అమరావతిలో యాంటీ క్లైమాక్స్‌ ఎందుకయ్యింది?

హైదరాబాద్: సినిమాలలో క్లైమాక్స్‌లో ఏమవుతుంది? అదీ ముఖ్యంగా తెలుగు సినిమాలలో… హీరో అంతా సెట్ చేసి కథను సుఖాంతం చేస్తాడు. నిన్న కార్యక్రమంలో మోడి పెద్దన్న అయినప్పటికీ, హీరో మాత్రం చంద్రబాబే కదా. కానీ పెద్దన్న మోడి హీరో చంద్రబాబును తుస్సుమనిపించటానికి కారణం ఏమిటి?

రాజధానికి భూసేకరణపై ఎన్ని విమర్శలు, వాదనలు ఉన్నా, నిన్నటి శంకుస్థాపన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఒక పాజిటివ్ హైప్‌ను తీసుకొచ్చింది. దానికితోడు చంద్రబాబు బృందం చేసిన హడావుడి వలన పక్కరాష్ట్రం తెలంగాణ ప్రజలనే కాక దేశవ్యాప్తంగా అందరిదృష్టినీ ఆకర్షించింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ దీనిని అది తమ సొంత శుభకార్యమయినట్లు ఫీలయ్యారు. ప్రత్యేకహోదా డిమాండ్, భూసేకరణపై వ్యక్తమయిన విమర్శలు, వాదనలను అందరూ దాదాపుగా మర్చిపోయారు. అందరూ ఆ అపురూప ఘట్టం శంకుస్థాపన కార్యక్రమంకోసం ఎదురుచూశారు. ఆ ఎదురుచూపులలో, ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా, మోడి కనీసం ఏదో ఒక ప్యాకేజి అయినా ప్రకటిస్తారని ఆశించారు. దానికితోడు మోడి ప్యాకేజి ప్రకటించబోతున్నారని శంకుస్థాపన రోజున, ముందురోజున న్యూస్ పేపర్‌లలో కథనాలు వచ్చాయి. ప్యాకేజికి ఏపీ ప్రజలు మానసికంగా సిద్ధమైపోయారు. ఆ అపరూప ఘడియలు రాగానే, నిన్న ఉదయంనుంచీ పనులన్నీ పక్కనపెట్టి టీవీలముందు చేరి గుడ్లప్పగించి చూశారు. ఇంతటి హడావుడి ఏర్పడిన తర్వాత ప్రధానమంత్రి తన ప్రసంగంలో ఏపీకి కనీసం స్పెషల్ ప్యాకేజ్ ప్రకటిస్తే ఎలా ఉండేది? శంకుస్థాపనకు వచ్చిన ఊపు ఎన్నో రెట్లు దూసుకెళ్ళిపోయేది. క్లైమాక్స్ కూడా సుఖాంతమై సినిమా సూపర్ హిట్ అయ్యేది. కానీ మోడి అలా చెయ్యలేదు. పార్లమెంట్ మట్టిని ఏపీ ప్రజల నోట్లో కొట్టి, యమున నీటిని వారి ఆశలపై కుమ్మరించారు.

ప్రధానమంత్రి కార్యాలయంలో, ఆర్థికమంత్రి కార్యాలయంలో ఏపీకి ప్యాకేజిపై కసరత్తు జరిగినట్లు పక్కా వార్తలొచ్చాయి. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి సిద్దార్థనాథ్‌సింగ్ కూడా శంకుస్థాపన కార్యక్రమానికి బయలుదేరుతూ ఢిల్లీలో పార్టీ హెడ్ క్వార్టర్స్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడినపుడు ఏపీకి ప్రధాని ప్యాకేజ్ ప్రకటించబోతున్నట్లు చెప్పారు. మరి ఆఖరి నిమిషంలో ప్యాకేజ్‌ను ప్రకటించకుండా ప్రధాని ఎందుకు విరమించుకున్నారు? దానికి ఒక కారణంగా ఒక వాదన వినబడుతోంది.

శంకుస్థాపన కార్యక్రమం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో… అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ఏపీకి ఇవ్వాలనుకున్న ప్రత్యేక హోదానుగానీ, ప్యాకేజ్‌ను గానీ ప్రకటిస్తే క్రెడిట్ అంతా చంద్రబాబుకు, తెలుగుదేశానికే పోతుంది. అసలే 2019 ఎన్నికలనాటికి బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో ఒక బలమైన శక్తిగా మారాలనుకుంటోంది. ఇటువంటి పరిస్థితులలో కేంద్రం ఇచ్చే సాయం ఘనత తెలుగుదేశానికి ముట్టజెపితే బీజేపీ బావుకునేదేమీ ఉండదు కాబట్టి మోడి నిన్న సభలో దీనిపై ప్రకటన చేయలేదు. ఏపీలో బీజేపీ ఆధ్వర్యంలో – రానున్న రోజులలో – జరిగే ఏదైనా విశేష కార్యక్రమంలోనో, ఏదైనా ప్రత్యేక సందర్భంలోనో కేంద్రం ఏపీకి ఇచ్చే హోదాగానీ, ప్యాకేజ్ గానీ మోడి ప్రకటిస్తారు. ఇదీ మోడి నిన్న తన ప్రసంగంలో ఏ ప్రకటనా చేయకపోవటానికి వెనక ఉన్న మతలబు అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com