ఫ్యామిలీ కథలూ, ఎంటర్టైన్మెంట్ జోనర్లే సేఫ్ అని బలంగా నమ్మిన దర్శకుడు అనిల్ రావిపూడి. అలాంటి కథలతోనే హిట్లు, సూపర్ హిట్లు కొట్టాడు. పైగా సంక్రాంతి సీజన్లో తన సినిమా ఉండి తీరాలి. ఆ సీజన్ లో కుటుంబ కథా చిత్రాలకే పెద్ద పీట. 2026 సంక్రాంతికి ఫ్యామిలీ స్టోరీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి 2027 సంక్రాంతికి కూడా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకొన్నాడు. ఈసారి కూడా ఫ్యామిలీ డ్రామా, మల్టీస్టారర్ కాన్సెప్టుతో సినిమా సిద్ధం చేయడానికి సమాయాత్తం అవుతున్నాడు.
వెంకటేష్ – అనిల్ రావిపూడి నుంచి ఇప్పటి వరకూ వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్టే. ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం.. అన్నీ బాగా ఆడాయి. మొన్నొచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’లో కూడా వెంకీ అదరగొట్టారు. ఇప్పుడు వీళ్ల కాంబోలో 5వ సినిమా. ఈసారి ఫహద్ ఫాజిల్ కూడా వెంకీతో పాటుగా నవ్వించే బాధ్యత తన భుజాలపై వేసుకొన్నారు. అలవాటు ప్రకారం అనిల్ రావిపూడి కుటుంబ కథే రాసుకొన్నారు. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ తోడల్లుళ్ల కథ అయితే ఈసారి బావ – బామ్మర్దిల స్టోరీ. వదిన, మరదళ్ల మధ్య నలిగిపోయిన ఈ ఇద్దరు మగాళ్లు, వాళ్ల ఫస్ట్రేషన్.. ఈసారి వినోదాన్ని పంచబోతోంది. టైటిల్ కూడా ఫిక్స్ చేసుకొన్నారు. ఈసారి టైటిల్ లో.. ‘పండక్కి వస్తున్నారు’, ‘సంక్రాంతి కి వస్తున్నాం’ వైబ్స్ కనిపించబోతున్నాయని తెలుస్తోంది. త్వరలోనే టైటిల్ రిజిస్టర్ చేయిస్తారు. ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నారు. అది అయిన వెంటనే… రావిపూడి సినిమా మొదలవుతుంది.


