యూ: యాంగర్ టేల్స్ (వెబ్ సిరీస్ )

కోపం కూడా ఓ బలమైన భావోద్వేగం. ప్రతి మనిషికి ఎదో ఒక దశలో కోపం వస్తుంది. ఎదో కారణం చేత మొదట చిరాకు పుట్టి తర్వాత సహానం కోల్పోయి చివరకు కోపాన్ని ప్రదర్శించడం మానవనైజం. ఈ కోపం చుట్టూ అల్లుకున్న నాలుగు కథల ఆంథాలజీ ‘యాంగర్ టేల్స్’. మడోన్నా సెబాస్టియన్, తరుణ్ భాస్కర్ , ఫణి ఆచార్య, సుధ, బిందు మాధవి, వెంకటేష్ మహా, సుహాస్ లాంటి తారాగణంతో నితిన్ ప్రభల తిలక్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరిస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైయింది. కోపం చుట్టూ అల్లుకున్న ఈ నాలుగు కథలు ఎలా వున్నాయి ? వీక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చాయి ?

ఫుడ్ ఫెస్టివల్ :

పూజా రెడ్డి ( మడోన్నా సెబాస్టియన్) మాంచి ఫుడ్డీ. వెజ్, నాన్ వెజ్ ఏదైనా గట్టిగా లాగించేయడం అలవాటు. అయితే రాజీవ్ (తరుణ్ భాస్కర్ ) ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఆహార అలవాటు పూర్తిగా మారిపోతుంది. రాజీవ్ ఇంట్లో నాన్ వెజ్ వాసన వస్తేనే మహా పాపంగా ఫీలైపోతారు. అంతా వీగన్స్. ఇంట్లోనే కాదు.. వాళ్ళు ఉంటున్న కమ్యునిటీ అంతా కరుడుగట్టిన శాఖాహారులు. పూజాకి వెజ్ బోర్ కొట్టేస్తుంది. పైగా ఒక్కసారిగా ఆహారపు అలవాటు మారిపోవడం వలన కాస్త బలహీపడుతుంది. రోజుకి రెండు గుడ్లు తినమని సలహా ఇస్తుంది డాక్టర్. మరి పూజా గుడ్లు తినగలిగిందా? గుడ్లు తినడానికి తను ఎలాంటి ఫైటింగ్ చేసింది? అనేది కథ.

తమకు నచ్చిన ఆహారం తీసుకునే స్వేఛ్చ అందరికీ వుంటుంది. కొందరికీ మాత్రం ఇది సాధ్యపడకపోవచ్చు. ఇంట్లో పద్దతులు ఆహారపు అలవాట్లు వేరుగా వుంటే.. మిగతా వారిపై కూడా ఆ అలవాట్లని రుద్దే ప్రయత్నం జరుగుతుంది. ఇలా బలవంతంగా రుద్దితే ఒక మనిషికి ఎంత కోపం వస్తుంది? ఆ కోపాన్ని ఎలా ప్రదర్శించిదనే ఆలోచన నుంచి పుట్టిన కథ ఇది. పూజా కోపంలో అర్ధం వుంది. అయితే ఈ పాయింట్ చెప్పడానికి సాగదీత ఎక్కువైయింది. ఇంట్లో వాళ్లకి తెలియకుండా బయట తినొచ్చు కదా అని పూజాకి తన ఫ్రండ్ సలహా ఇస్తుంది. అలా చెప్పకుండా దొంగ చాటుగా తినడం ఇష్టం లేని పూజా.. గుడ్లు ఇంటికి తెచ్చుకొని.. మళ్ళీ దొంగ చాటుగానే వండుకొని తినడంలో పాత్ర తాలూకు ఔచిత్యం ఏమిటో అర్ధం కాదు. ఈ కథకి ముగింపు కూడా సింపుల్ గానే తేల్చేశారు. మడోన్నా, తరుణ్ భాస్కర్ తమ పాత్రలలో సహజంగా కనిపించారు.

హెల్మెట్ హెడ్ :

గిరిధర్ (ఫణి ఆచార్య) ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో పని చేస్తుంటాడు. తనకి ముఫ్ఫై మూడేళ్ళు. అయితే జుట్టు రాలిపోయి బట్టతల రావడం చేత పదేళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటాడు. చిన్నప్పుడే తల్లితండ్రులని కోల్పోయిన గిరిధర్.. పెద్దమ్మ సుధ వద్ద ఉంటాడు. గిరికి పెళ్లి చేసే ప్రయత్నంలో వుంటుంది సుధ. గిరి బట్టతల చూసి అమ్మాయిలంతా పెళ్లి నిరాకరిస్తుంటారు. ఇంతలో గిరి ఉద్యోగం కూడా పోతుంది. బట్టతలతో తన కాన్ఫిడెన్స్ పోతుంది. హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేసి మళ్ళీ జట్టుపొందాలని అనుకుంటాడు. గిరికి జుట్టు తిరిగొచ్చించా ? తన జుట్టుపోవడానికి కారణాలు ఏమిటి ? అనేది కథ.

ఈ కథ చాలా ఆసక్తికరంగానే మొదలుపెట్టాడు దర్శకుడు. అయితే ఈ కథ ద్వార తను చెప్పే పాయింట్ లో క్లారిటీ లేకుండాపోయింది. పెద్దమ్మ పాత్ర ద్వారా ఒక ఎమోషన్ యాంగిల్ తీసుకురావడం, పాలసీ డబ్బులతో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేసుకోవడం, తిరిగి పశ్చాత్తాపం చెందడం ఇవన్నీ గంధరగోళంగా అనిపిస్తాయి. హెల్మెట్ వాడకం వలన కూడా జుట్టు రాలిపోతుందని ఓ డాక్టర్ ద్వార చెప్పించడం, హెల్మెట్ వాడకం తప్పనిసరి చేసిన ప్రభుత్వంపై గిరి కేసు వేసి తన కోపాన్ని ప్రదర్శించడం సిల్లీగా అనిపిస్తుంది.

జుట్టు రాలడానికి ప్రధాన కారణం.. జీన్స్ (వంశపారపర్యం), జీవనశైలి, ఒత్తిడి, పోషకాహార లోపం. జుట్టు రాలడం అనేది యువతని వేధించే ఒక సమస్యే. కానీ హెల్మెట్ కారణంగా జుట్టు రాలిపోతుందని చెప్పి ప్రాణం కాపాడే హెల్మెట్ కి వ్యతిరేకంగా ప్రభుత్వం కేసు వేసే గిరి చూసినప్పుడు.. అతడిలో కోపం కన్నా..అసమర్ధుడి పాత్రే ఎక్కువగా హైలెట్ అవుతుంది. నటన పరంగా మాత్రం ఫణి ఆచార్యకి మంచి మార్కులు పడతాయి.

అఫర్ట్ నూన్ నాప్ :

రాధ(బిందు మాధవి) గృహిణి. రాధ భర్త (రవీంద్ర విజయ్) ఓ మామూలు ఉద్యోగి. ఓ పాత ఇంట్లో అద్దెకి వుంటారు. ఇంట్లో పనులు, ఖాళీ దొరకితే మిషన్ కుట్టడం ఇదే రాధ ప్రపంచం. అయితే రాధకు మైగ్రేన్ తలనొప్పి వేదిస్తుంటుంది. భోజనం చేసి కాసేపు హాయిగా నిద్రపడితేనే ఆమెకు హాయి. వున్నఫలంగా ఏదైనా అలికిడి వలన మెలకువ వచ్చేస్తే రాధ తలనొప్పి మరింత పెరుగిపోతుంది. ఇలా వుండగా ఓ రోజు యజమాని ఇంట్లోకి ముగ్గురు చుట్టాలు తిగుతారు. రోజూ మెట్లపై కూర్చుని సరిగ్గా రాధ నిద్రపోయే సమయంలో గట్టిగా నవ్వుతూ మాట్లడుతారు. అంతగట్టిగా మాట్లాడొద్దని ఒకసారి మర్యాద చెబుతుంది రాధ. కానీ వారిలో మార్పు రాదు. ఈ సంగతి భర్తకు చెప్పిన లాభం లేదు. చివరికి రాధ ఎలాంటి పని చేసింది ? వారికీ ఎలా బుద్ధి చెప్పిందనేది కథ.

రాధకు వచ్చే కోపంలో అర్ధం వుంది. అయితే ఆ కోపం రావడానికి గల కారణాలని ఇంకా బలంగా చూపించాలనిపించింది. చిన్న పాయింట్ ని ఎక్కువ సమయం సాగదీసారనే అభిప్రాయం కూడా కలుగుతుంది. ఎంత ఓటీటీ అయినా మాత్రం కాపీ పెట్టడం, పాటలు వింటూ తాగడం పదేపడే అవే సీన్స్ ని రిపీట్ చేసినట్లుగా వుంటాయి. చివర్లో రాధ చేసే పని మాత్రం తను ఎంత ఇబ్బంది పడిందో అవతలి వ్యక్తులకు తెలియజేసింది. రాధ పాత్రలో బిందు మాధవి నటన బావుంది. చాలా పద్దతిగా కనిపించింది. రవీంద్ర విజయ్ నటన డీసెంట్ గా వుంది.

