మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా సాగుతున్న ఆపరేషన్ ను ఆపేందుకు ప్రాణాలు కాపాడుకునేందుకు మావోయిస్టులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. శాంతి చర్చలకు పిలవాలని.. కోరుకుంటూ లేఖలు విడుదల చేస్తున్నారు. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో వందల కొద్దీ బలగాలు ‘సీజ్ ఎరాడికేషన్ ఆపరేషన్’ను ను నిర్వహిస్తున్నాయని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. ఈ ఆపరేషన్ వెంటనే ఆపాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.
శాంతియుత చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని అందరూ కోరుకుంటున్నారని.. మా పార్టీ ఎల్లప్పుడూ శాంతి చర్చలకు సిద్ధంగా ఉంటుందని కేంద్ర కమిటీ తరపున ఓ సందేశాన్ని మీడియా ద్వారా పంపించారు. కేంద్ర కమిటీ కూడా శాంతి చర్చలకు సంబంధించి లేఖలు జారీ చేసిందని కానీ ప్రభుత్వ ఉద్దేశ్యం వేరేలా కనిపిస్తోందని మావోయిస్టు నేత ఆరోపిస్తున్నారు. శాంతియుత చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వం అణచివేత , హింసను ఉపయోగించి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు.
బీజాపూర్-తెలంగాణ సరిహద్దులో పెద్ద ఆపరేషన్ ప్రారంభమైంది. కీలక మావోయిస్టు హిడ్మాను బలగాలు చుట్టుముట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. మావోయిస్టు పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఆశాకిరణం హిడ్మా అని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయననూ అంతం చేస్తే.. మావోయిస్టు పార్టీకి భవిష్యత్ లేకుండా పోతుంది. ఇప్పటికే మావోయిస్టులు తీవ్రంగా నష్టపోయారు. పెద్ద ఎత్తున లొంగిపోతున్నారు. శాంతి చర్చల ద్వారా ఎన్ కౌంటర్లు ఆపాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.