రివ్యూ: అన్నీ మంచి శ‌కున‌ములే

Anni manchi Sakunamule movie review

రేటింగ్‌: 2.5/5

అన్నీ మంచి శ‌కున‌ములే…

ఈ మ‌ధ్య కాలంలో ఇంత పాజిటీవ్ టైటిల్ ఎవ‌రూ పెట్ట‌లేద‌నుకొంటా.
తెర‌పై చూస్తే… రాజేంద్ర‌ప్ర‌సాద్‌, గౌత‌మి, రావు ర‌మేష్‌, ఊర్వ‌శీ, న‌రేష్‌, వాసుకీ… అన్నింటికీ మించి షావుకారు జాన‌కీ. ఇంత అరుదైన క‌ల‌యికా ఏ పోస్ట‌ర్ పైనా క‌నిపించ‌లేదు.

ఓ బేబీ లాంటి సూప‌ర్ హిట్ ఇచ్చిన నందిని రెడ్డి.

సీతారామం లాంటి క్లాసిక్ ఇచ్చిన స్వ‌ప్న సినిమా సంస్థ‌.

ఆశ‌లూ, అంచ‌నాలూ పెర‌గ‌డానికి ఇంకేం కావాలి..? పైగా స‌మ్మ‌ర్ లో ఓ ఫ్యామిలీ సినిమా అంటే.. ఇంత‌కు మించి మంచి త‌రుణం ఉండ‌దు. అందుకే ఈ సినిమాపై అంద‌రి ఫోక‌స్ ప‌డింది. మ‌రి… శకునం మంచిదేనా..? పోస్ట‌ర్ పై ఉన్న మెరుపులు థియేట‌ర్లోనూ క‌నిపించాయా?

ఓ కాఫీ ఎస్టేట్ గొడ‌వ‌.. దాని వ్య‌వ‌హారాలతో క‌థ మొద‌ల‌వుతుంది. రెండు కుటుంబాలు వంశ పారంప‌ర్యంగా ఓ కాఫీ ఎస్టేట్ గురించి కొట్టుకొంటుంటారు. సుధాక‌ర్ (న‌రేష్‌), ప్ర‌సాద్ (రాజేంద్ర ప్ర‌సాద్‌) కాఫీ ఎస్టేట్ మాదంటే మాదంటూ.. ఎమోష‌న‌ల్‌గా కొట్టుకొంటుంటారు. విధి ఆడిన వింత నాట‌కంలో.. సుధాక‌ర్‌కి పుట్టిన కొడుకు.. ప్ర‌సాద్ ఇంటికీ, ప్ర‌సాద్ కి పుట్టిన కూతురు సుధాక‌ర్ ఇంటికీ చేరిపోతారు. అంటే.. బిడ్డ‌ల మార్పిడి జ‌రుగుతుంద‌న్న‌మాట‌. అది కూడా యాక్సిడెంట‌ల్ గా. అయితే ఆ పిల్ల‌లు రిషి (సంతోష్ శోభ‌న్‌), ఆర్య (మాళ‌విక నాయ‌ర్‌) ఇద్ద‌రూ స్నేహితుల్లానే క‌లిసి మెల‌సి ఉంటారు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో చిన్న చిన్న అపార్థాల వ‌ల్ల గొడ‌వ‌లు వ‌స్తుంటాయి. విడిపోతారు, అంత‌లోనే క‌లుస్తారు. ఇలానే పెద్ద‌వాళ్లూ అవుతారు. మ‌రి.. వీరిద్ద‌రి వ‌ల్ల ఆ కోర్టు స‌మ‌స్య‌లు తీరాయా? రెండు కుటుంబాల మ‌ధ్య అనుబంధానికి బీజం ఎలా ఏర్ప‌డింది? అందుకోసం వీళ్లేం చేశారు? అనేది మిగిలిన క‌థ‌.

