అఖిల్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్.. ఏజెంట్. ఈ సినిమాపై అక్కినేని అభిమానులు చాలా ఆశలు పెట్టుకొన్నారు. సురేందర్ రెడ్డి.. అఖిల్ కి పెద్ద హిట్ ఇస్తారని ఆశ పడ్డారు. కానీ అంచనాలు తల్లకిందుల్లయ్యాయి. ఫ్లాప్ మాట పక్కన పెడితే.. సినిమా బాగా ట్రోల్ అయ్యింది. నిర్మాత అనిల్ సుంకరకు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఆయన కెరీర్లో చాలా హిట్లు, ఫ్లాపులు చూశారు. కానీ ‘ఏజెంట్’ ఫ్లాప్ మాత్రం ఆయన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది.
”అఖిల్ విషయంలో నేను చాలా రిగ్రేట్ ఫీల్ అవుతున్నాను. ఏజెంట్ తో మంచి హిట్ ఇద్దామనుకొన్నాం. కుదర్లేదు. ముందు నుంచీ సినిమాని ఏవో అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. కోవిడ్ ప్రభావం కూడా ఆ సినిమాపై ఉంది. అందరూ కష్టపడ్డాం. కానీ అందరి కష్టం.. వృథా అయిపోయింది. ఈ ఫ్లాప్ కి ఒక్కర్నే బాధ్యుల్ని చేయడం లేదు. అందరూ నష్టపోయాం” అని ‘ఏజెంట్’ నాటి రోజుల్ని గుర్తు చేసుకొన్నారు అనిల్ సుంకర.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ లో వచ్చిన ‘భోళా శంకర్’తోనూ అనిల్ బాగా నష్టపోయారు. అయితే ఆ సమయంలో చిరంజీవి ఆయన్ని ఆదుకొన్నారని చెప్పారు. ”సినిమా విడుదలైన తరవాత, రిజల్ట్ తెలిశాక ఆయన్ని కలిశాను. అన్ని విషయాలూ మర్చిపో. రిలాక్స్ అవ్వు.. అన్నారు. ఆయనకు పేమెంట్ ఇవ్వాల్సివుంది. కానీ ఆయన తీసుకోలేదు. ఆర్థికంగా అండదండగా నిలిచారు” అని చెప్పుకొచ్చారు అనిల్.
విచిత్రం ఏమిటంటే ‘భోళా శంకర్’కి కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఈ విషయం ప్రస్తావిస్తే… ”ఆ సినిమాని ముందు నుంచీ కావాలని కొంతమంది నెగిటీవ్ చేశారు. సినిమా రిలీజ్ కాకముందే ఫ్లాప్ అంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు వాళ్లంతా తమ కర్మ అనుభవిస్తున్నారు” అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. అనిల్ సుంకర నిర్మించిన `నారీ నారీ నడుమ మురారీ` ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. శర్వానంద్ కథానాయకుడిగా నటించారు. శ్రీవిష్ణు అతిథి పాత్రలో మెరవబోతున్నారు.