బెనిఫిట్ షో :

రంగా ( వెంకటేష్ మహా ) ఓ స్టార్ హీరో అభిమాన సంఘ ప్రెసిడెంట్. అభిమాన హీరో నటించిన ‘బ్లాస్టర్’ సినిమా ఫ్యాన్స్ బెనిఫిట్ షోని చాల కష్టపడి ప్లాన్ చేస్తాడు. టికెట్లన్నీ అమ్మేస్తారు. 70 రూపాయిల టికెట్ 1200 వందలకి వెళుతుంది. ఇక్కడ విషయం డబ్బు కాదు.. అనుకున్న సమయానికి ఫ్యాన్స్ షో గ్రాండ్ గా పడిపోవాలి. థియేటర్ ని వైభవంగా ముస్తాబు చేస్తారు. రాత్రి పదిగంటలకు షో. అయితే డిస్ట్రిబ్యుటర్ నుంచి రావాల్సిన కీ రాదు. ఆయన ఫోన్ కూడా ఎత్తడు. పచ్చబోటు శీను(సుహాస్) రాజకీయ పలుకుబడి వున్న లోకల్ లీడర్. తన బలగంతో థియేటర్ వద్దకు వచ్చి షో ఎప్పుడని గోల చేస్తుంటాడు. థియేటర్ వద్ద వున్న ఫ్యాన్స్ అంతా రంగా మీదపడతారు. తర్వాత రంగా ఏం చేశాడు ? ఫ్యాన్స్ షో పడిందా ? లేదా ? పచ్చబొట్టు శీను, రంగాకి మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరింది ? అనేది మిగతా కథ.

సిరిస్ మొత్తంలో మంచి స్క్రీన్ ప్లే, ఫన్, ఉత్కంఠ వున్న కథ ఇది. ఒక అభిమాని అభిమానాన్ని, అతని కోపాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు. ఒక సినిమా పొతే హీరో నిర్మాతలు పంపిణీ దారులకు కొంత డబ్బు వెనక్కి ఇచేస్తాడు. అదే కాంబినేషన్ లో మరో సినిమా అని ప్రకటిస్తాడు. కానీ విడుదల రోజు భారీ కటౌట్లు కట్టి, పాలాభిషేకాలు చేసిన అభిమానుల గురించి వాళ్ళ అభిమానం గురించి ఎప్పుడైనా పట్టించుకున్నాడా? కనీసం వాళ్ళ గురించి అలోలించాడా ? ఒక సినిమా సరిగ్గా ఆడకపోతే అభిమానుల పడే ఆవేదన అవమానం గురించి పట్టించుకున్నాదా ? వాళ్ళకు కలిగిన నష్టాన్ని భర్తీ చేశాడా ? ఇలా చాలా ప్రశ్నలు ఈ కథలో లేవనెత్తారు. ఎక్కడా బోర్ కొట్టించకుండా కథనం నడిపారు. ‘ఫ్యాన్స్ షో ఆలస్యం కారణంగా థియేటర్ ని ద్వంస చేసిన అభిమానులు’’ ఇలాంటి హెడ్ లైన్స్ చూస్తుంటాం. అలా ద్వంసం చేయడానికి గల కారణాలు ఏమిటి ? అనేది రంగా కథలో చాలా వివరంగా చూపించారు. చివర్లో రంగా హీరో ఇంటి ముందు నిరసన తెలిపి తన కోపాన్ని ప్రదర్శించి యాంగర్ టేల్స్ కి జస్టిఫికేషన్ ఇచ్చాడు . వెంకటేష్ మహా, సుహాస్ లా నటన ఇందులో ప్రధాన ఆకర్షణ. ఈ కథలో చాలా సెన్సార్ డైలాగులు వున్నాయి. సహజంగా చూపించే ప్రయత్నంలో మోతాదుకు మించిన ఎ సర్టిఫికేట్ డైలాగులు వాడారు. సినిమా పరిశ్రమ పై అవగాహన ఆసక్తి వున్న వాళ్లకు రంగా కథ మరింత కనెక్టింగ్ గా వుంటుంది.

నాలుగు కథల్లో సంగీతం, కెమరాపనితనం డీసెంట్ గా వున్నాయి. రంగా కథలో వున్న వేగం, ఆసక్తి మిగతా మూడు కథల్లో కూడా కనిపించి వుంటే.. ‘యాంగర్ టేల్స్’ కి ఫుల్ మార్కులు పడేవి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

అనుప‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో కీర‌వాణి!

బాలీవుడ్ స్టార్ అనుప‌మ్ లో ఓ న‌టుడే కాదు, ద‌ర్శ‌కుడూ ఉన్నాడు. 2002లో ఓం జై జ‌గ‌దీష్ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర‌వాత ఇప్పుడు 22 ఏళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ...

బెల్లంకొండ పాంచ్ ప‌టాకా!

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ య‌మ స్పీడుగా ఉన్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. 'టైస‌న్ నాయుడు' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా' ఫేమ్ మున్నాతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు...

చివరి క్షణం టిక్కెట్‌తో గుడివాడ అమర్నాథ్‌కు మరిన్ని కష్టాలు !

రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు అనూహ్య పరిణామాల మధ్య గాజువాక అసెంబ్లీ టికెట్ ఖాయమైంది. నియోజకవర్గంలో అడుగు పెట్టీ పెట్టగానే ఆయనకు స్థానిక నేతల నుంచి అసంతృప్తి సెగ తగిలింది. నియోజకవర్గంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close