ఫ్యామిలీ ఎమోష‌న్స్ తో సినిమాని న‌డ‌ప‌డానికి పెద్ద పెద్ద క‌థ‌లేం అవ‌స‌రం లేదు. చిన్న చిన్న మూమెంట్స్ చాలు. వాటిని న‌మ్ముకొనే ఈ సినిమాని తీసి ఉంటుంది నందిని రెడ్డి. కాక‌పోతే… ఈ క‌థ ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉండాల‌న్న ఉద్దేశంతో కాఫీ ఎస్టేట్ అంటూ కోర్టు గొడ‌వ‌ల్ని క‌లుపుకొంది. మ‌రోవైపు… ఆర్య‌, రిషిల ప్రేమ‌క‌థ‌. అంటే.. ఈ క‌థ‌లో చాలా లేయ‌ర్స్ ఉన్నాయ‌న్న‌మాట‌. క‌థ బ‌లంగా మార‌డానికి ఈ నేప‌థ్యం స‌రిపోతుంది. కాక‌పోతే ఒక్క‌టే స‌మ‌స్య‌. ఈ క‌థ‌ని ఏ కోణంలో చూడాలో, ఎవ‌రి పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్లాలో ప్రేక్ష‌కుడికి అర్థం కాదు. కోర్టు గొడ‌వ నుంచి క‌థ ఎత్తుకొని, పిల్ల‌ల మార్పిడిలోకి వెళ్లి, ప్రేమ క‌థ‌లోకి మారి.. ఇలా ర‌క‌ర‌కాలుగా రూపాంత‌రం చెందుతూ ఉంటుంది. తెర నిండా న‌టీన‌టులు క‌నిపించ‌డం క‌ల‌ర్‌ఫుల్‌గానే ఉంటుంది. కానీ.. పాత్ర‌లు ఎక్కువైతే.. పిండి త‌గ్గుతుంది. ఎవ‌ర్ని ఫాలో అవుతూ ఈ క‌థ‌ని వినాలో అర్థం కాదు. రిషిగా సంతోష్ శోభ‌న్ క‌థ ప్ర‌కారం హీరో. కానీ.. అత‌ని స్కోప్ చాలా తక్కువ‌. రిషి ప్ర‌మేయం లేకుండానే క‌థ‌లోని కీల‌క‌మైన విష‌యాలు జ‌రిగిపోతుంటాయి. అలాంటప్పుడు రిషి కేవ‌లం ప్రేక్ష‌క పాత్ర వ‌హిస్తాడు. హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ క‌థ సాగ‌లేదు. దాంతో.. క‌థ‌లోకి కీల‌క‌మైన ఎమోష‌న్‌.. ప్రేక్ష‌కుడు అస్వాదించ‌లేక‌పోతాడు.

అలాగ‌ని ఫీల్ గుడ్ ఎమోష‌న్స్ లేవ‌ని కాదు. అవీ ఉన్నాయి. అన్నాద‌మ్ముల అనుబంధం చెబుతూ న‌రేష్‌, రావు ర‌మేష్‌ల మ‌ధ్య ఓ సీన్ వేశారు. అక్క‌డ పెద్ద పెద్ద డైలాగులేం ఉండ‌వు. చిన్న చిన్న ఎమోష‌న్స్ మాత్ర‌మే ఉంటాయి. కానీ… `ఇలాంటి సీన్ చూసి ఎంత కాల‌మైంద్రా బాబూ` అనిపిస్తుంది. `నేను ఈ ఇంటి బిడ్డ‌ని కాను` అని హీరోయిన్‌కి తెలిసిన న‌ప్పుడు.. భోజ‌నం చేస్తూ.. `నువ్వు నా అమ్మ‌వే.. నువ్వు నా అక్క‌వే… ఇది నా ఇల్లే.. మీరంతా నా వాళ్లు` అంటున్న‌ప్పుడు క‌ళ్ల‌ల్లో నీళ్లు తిరుగుతాయి. తండ్రి తాక‌ట్టు పెట్టిన ఇంటిని కూతురు త‌న క‌ష్టార్జీతంతో తిరిగి సాధించి, నాన్న‌కు కానుక‌గా ఇస్తున్న‌ప్పుడు ఇలాంటి కూతుర్లు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి హార్ట్ ట‌చింగ్ విష‌యాల్ని ద‌ర్శ‌కురాలు ఇంకొన్ని ప‌ట్టుకొంటే బాగుండేది.

