అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడేకొద్దీ .. తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అధికార డీఎంకే స్మూత్ గా తన పనులు తాను చేసుకుపోతోంది కానీ విపక్ష పార్టీలు మాత్రం కిందా మీదా పడుతున్నాయి. కొత్త ప్రత్యర్థి జోసఫ్ విజయ్ కు పొత్తులు పెట్టుకోవడానికి పార్టీలు దొరకడంలేదు. ఒంటరి పోటీ అంటున్నారు. ఆయనకు మద్దతిచ్చే వర్గాలు కూడా ఇంకా ఆయనతో కలిసి నడిచేందుకు ధైర్యం చూపించలేకపోతున్నాయి. మరో వైపు రాష్ట్రం మొత్తం బలమైన క్యాడర్ ఉన్న అన్నాడీఎంకే రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి.
అన్నాడీఎంకేలోకి వచ్చేందుకు పన్నీర్ సెల్వం, శశికళ ప్రయత్నాలు
అన్నాడీఎంకేలో మళ్లీ చేరి రాజకీయాలు చేయాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రయత్నిస్తున్నారు. జయలలిత జైలుకు వెళ్తున్నప్పుడు ఆమె చాయిస్ గా పన్నీర్ సెల్వం ఉండేవారు. జయలలిత చనిపోయాక ఆ స్థానాన్ని పళనిస్వామి తీసుకున్నారు. దీంతో పన్నీర్, పళనిస్వామి వర్గాల మధ్య తేడాలొచ్చాయి. బీజేపీ హైకమాండ్ ఏదో విధంగా సర్దుబాటు చేసి ఇద్దరితో ప్రభుత్వాన్ని నడిపించారు. ఎన్నికలలో ఓడిపోయాక.. ఇక ఇద్దరికీ పట్టపగ్గాల్లేవు. చివరికి పళనిస్వామిది పైచేయి అయింది. పన్నీర్ సెల్వంనుంచి పార్టీ నుంచి గెంటేశారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఆయనతో పాటు శశికళ కూడా పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్నాడీఎంకేకు చెందిన అన్ని వర్గాలు కలిస్తే విజయం ఖాయమని అనుకుంటున్నారు.
అన్నాడిఎంకేను గెలిపిస్తానంటున్న శశికళ
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే.. జైలు శిక్ష పూర్తి చేసుకుని వచ్చిన శశికళ.. రాజకీయాల్లో మళ్లీ తనదైన ముద్ర వేయాలనుకుంటున్నారు. కానీ అన్నాడిఎంకేలోకి అడుగు పెట్టలేకపోతున్నారు. గత నెలలో తాను అన్నాడీఎంకే ను గెలిపించేందుకు ప్రయత్నిస్తానని ప్రకటించారు. అన్నాడీఎంకేలో తనదైన ముద్ర వేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. 2024 లోక్సభ ఓటమి తర్వాత అందరం కలసి పని చేయాల్సిన సమయమని అన్నాడీఎంకే క్యాడర్ కు లేఖ రాశారు. శశికళకు బీజేపీ మద్దతు ఉందని..ఆమెను అన్నాడీఎంకేలోకి చేర్చుకోవాలన్న ఒత్తిడి ఆ పార్టీ చేస్తోందన్న ప్రచారం తమిళనాట జరుగుతోంది.
పన్నీర్, శశికళను రానివ్వని పళనిస్వామి
జయలలిత తర్వాత అన్నాడీఎంకే పళనిస్వామి చేతుల్లోకి వెళ్లింది. ఇప్పుడు శశికళ, పన్నీర్ సెల్వం పార్టీలోకి వస్తే తన ఆధిపత్యానికి గండి పడుతుందని ఆయన రానివ్వడం లేదు. కానీ వీరిద్దరూ తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. ఇటీవల పన్నీర్ సెల్వం… సీఎం స్టాలిన్ తో సమావేశమయ్యారు.కానీ డీఎంకేలో చేరాలని అనుకోవడం లేదని ప్రకటించారు. శశికళ అలాంటి ప్రయత్నాలు చేయలేదు కానీ.. అన్నాడీఎంకే లీడర్, క్యాడర్లలో తన పలుకుబడి పెంచుకునే ప్రయత్నాలు బయట నుంచే చేస్తున్నారు. ఈ సమస్యను అన్నా డీఎంకే పరిష్కరించుకోకపోతే.. ఎన్నికలకు ముందు కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది.