వరుసగా 9 హిట్లతో.. తన విజయ యాత్ర కొనసాగిస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి. గతేడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. ఈసారి పండక్కి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ని దింపాడు. రెండూ సూపర్ హిట్టే. 2027 సంక్రాంతికీ ఓ బొమ్మ బరిలో దించాలని ఫిక్సయ్యాడు. వెంకటేష్ తో ‘సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం’ సినిమాని పట్టాలెక్కించడం దాదాపు ఖాయం అనే సంకేతాలు అందుతున్నాయి.
అయితే బాలకృష్ణతో సినిమా అనే ఆప్షన్ కూడా అనిల్ ముందు ఉంది. వీరిద్దరి కలయికలో ‘భగవంత్ కేసరి’ వచ్చి హిట్టు కొట్టింది. అప్పుడే మరో సినిమా చేయాలని ఫిక్సయ్యారు. బాలయ్యకు సరిపడా కథ కూడా అనిల్ రావిపూడి దగ్గర సిద్ధంగా ఉంది. వెంకీ, బాలయ్య ఇద్దరిలో ఎవరైనా అనిల్ రావిపూడికి ఓకే. కానీ.. ఇక్కడ కొన్ని సమీకరణాలు వర్కవుట్ కావాల్సివుంది. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేయాల్సివుంది. ఈ సినిమా పట్టాలెక్కడానికి కాస్త ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే.. బాలయ్యతో రావిపూడి సినిమా ఓకే. వెంకీ ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ వేసవిలో విడుదల కానుంది. ఆ తరవాత తనకంటూ కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ అనిల్ రావిపూడి కోసం పక్కన పెట్టి సినిమా చేస్తాడా, లేదంటే రావిపూడిని వెయిటింగ్ మూడ్ లో పెడతాడా? అనేది చూడాలి. అనిల్ లాంటి దర్శకుడ్ని పక్కన పెట్టి సినిమాలు చేసే ధైర్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరూ చేయలేరు. కాబట్టి వెంకీ ఆప్షన్ అనిల్ రావిపూడి అయ్యే అవకాశాలే ఎక్కువ. కాకపోతే.. అనిల్, వెంకీ మధ్య ఓ మీటింగ్ జరగాల్సివుంది. ఆ తరవాతే.. ఈ కాంబోపై ఓ స్పష్టత వస్తుంది. అయితే ఈలోగా అనిల్ – వెంకీ కాంబో ఫిక్సయిపోయిందన్న వార్తలు ఊపందుకొన్నాయి. వీటిపై ఇప్పటి వరకూ వెంకీ గానీ, అనిల్ రావిపూడి కానీ స్పందించలేదు.