అయితే క‌థ‌లో మిస్స‌యిన బ‌ల‌మైన విష‌యం.. ప్రేమ క‌థ‌. ఆర్య, రిషిల మ‌ధ్య ఎలాంటి అనుబంధం ఉందో.. ద‌ర్శ‌కురాలు స‌రిగా చెప్ప‌లేక‌పోయింది. వాళ్ల‌ది ప్రేమా, స్నేహ‌మా? అనేది ఓ ఫ‌జిల్ గా ఉంటుంది. సినిమా ఇంకాసేప‌ట్లో ముగుస్తుంద‌న‌గా కూడా.. వాళ్ల మ‌ధ్య ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేక‌పోయారు. `ఆర్య అంటే నాకెంత ఇష్ట‌మో..` అని హీరో ఓ డైలాగ్ లో చెబితే స‌రిపోతుందా..? దాన్ని స్క్రీన్ కి చూపించ‌క‌పోతే, హీరో – హీరోయిన్లు క‌లుసుకోవాల‌న్న బ‌ల‌మైన కోరిక ప్రేక్ష‌కుడికి క‌ల‌క్క‌పోతే.. ఇక వాళ్ల ప్రేమ క‌థ‌ని ఎలా ఫీల‌వుతారు? స‌రైన ప్రేమ‌క‌థ రాసుకోక‌పోవ‌డం ఈ సినిమాలోని ప్ర‌ధాన‌మైన లోపం. ఇట‌లీ ఎపిసోడ్ తో కూడా ఒరిగిందేం ఉండ‌దు. వాళ్ల మ‌ధ్య కాన్ఫ్లిక్ట్ రావ‌డానికి అది ఉప‌యోగ‌ప‌డుతుంది అనుకొన్నా – ఇంట్ర‌వెల్ సీన్ బ‌ల‌వంతంగా ఇరికించిన‌ట్టే ఉంటుంది. ఎప్పుడో క‌థ ఆరంభంలో ఎత్తుకొన్న బిడ్డ‌ల మార్పిడి ఎపిసోడ్‌… మ‌ళ్లీ క్లైమాక్స్ లోనే వ‌స్తుంది. బిడ్డ‌ల మార్పిడితో క‌థ మొద‌లెట్ట‌డంలోనూ, ఆ పాయింట్ తోనే క‌థ ముగించ‌డంలోనూ ఈ క‌థ‌కు ఒరిగిందేం లేదు. ఆ పాయింట్ లేక‌పోయినా న‌ష్టం లేదు. పైపెచ్చు. రెండు రెళ్లు ఆరు, అలా వైకుంఠ‌పుర‌ములో… క‌థ‌లు గుర్తుకు రాకుండా ఉండేవి. చివ‌రి ప‌ది నిమిషాల సీన్ల‌నీ చిత్ర‌బృందం బ‌లంగా న‌మ్మింది. ఈ సినిమాని కాపాడేవి అవే అని బ‌లంగా భావించింది. కానీ క్లైమాక్స్ ని ప్రేక్ష‌కుడు ఫీల్ అవ్వాలంటే.. అంత‌కు ముందు స‌న్నివేశాల‌తో క‌నెక్ట్ అవ్వాలి. క‌నెక్ట్ అవుతూ.. క‌ట్ అవుతూ ఓ ప్ర‌యాణం సాగిన‌ప్పుడు.. ఎంత బ‌లంగా క్లైమాక్స్ రాసుకొన్నా ఉప‌యోగం లేదు.

ముందే చెప్పిన‌ట్టు తెర‌పై తారాతోర‌ణం క‌నిపించింది. అంతా ఇష్ట‌మైన వాళ్లే. రాజేంద్ర ప్రసాద్, న‌రేష్‌, రావు ర‌మేష్ అంతా స‌హ‌జంగా న‌టించారు. చాలా కాలం త‌ర‌వాత షావుకారు జాన‌కినిచూడ‌డం బాగుంది. కాకపోతే ఆమె పాత్ర‌కే పెద్ద ప్రాధాన్యం లేదు. వాసుకీ (తొలి ప్రేమ ఫేమ్‌) కూడా అంతే. సంతోష్ ఎప్ప‌టిలా ఈజ్ తో చేశాడు. నందిని రెడ్డి సినిమాల్లో క‌థానాయికలు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఈ సినిమాలో మాళ‌విక కూడా అలానే క‌నిపించింది. ఆమె న‌ట‌న స‌హ‌జంగా ఉంది. కాక‌పోతే తెర‌పై హీరో – హీరోయిన్ల కెమిస్ట్రీ పండ‌లేదు. అది వాళ్లిద్ద‌రి త‌ప్పు కాదు. పండేలా సీన్లు రాసుకోలేదు.

నందిని రెడ్డి చాలా లేయ‌ర్లు వేసుకోవ‌డం వ‌ల్ల దేనికీ న్యాయం చేయ‌లేక‌పోయింద‌నిపిస్తోంది. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ బాగున్నాయి. ఖ‌ర్చుకి నిర్మాత‌లు ఎక్క‌డా వెనుకంజ వేయ‌లేదు. మిక్కీ ఆల్బ‌మ్ లో ఒక్క పాటైనా గుర్తుండిపోయేలా ఉంటుంది. ఈసారి ఆ అవ‌కాశం ద‌క్క‌లేదు. తెర‌పై అనుభ‌వ‌జ్ఞులైన న‌టీన‌టులు క‌నిపించ‌డం వ‌ల్ల‌… చాలా సాధార‌ణ‌మైన సీన్లు కూడా పండాయి. అలాంట‌ప్పుడు స్క్రిప్టు ద‌శ‌లో ఇంకాస్త క‌స‌ర‌త్తు చేసుంటే ఫ‌లితం ఇంకెంత బాగా వ‌చ్చేదో..? అక్క‌డ‌క్క‌డ కొన్ని లైట‌ర్ వే మూమెంట్స్.. ఎమోష‌న్స్‌.. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి కనెక్ట్ అవుతాయి. ఈమ‌ధ్య కుటుంబ స‌మేతంగా చూసేలా సినిమాలు రావ‌డం లేదు. ఈ త‌రుణంలో.. అన్నీ మంచి శ‌కున‌ములే.. కాస్త ఊర‌ట నిస్తుంది. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌, వాళ్ల అభిరుచులే ఈ చిత్రానికి శ్రీ‌రామ ర‌క్ష‌.

రేటింగ్‌: 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: ముక్కోణ‌పు పోటీ

గ‌త‌వారం బాక్సాఫీసు కొత్త సినిమాల్లేక వెల‌వెల‌పోయింది. `స‌ప్త సాగ‌రాలు దాటి` అనే ఓ డబ్బింగ్ సినిమా వ‌చ్చింది కానీ, ఎలాంటి ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింది. ఈసారి... ఏకంగా మూడు క్రేజీ సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి....

ఎల్బీనగర్ కోసమే చంద్రబాబుకు మధుయాష్కీ మద్దతు !

తెలంగాణ సీనియర్ నేత, రాహుల్ కు సన్నిహితుడిగా పేరున్న మధుయాష్కీ ఎల్బీనగర్‌లో పోటీ చేయాలనుకుంటున్నారు. నిజామాబాద్ ఎంపీగా మాత్రమే పోటీ చేసిన మధుయాష్కీ ఈ సారి అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్నారు.కానీ నిజామాబాద్‌లో...

టీడీపీలో చేరనున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

కర్నూలుజిల్లాలో ప్రభావవంతమైన నేతగా పేరున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ప్రస్తుతం ఆయన కుమార్తె బైరెడ్డి శబరి బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నరు. రాయలసీమ హక్కుల కోసం ఉద్యమించే...

స్కిల్ ఫైల్స్ , జీవోలు అన్నీ ” హైడ్ ” – కుట్ర క్లియర్ !

స్కిల్ ప్రాజెక్ట్ కేసులో చంద్రబాబు అవినీతి అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ... గోబెల్స్ ను మించిపోతున్న జగన్ రెడ్డి సర్కార్ తాము చెబుతున్నవన్నీ అబద్దమని.. ప్రభుత్వ వెబ్ సైట్లలోనే... అధికారిక...

HOT NEWS

css.php
[X] Close
[X] Close